హనుమకొండ చౌరస్తా : కాకతీయ యూనివర్సిటీ ( Kakatiya University ) లో ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్డీ) పోస్టు నుంచి వెంకట్రామిరెడ్డిని తొలిగించాలని పరిశోధక విద్యార్థులు సుమన్, తిరుపతి, రాజారాం డిమాండ్ చేశారు. గురువారం కేయూ పరిపాలన భవనం ఎదుట వారు ఆందోళన చేపట్టారు. అనంతరం వీసీ రిజిస్ట్రార్‌తో గొడవకు దిగారు. గతంలో విద్యార్థి సంఘాల ఆందోళనల ఫలితంగా ఓఎస్డీ నియామకాన్ని అధికారులు నిలిపివేశారని గుర్తుచేశారు.
మళ్లీ అదే పోస్టును పునరుద్ధరించడం వెనుక ఉద్దేశం ఏమిటో స్పష్టత ఇవ్వాలని ప్రశ్నించారు. యూనివర్సిటీకి అవసరం లేని పదవులను సృష్టించడం వలన పరిపాలనలో గందరగోళం పెరగడమేతప్ప, ఎలాంటి అభివృద్ధి జరగదని పేర్కొన్నారు. వివాదాస్పదంగా భావించబడుతున్న కొంతమంది ప్రొఫెసర్లకు అదనపు బాధ్యతల రూపంలో ఈ పోస్టును ఇవ్వడం సరైన విధానం కాదని పేర్కొన్నారు.
ఒకే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులకు పదేపదే ఉన్నత పదవులు కేటాయించడం సమానత్వ సూత్రాలకు విరుద్ధమని, ఇది యూనివర్సిటీలో అసంతృప్తిని పెంచుతుందని తెలిపారు. ఓఎస్డీ పోస్టును నియమించాల్సి వస్తే అది ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే అవసరమవుతుందని, ప్రస్తుతం అలాంటి అత్యవసర పరిస్థితులు యూనివర్సిటీలో లేవని స్పష్టం చేశారు. రిజిస్ట్రార్ వంటి ముఖ్యమైన పరిపాలనా పదవుల అధికారాన్ని తగ్గించే ఉద్దేశంతో ఈ నియామకం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.
ఒకవేళ ఓఎస్డీ పోస్టును కొనసాగించాలనుకుంటే, ఆ స్థానంలో న్యాయ పరిజ్ఞానం కలిగిన నిపుణుడిని నియమించి, యూనివర్సిటీకి సంబంధించిన కోర్టు కేసులను సమర్థవంతంగా విశ్లేషించి, వేగంగా పరిష్కరించే దిశగా ఉపయోగపడే విధంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు మర్రి మహేష్, రాణా ఉన్నారు.