ఖిలావరంగల్, ఏప్రిల్ 23: తెలంగాణ, ఛత్తీస్గఢ్, బీహార్, జార్ఖండ్ వివిధ రాష్ట్రాలలో ఆదివాసులు, మావోయిస్టు పార్టీ పైన గత కొన్ని నెలలుగా జరుగుతున్న దాడులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వస్తి పలికి శాంతి చర్చలకు ఆహ్వానం పలకాలని తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమైక్య రాష్ట్ర కార్యదర్శి సుద్దాల నాగరాజు అన్నారు. బుధవారం ఖిలావరంగల్లోని అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ కగార్తో భరతమాత తన బిడ్డలను తానే చంపుకున్న పరిస్థితి నెలకొందని ఆరోపించారు. కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చల వైపుగా ఒక శాంతియుత వాతావరణ నెలకొల్పాలని కోరారు.
దీనికి విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామిక వాదులు ముందుకు వచ్చి ముఖ్యంగా దండకారణ్యంలోని ఆదివాసుల జీవించే హక్కులను కాలరాస్తున్న దుశ్చర్యలను ఆపివేసి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి జీవించే హక్కును కొనసాగించే విధంగా కృషి చేయాలన్నారు. మావోయిస్టు, ఆదివాసీలు, పోలీసులు ప్రాణాలు కోల్పోకుండా ఇరుపక్షాలు కాల్పుల విరమణ చేయాలన్నారు. ఇప్పటికే మావోయిస్టులు స్పందించి శాంతి చర్చలకు సిద్దామని ప్రకటించినట్లు తెలిపారు.
మావోయిస్టు పార్టీ రెండుసార్లు చర్చలకు సిద్ధమని ప్రకటనలు చేసిన కేంద్ర ప్రభుత్వం తన కాగర్ ఆపరేషన్ కొనసాగించడం మానవత్వానికి వ్యతిరేకమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని ఏజెన్సీలలో శాంతియుత వాతావరణం నెలకొనే విధంగా కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గజ్జె చందు, మైదాన్ రవన్న, దుబాకీ బాబు, మైదం బాబు, బరిగేలా రాజేందర్, నాగార్జున, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.