వర్ధన్నపేట/మడికొండ, ఏప్రిల్ 12 : కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేక ఉందని, అందువల్లనే స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు రావడం లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ అనేక అబద్ధపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందని, వారి రెండేళ్ల పాలన పూర్తికాకముందే ప్రజలు ప్రభుత్వ వైఫల్యాలను గుర్తిస్తున్నారన్నారు.
శనివారం వర్ధన్నపేట మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తూళ్ల కుమారస్వామి అధ్యక్షతన జరిగిన సన్నాహక సమావేశంలో ఎర్రబెల్లి పాల్గొన్నారు. అలాగే మడికొండలో జరిగిన గ్రేటర్ వరంగల్ 46, 64వ డివిజన్ ముఖ్యనాయకుల సమావేశానికి హాజరై రజతోత్సవ సభ వాల్‌పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధాలతో కాలం వెళ్లదీస్తున్నాడని, సొంతపార్టీకి చెందిన 32 మంది ఎమ్మెల్యేలు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారన్నారు.
రేవంత్ ప్రభుత్వం ఎప్పుడు కూలిపోతుందో తెలియని పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను గుర్తించి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి రాలేకపోతున్నదన్నారు. ఆ పార్టీ వచ్చే శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రంలో 10 ఎమ్మెల్యే సీట్లకంటే ఎక్కువ గెలవదని ఓ సర్వేలో తేలిందన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆ పార్టీకి ఘోర పరాభవం తప్పదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమవుతున్నదన్నారు.
ఉద్యమనేత కేసీఆర్ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తరువాత గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడంతో రాష్ట్రం సస్యశ్యామలమైందన్నారు. నీరు సమృద్ధిగా రావడంతో కొన్ని ప్రాంతాల రైతులు సరఫరాను నిలిపివేయాలని కోరారనానరు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్సారెస్పీ కాలువతో పాటు వాగులన్నీ ఎడారిగా మారాయన్నారు. రైతులు యాసంగి పంట కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలని ఎర్రబెల్లి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పోలీసుల వత్తిడి, అధికార పార్టీ నేతల మాటలకు భయపడకుండా పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. రజతోత్సవ సభను విజయవంతం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు.
సమావేశాల్లో జిల్లా మహిళా నాయకురాలు ఎల్లావుల లలితాయాదవ్, మాజీ ఎంపీపీలు అన్నమనేని అప్పారావు, నూనె భిక్షపతి, మాజీ జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎలేందర్‌రెడ్డి, కార్పొరేటర్ ఆవాల రాధికరెడ్డి, నాయకులు అల్లం శ్రీనివాసరావు, పోలెపల్లి రాంమూర్తి, రాంగోపాల్‌రావు, విజయ్‌కుమార్, గుజ్జ గోపాల్‌రావు, గుజ్జ సంపత్‌రెడ్డి, చొప్పరి సోమయ్య, సిలువేరు కుమారస్వామి, తుమ్మల యాకయ్య తదితరులు పాల్గొన్నారు.