నెల్లికుదురు, సెప్టెంబర్ 26 : చేసిన పనులకు బిల్లులు చెల్లించలేదని బడికి తాళంవేసి నిరసన వ్యక్తం చేసిన ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామంలో గురువారం చోటు చేసుకుంది.
మండలంలోని మేచరాజుపల్లి ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో ఎస్ఎంసీ మాజీ చైర్మన్లు బాదావత్ దినేశ్, కోటగిరి కిరణ్ కుమార్ ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంలో భాగంగా పాఠశాలలో అభివృద్ధి పనులు చేపట్టారు. రూ. 17.50 లక్షలు వెచ్చించి పనులు పూర్తి చేసి రెండేళ్లు గడుస్తున్నా నేటికీ బిల్లులు చెల్లించడంలేదు. దీంతో గురువారం ఉదయం పాఠశాల గేటుకు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. దీంతో విద్యార్థులు ఉపాధ్యాయులు పాఠశాలలోకి వెళ్లలేక పోయారు. కొద్దిసేపయ్యాక గేటు చిన్న డోర్‌ను ఓపెన్ చేసుకుని విద్యార్థులు ఉపాధ్యాయులు లోపలికెళ్లారు. ఇప్పటికైనా బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు.