నమస్తే తెలంగాణ నెట్వర్క్, జూలై 5 ; నిరుద్యోగుల సమస్యలపై విద్యార్థి నేతలు కదంతొక్కగా అడుగడుగునా నిర్బంధం కొనసాగింది. న్యాయమైన డిమాండ్ల కోసం హైదరాబాద్‌లోని టీజీపీఎస్సీ ముట్టడికి సిద్ధమైన బీఆర్ఎస్వీ, బీజేవైఎం, ఏబీవీపీ సహా ఇతర విద్యార్థి సంఘాల నేతలపై గురువారం అర్ధరాత్రి నుంచే ‘సర్కారు నియంతృత్వం’ మొదలైంది. శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్టుల పర్వం మొదలుకాగా ఠాణాల్లోనూ నిరసన కొనసాగింది. అలాగే ములుగు కలెక్టరేట్ ముట్టడితో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో బీజేవైఎం నాయకులను అదుపులోకి తీసుకున్నారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, జాబ్ క్యాలెండర్, ఉద్యోగ నోటిఫికేషన్లు వేసేవరకూ పోరాటం చేస్తామని స్పష్టంచేశారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైన రేవంత్‌రెడ్డి సర్కారు.. నిర్బంధాలతో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులను తీసుకొచ్చి హక్కులను కాలరాస్తున్నదని ధ్వజమెత్తారు. నిరుద్యోగుల పక్షాన కొట్లాడుతున్న వారిని అరెస్టుల పేరుతో అడ్డుకోవడం అప్రజాస్వామికమని, ఎలాంటి ఉద్యమాలకైనా సిద్ధమేనని వారు తెగేసి చెప్పారు.
ఉమ్మడి వరంగల్ జిల్లావ్యాప్తంగా పలువురు బీఆర్ఎస్, బీఆర్ఎస్వీ, బీజేవైఎం, ఏబీవీపీ, ఇతర విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడే అరెస్ట్ చేశారు. పథకం ప్రకారం గురువారం అర్ధరాత్రి ఇళ్లల్లోకి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. తెల్లవారేసరికి పోలీస్ స్టేషన్లకు తరలించారు. మధ్యాహ్నం వరకు సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జీవో 317, 46ను తీసివేయాలని డిమాండ్ చేశారు. అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని, జాబ్ క్యాలెండర్, ఉద్యోగ నోటిఫికేషన్లు వేసేంత వరకు పోరాటం చేస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా జాబ్ క్యాలెండర్ రూపొందించలేదన్నారు.
నిరుద్యోగులు తమ సమస్యల సాధన కోసం శుక్రవారం టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడికి పిలుపుచిచ్చిన నేపథ్యంలో దానిని భగ్నం చేసేందుకు పోలీసులు శతవిధాలా ప్రయత్నించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో గురువారం అర్ధరాత్రి దాటాక పార్టీలు, విద్యార్థి సంఘాల నాయకుల ఇండ్లలోకి వెళ్లి ముందస్తు అరెస్టులు చేశారు. ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాలలో బీజేపీ ప్రాంత సమితి సభ్యుడు వేల్పుల రాజ్‌కుమార్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు శశితో పాటు మరో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.
అలాగే గణపురం మండలంలో బీజేవైఎం కళాశాలల విభాగం రాష్ట్ర కన్వీనర్ మంద మహేశ్, మండల అధ్యక్షుడు ఆకుల శ్రీనివాస్, నాయకులు భాస్కర్, రజాక్‌ను అరెస్ట్ చేశారు. మహాదేవపూర్‌లో ఏవీబీపీ నాయకులు గోగుల కృష్ణ, పేట సాయి, బీజేపీ మండలాధ్యక్షుడు ఆకుల శ్రీధర్, నాయకులు అడప లక్ష్మీనారాయణ, కొక్కు శ్రీనివాస్, కాళేశ్వరం పరిధిలో బీఆర్ఎస్ నాయకులు ఓగేశ్, రమేశ్, లేతకరి రవి, చంద్రయ్య, మహేశ్, బీజేపీ నాయకులు గోర శ్రీకాంత్, దేవయ్య, బొల్లం కిషన్, కాటారంలో బీఆర్ఎస్ నాయకులు ఉప్పు సంతోశ్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బొడ్డు స్మరణ్, మల్హర్‌లో బీజేవైఎం అధ్యక్షుడు మహేందర్, మరో ఇద్దరు, టేకుమట్లలో మాట్ల వెంకటేశ్ (బీఆర్ఎస్), బూస నాగరాజు (బీజేపీ), నూనేటి అరుణ్, సిద్దు, చిలుక మహేందర్(బీజేవైఎం),రేగొండలో బీజేవైఎం జిల్లా ప్రధానకార్యదర్శి ఓరుగంటి భగవాన్ను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే ములుగు జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్కు చెందిన కోగిల మహేశ్, పోరిక రాహుల్‌నాయక్, బీజైవైఎం నాయకులు నగరపు రమేశ్, రాయంచు నాగరాజు, కత్తి హరీశ్‌లను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
అలాగే తాడ్వాయి పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్, మేడారంలో బీజేవైఎం నాయకులను నిర్బంధించారు. వెంకటాపూర్ మండలంలో బీఆర్ఎస్ యూత్ నాయకులు అంతటి రాము, ముడిగే రాజకుమార్‌ను అరెస్ట్ చేశారు. అలాగే జనగామ జిల్లా బచ్చన్నపేట బీజేవైఎం మండలాధ్యక్షుడు బంగారు మహేశ్, జిల్లా ఉపాధ్యక్షుడు మంచాల రాజశేఖర్, మండల ప్రధాన కార్యదర్శి కక్కర్ల గణేశ్, నాయకులు కంటెం భాస్కర్, రాంబాబు, కిషన్‌ను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన బీఆర్ఎస్వీ టౌన్ అధ్యక్షుడు దేవోజు హేమంత్, బీఆర్ఎస్ యూత్ నాయకుడు బొల్లపెల్లి కమల్‌తో పాటు మరికొంత మందిని పోలీసులు ముందస్తు అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఖానాపురం మండలంలో బీజేపీ మండలాధ్యక్షుడు ఆబోతు రాజుయాదవ్, మండల ప్రధాన కార్యదర్శి బూడిద ముఖేశ్‌కుమార్, బీజేవైఎం మండలాధ్యక్షుడు ఆకుల హేమంత్, ఎఫ్ఎఫ్ఐ జిల్లా నాయకుడు యార ప్రశాంత్‌ను అరెస్ట్ చేశారు. అలాగే వరంగల్ మిల్స్‌కాలనీ పోలీసులు బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాదాసు రాజు, పుప్పాల శ్రీనివాస్, చింతల అనిల్, మండల భూపాల్, గొర్రె కోటి, వేల్పుల నందు, ఇనుముల రాజును అదుపులోకి తీసుకున్నారు. హనుమకొండ, సుబేదారి, కాకతీయ యూనివర్సిటీ పోలీసులు 20 మందికిపైగా యువకులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.
మానుకోట జిల్లాలో 26 మంది అరెస్ట్
టీజీపీఎస్సీ ముట్టడికి వెళ్తున్న యువతను పోలీసులు ఎకడికకడ నిర్బంధించా రు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి మహబూబాబాద్ జిల్లాలోని రైల్వేస్టేషన్లు, బస్స్టేషన్లు, రోడ్డు మార్గాన చెక్‌పోస్టుల వద్ద మొత్తం 26మంది యువకులను అరెస్టు చేశారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా ధర్నా చేసేందుకు వెళ్తున్న వారిని అడ్డుకోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమైంది.
ములుగు కలెక్టరేట్ ముట్టడి
నిరుద్యోగుల సమస్యలపై ములుగు కలెక్టరేట్‌ను బీజేపీ, బీజేవైఎం నాయకులు శుక్రవారం ముట్టడించారు. కార్యాలయం ఎదుట ప్లకార్డులతో బైఠాయించి ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎంకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సై-2 రామకృష్ణ అక్కడకు చేరుకొని వారిని అరెస్ట్ చేసి అనంతరం వదిలివేశారు. బీజేపీ, బీజేవైఎం నాయకులు మాట్లాడుతూ అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. మంత్రి సీతక్క స్పందించి జీవో నంబర్ 317, 46ను రద్దుచేసి స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, మండలాధ్యక్షుడు గాదం కుమార్, బీజేపీ గిరిజన మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేందర్, పాలసీ, రీసెర్చ్ కన్వీనర్ రాజునాయక్ పాల్గొన్నారు. కాగా, కలెక్టరేట్ ను ముట్టడించిన 13 మందిపై కేసు నమో దు చేసినట్లు ఎస్సై సీహెచ్ వెంకటేశ్వర్రావు తెలిపారు.