కరీమాబాద్, జూలై 18: మంత్రి కొండా సురేఖ పాల్గొన్న ఓ కార్యక్రమంలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అధికారులు తాపీగా నీడలో కూర్చుంటే.. విద్యార్థులను మాత్రం ఎండలో చాలాసేపు అలాగే నిల్చోబెట్టారు. దీంతో విద్యార్థులు ఎండలో నానా అవస్థలు పడ్డారు.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నాడు వన మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్టేజిపై నీడలో ఉండి మంత్రి కొండా సురేఖ, ఇతర అధికారులు ప్రసంగాలు చేశారు. కానీ విద్యార్థులను మాత్రం ఎండలో అలాగే నిల్చోబెట్టేశారు. వారికి కనీసం టెంట్ కూడా వేయలేదు. దీంతో ఎండలో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానికులు అసహనం వ్యక్తం చేశారు.