హనుమకొండ, ఆగస్టు 9 : కాకతీయుల రాజధాని ఓరుగల్లులో 1886లో నిజాం అసఫ్ జాహీల హయాంలో కట్టిన సుబేదారి బంగ్లాకు నేటితో 140 ఏళ్లు నిండనున్నది. నిజాం కాలం నుంచి పరిపాలన కేంద్రంగా ఉన్న ఈ బంగ్లా నేటికీ చెక్కు చెదరలేదు. స్వాతంత్య్రానికి పూర్వం సుబేదార్లు.. ఇటీవల కాలం వరకు కలెక్టర్ల నివాసంగా ఉన్న ఈ భవనం.. ఇప్పుడు గత జ్ఞాపకాలను తెలియజేస్తున్నది. ప్రస్తుతం దీనిని హెరిటేజ్ భవనంగా మార్చి వారసత్వ సంపదను భావితరాలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించి ఈ బాధ్యతను కుడాకు అప్పగించింది. ఈమేరకు అకడకడగా చిన్నపాటి మరమ్మతులు చేసేందుకు రూ.2కోట్లు మంజూరు చేయగా ఈ ఏడాది ఫిబ్రవరిలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
ప్రస్తుతం హెరిటేజ్ భవనంగా మార్పు
ప్రస్తుతం సుబేదార్ బంగ్లాను హెరిటేజ్ భవనంగా మార్చారు. కోటను తలపించే ప్రవేశద్వా రం, దానిపై పెద్ద గడియారం ఏర్పాటుచేశారు. నిజాం హయాంలోనే అతి పెద్దదైన ఈ బంగ్లా లో సుమారు 22 గదులు ఉన్నాయి. 20 అడుగుల ఎత్తున సీలింగ్ ఉంటుంది. మొదటి అంతస్తులో ఒక విశాలమైన టెర్రస్ ఉంది.
కలపతో చేసిన మెట్లు ఇప్పటికీ చెకు చెదరకపోవడం విశేషం. బంగ్లా చుట్టూ పూల మొకలు, పండ్ల చెట్లుతో పాటు రకరకాల జాతులకు చెందిన వృక్షాలు కనువిందు చేస్తాయి. ఇన్నాళ్లు.. అధికారుల చిరునామాగా ఉన్న సుబేదార్ బంగ్లాకు హెరిటేజ్ భవనంగా మార్చి మరమ్మతులు చేశా రు. రంగులు వేయడం, గ్రీనరీ పెంచడం, టా యిలెట్ల నిర్మా ణం చేపట్టా రు. ఎంతో చ రిత్ర ఉన్న ఈ బంగ్లా ఇప్పు డు ప్రజల చెంతకు చేరిందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వరంగల్ బంగ్లా కేంద్రంగా సుబేదార్ పాలన
ఖులీ కుతుబ్షాహీల పాలన తర్వాత దకన్ ప్రాంతాన్ని అసఫ్ జాహీలు చేజికించుకొని సుమారు ఒకటిన్నర శతాబ్దానికి పైగా పాలన సాగించారు. అసఫ్ జాహీలు పాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని సుబాలుగా విభజించారు. ఒకో సుబాకు తరఫార్ లేదంటే సుబేదార్ స్థాయి అధికారి ఉండేవారు. తానీషా కాలంలో గోలొండ రాజ్యం ఆరు సుబాలుగా ఉండేది. అందులో వరంగల్ ఒకటి. ఈ సుబాలో ఎలగందుల(కరీంనగర్), స్తంభగిరి(ఖమ్మం), దేవరకొండ (నల్గొండ), వరంగల్ సరార్లు ఉండగా, వీటన్నింటికీ ఓరుగల్లు కేంద్రంగా ఉండేది. 1875లో వరంగల్లో భూసర్వే శాఖను స్థాపించారు. ఈ క్రమంలోనే 1886 ఆగస్టు 10న అప్పటి బ్రిటీష్ అధికారి జార్జ్ పాల్మర్ భార్య బంగ్లా నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత దీనిని సుబేదార్ నివాసంగా ఉపయోగించారు. అలా ఆ ప్రాంతానికి సుబేదారి అని పేరొచ్చింది.
కలెక్టర్లు, ఇన్చార్జి కలెక్టర్ల నివాసం
నిజాం కాలం నుంచి ఇప్పటివరకు నిజాం పరిపాలన కేంద్రంగా ఉన్న సుబేదార్ బంగ్లా కొన్నేండ్లుగా జిల్లా కలెక్టర్ అధికారిక నివాసంగా ఉంది. వరంగల్ సుబేదార్ అధికారిక నివాసం, కార్యాలయంగా ఉపయోగించేందుకు 1886 ఆగస్టు 10న ఈ భవనం అందుబాటులోకి వచ్చింది. 13 ఎకరాల విస్తీర్ణంలో విశాలమైన ప్రాంగణంలో అత్యంత పటిష్టంగా దీనిని నిర్మించారు. సుబేదార్ ఆవాసంగా ఉన్న ఈ బంగ్లాను 1950 నుంచి జిల్లా కలెక్టర్ అధికారిక నివాసంగా ఉపయోగిస్తున్నారు.
ఆ తర్వాత వరంగల్ అర్బన్ జిల్లా, హనుమకొండ జిల్లా కలెక్టర్ అధికారిక నివాసంగా వినియోగంలో ఉంది. ఇప్పటివరకు దాదాపు 43 మంది కలెక్టర్లు, మరికొందరు ఇన్చార్జి కలెక్టర్లు సుబేదార్ బంగ్లాలో నివాసం ఉన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రతి జిల్లాకేంద్రంలోనూ సమీకృత కలెక్టరేట్లు, వాటి పకనే కలెక్టర్, జాయింట్ కలెక్టర్, అడిషనల్ కలెక్టర్లకు అధికారిక నివాసాలు నిర్మించారు. హనుమకొండ జిల్లా కలెక్టర్ ఈ ఏడాది జనవరిలో అధికారిక నివాసానికి మారడంతో సుబేదార్ బంగ్లా ఖాళీ అయింది.
ఈ చారిత్రక భవన నిర్మాణం, శైలి దెబ్బతినకుండా మరమ్మతులు చేసి సందర్శకులకు అందుబాటులోకి తెచ్చేందుకు కుడాకు బాధ్యత అప్పగించారు. కుడా ఆధ్వర్యంలో సుమారు రూ.2కోట్ల వ్యయంతో పాత తరహాలో డంగు సున్నంతో రిపేర్లు చేసి రంగులు వేశారు. ఐదువేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న బంగ్లాను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. తెల్లరంగు వేసి, లైటింగ్ ఏర్పాటుచేశారు. రకరకాల మొకలు నాటి పచ్చదనానికి చిరునామాగా మార్చారు. చరిత్రకు సాక్ష్యంగా, అప్పటి నిపుణుల నిర్మాణ శైలికి గుర్తుగా సుబేదార్ బంగ్లా నిలిచింది.