హనుమకొండ చౌరస్తా, జులై 10: అన్యాక్రాంతమవుతున్న కాకతీయ యూనివర్సిటీ భూములను కాపాడుదాం.. భవిష్యత్ తరాలకు అందిద్దామని విద్యార్థి సంఘాల నాయకులు అన్నారు. గతనెల 17న యూనివర్సిటీ పాలకమండలి యూనివర్సిటీ భూముల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాలకమండలి ఆమోదం తెలిపిన నిర్ణయాన్ని వెంటనే తీసుకోవాలని కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సంతకాల సేకరణ చేపట్టారు.
ఓ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా హాజరైన భారత్ బచావో రాష్ట్ర నాయకులు, విశ్రాంత అధ్యాపకులు వెంగల్రెడ్డి, ఓంబ్రహ్మంలు మాట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వం వివిధ అవసరాల దృష్ట్యా కొంత భూమిని తీసుకున్నదని, కబ్జాకోరలు కొంత భూమిని ఆక్రమించారని ఇప్పుడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణం కోసం 20 నుంచి 30 ఎకరాల వరకు భూములు తీసుకోవడం వలన యూనివర్సిటీ భవిష్యత్తు అవసరాలకు భూముల కొరత ఏర్పడుతుందన్నారు.
యూనివర్సిటీ భూములను ఇతరత్రా అవసరాలకు వినియోగించకుండా భవిష్యత్తు యూనివర్సిటీ అవసరాల కోసం కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని యూనివర్సిటీ అధికారులు ఈ విషయమై దృష్టి సారించి అన్యాక్రతమవుతున్న భూముల చుట్టూ ప్రహరీగోడ నిర్మించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల బాధ్యులు పీడీఎస్‌యూ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యదర్శి మర్రి మహేష్, ఏఐఎఫ్డిఎస్ రాష్ర్ట కార్యదర్శి గడ్డం నాగార్జున, డీఎస్ఏ రాష్ర్ట కన్వీనర్ కామగోని శ్రావణ్, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్, స్వేరో స్టూడెంట్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎల్తూరి సాయికుమార్, బిఎస్ఎఫ్ యూనివర్సిటీ అధ్యక్షులు శివకుమార్, బీఆర్ఎస్వీ యూనివర్సిటీ నాయకులు పస్తం అనిల్‌కుమార్, డిఎస్ఏ జిల్లా కన్వీనర్ ఉప్పుల శివ, ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ అధ్యక్ష, కార్యదర్శులు సాయి, జశ్వంత్, శేఖర్, సురేష్, నరేష్‌తో పాటు యూనివర్సిటీ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు.