భీమదేవరపల్లి, అక్టోబర్ 24: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరలోని పీవీ రంగారా వు తెలంగాణ బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకొన్నది. పదో తరగతి చదువుతున్న వరం శ్రీవర్షిత(15) ఎవరూ లేని సమయంలో డార్మెటరీ హాల్లో చున్నీతో ఉరివేసుకొన్నది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన మమత-తిరుపతి దంపతుల కూతురు శ్రీవర్షిత నాలుగేళ్లుగా ఇదే గురుకుల పాఠశాలలో చదువుకుంటున్నది. దీపావళి పండుగ సెలవులకు ఇంటికి వెళ్లి గురువారం తిరిగి వచ్చింది.
శుక్రవారం ఉదయం పాఠశాల సిబ్బంది ఫోన్ తీసుకుని ఇంటికి ఫోన్ చేసి హాస్టల్ నుంచి వెంటనే తనను తీసుకువెళ్లాలని, తనకు ఇక్కడ ఉండాలని అనిపించడంలేదని తల్లిదండ్రులను చెప్పగా వారు వస్తున్నామని చెప్పారు. విద్యార్థులు అందరినీ పిలిచేందుకు పాఠశాల రోలింగ్ కాల్ సమయం వచ్చింది. పాఠశాలకు హాజరైన వాళ్ల జాబితా లెక్కిస్తున్న క్ర మంలో శ్రీవర్షిత రాలేదని ఇతర విద్యార్థులు చెప్పడం తో క్లాస్‌రూములో చూడాలని ఉపాధ్యాయులు ఆదేశించారు. విద్యార్థులు డార్మెటరీ హాల్‌కు వెళ్లి చూడగా శ్రీవర్షిత చున్నీతో ఉరివేసుకొని చనిపోయింది.
అది చూసి విద్యార్థినులు అరవడంతో ఉపాధ్యాయులు వెళ్లి చూశారు. శ్రీవర్షిణి తల్లిదండ్రులకు, పోలీసులకు వెంటనే సమాచారం అందించారు. ఎల్కతుర్తి సీఐ పులి రమేశ్, ఎస్సైలు దివ్య, ప్రవీణ్ కుమార్ అక్కడికి చేరుకుని మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్టుమార్టం కోసం హుజూరాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. శ్రీవర్షిత తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. గురుకుల పాఠశాల ప్రి న్సిపాల్, ఇతర సిబ్బంది వేధింపుల కా రణంగానే తమ కూతురు ఆత్మహత్య చేసుకున్నదని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదులో పేర్కొన్నారు.