నమస్తే తెలంగాణ నెట్వర్క్ : ఫుడ్ పాయిజన్‌తో గురుకుల విద్యార్థులు మృతి చెందడంపై విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలుచోట్ల గురువారం పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. జనగామలోని ఆర్టీసీ చౌరస్తా, భూపాలపల్లిలోని అంబేదర్ సెంటర్‌తోపాటు చిట్యాల, మహదేవపూర్ మండల కేంద్రాల్లో ఏబీవీపీ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ దిష్టిబొమ్మలు దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 51 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్, ఇతర కారణాలతో మరణిస్తే ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అధికారుల నిర్లక్ష్యంతోనే గురుకుల విద్యార్థులు కల్తీ ఆహారం తిని అస్వస్థతకు గురవుతున్నారని ఆరోపించారు. ఓ వైపు విద్యార్థులు మరణిస్తుంటే మరోవైపు కాంగ్రెస్ విజయోత్సవాలు జరుపుకోవడం సిగ్గుచేటన్నారు. తమది ప్రజా ప్రభుత్వమని చెప్పుకుంటున్న అధికార పార్టీ నాయకులు గురుకుల విద్యా వ్యవస్థను పూర్తిగా నాశనం చేస్తున్నారన్నారు. విద్యా శాఖను తనవద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి విద్యార్థులు చనిపోతుంటే సోయిలేకుండా వ్యవహరిస్తున్నాడన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అన్ని ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాల్లో నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు.
లేని పక్షంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అలాగే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో హనుమకొడలోని అంబేద్కర్ జంక్షన్, జనగామలోని నెహ్రూ పార్కు వద్ద ఆందోళన చేపట్టారు. రఘునాథపల్లి మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించగా, మహబూబాబాద్ జిల్లా కురవి బస్టాండ్ సెంటర్లో ధర్నా చేశారు. విద్యా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతోనే విద్యార్థుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయన్నారు. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, గురుకులా లు, వసతి గృహాల్లో నాణ్యమైన భోజనమందించాలని, మెస్ చార్జీలు పెంచాలని, వెంటనే విద్యాశాఖ మంత్రిని నియమించాలని, చనిపోయిన విద్యార్థులకు రూ. 50 లక్షల పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.