హనుమకొండ, నవంబర్ 13: విద్యార్థి సంఘాలపై ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాల అసత్యపు ఆరోపణలు ఖండించాలని, విద్యార్థి సంఘ నాయకుల పై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు, స్కాలర్స్ఆధ్వర్యంలో కాకతీయ విశ్వవిద్యాలయంలోని ఎస్డీఎల్సీఈ పూలే విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ముందుగా నల్లబ్యాడ్జీలు, రిబ్బన్లు ధరించి ప్రైవేటు విద్యాసంస్థల యజమాన్యాలకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పీడీఎస్‌యూ జాతీయ నాయకులు మహేష్, రాష్ట్ర అధ్యక్షుడు ఎస్వీ శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి పొడపంగి నాగరాజు, కేయూ స్కాలర్స్ నేతలు డి.తిరుపతి, కే.తిరుపతి, మధు, బీసీ విద్యార్థి సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షుడు ఏ.నాగరాజు, సూర్యకిరణ్, సాయి
స్వేరోస్ జిల్లా అధ్యక్షుడు, డీ.ఎస్.ఏ జిల్లా కన్వీనర్ శివ, పి.ఎస్.ఎఫ్.ఐ వినయ్, బిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మనోహర్ చిరంజీవి మాట్లాడారు.
పీడీఎస్‌యూ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుర్రం అజయ్, మర్రి మహేష్లపైన బుధవారం ఉదయం మహాసభల ప్రచార నిమిత్తం స్మైలీ డిజీ స్కూల్‌కు వెళ్లిన విద్యార్థి నాయకులపై పాఠశాల చైర్మన్ శ్రీనివాస్ వర్మ అసభ్యకర పదజాలంతో దుర్భాషలాడుతూ దురుసుగా మాట్లాడుతూ ‘ఎవడ్రా మీరు ఎందుకు వచ్చారు.. వెళ్ళండి కొడుకులారా అంటూనే ఎస్సీ, ఎస్టీ కులాల సంఘాల నా కొడుకులు వస్తున్నారు’
అంటూ వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేవిధంగా మాట్లాడాలన్నారు. విద్యార్థి నాయకులపై భౌతిక దాడికి దిగాడు, స్కూల్లో ఉన్న ఇనుపరాడ్డుతో దాడి చేసి మర్రి మహేష్‌ని అత్యంత తీవ్రంగా గాయపరిచాడని, దాడిని కేయూ విద్యార్థి సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.
కులంపేరుతో దూషించి దాడి చేసిన స్మైలీ డీజీ స్కూల్ చైర్మన్ శ్రీనివాస్ వర్మపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. స్మైలీ పాఠశాలకు ఒక బ్రాంచ్‌కి మాత్రమే పర్మిషన్ ఉంటే రెండు బ్రాంచీలు ఓపెన్‌చేసి అక్రమంగా దందాలకు పాల్పడుతున్నారని వారు మండిపడ్డారు. నిజాయితీగా విద్యార్థుల హక్కుల కోసం 50 సంవత్సరాల నుంచి పోరాడుతున్న విద్యార్థి సంఘంపై జిల్లావ్యాప్తంగా బంద్‌కు పిలుపు ఇవ్వడం సిగ్గుచేటు అన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా కేంద్రాల్లో ప్రైవేటు విద్యాసంస్థలు కనీసం నియమ, నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ తల్లిదండ్రుల వద్ద నుంచి లక్షల రూపాయలను ఫీజులను వసూలు చేస్తున్నా ప్రభుత్వ విద్యాధికారులు ఎంఈఓ, డీఈవో, ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా వారు ఇచ్చే కాసులకు అలవాటుపడి ప్రైవేట్ పాఠశాలలకు కొమ్ముకాస్తున్నారని, వెంటనే జిల్లాలో ఉన్న పర్మిషన్ లేని పాఠశాలలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేసి, విద్యార్థి సంఘం నాయకులపై అక్రమంగా పెట్టన తప్పుడు కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. పీడీఎస్‌యూ రాష్ర్ట ఉపాధ్యక్షుడు బోనగిరి మధు, కోశాధికారి రాణాప్రతాప్, వంశి, సురేష్ పాల్గొన్నారు.