వీధి కుక్కలు వణికిస్తున్నాయి.. ప్రజలపై దాడికి దిగుతున్నాయి.. చిన్న, పెద్ద తేడా లేకుండా గాయపరుస్తున్నాయి.. గ్రేటర్ వరంగల్‌తో పాటు ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల గత కొద్ది రోజులుగా కుక్క కాటు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఫలితంగా ఆస్పత్రులకు వచ్చే కేసులు పెరుగుతున్నాయి. ఒక్క ఎంజీఎం దవాఖానకే రోజుకు కనీసం 10 నుంచి 15 మంది బాధితులు వస్తున్నారు. వరంగల్ నగరంలో ఆదివారం ఒక్కరోజే ఇద్దరు చిన్నారులపై దాడిచేసి తీవ్రంగా గాయపర్చాయి. దీంతో ఇళ్ల నుంచి బయటకు రావాలన్నా.. చిన్న పిల్లలను బయటకు పంపాలన్నా ప్రజలు జంకుతున్నారు. ఇంత జరుగుతున్నా పట్టించుకోవాల్సిన అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అయితే వాతావరణంలో మార్పుల వల్లే వీధి కుక్కలు ఇలా ప్రవర్తిస్తాయని పశువైద్యులు చెబుతున్నారు.
– వరంగల్, అక్టోబర్ 26
వరంగల్, అక్టోబర్ 26 : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌తో పాటు ఉమ్మడి జిల్లాలో వీధి కుక్కలు బెంబేలెత్తిస్తున్నాయి. చిన్న, పెద్ద అనే తేడాలేకుండా ప్రజలపై దాడిచేసి గాయపరుస్తున్నాయి. ప్రతి రోజు ఏదో ఒక చోట చిన్నారులు కుక్క కాటుకు గురై ఆస్పత్రుల పాలవుతున్నారు. ఒక్క గ్రేటర్ వరంగల్‌లోనే సుమారు 40 వేలకు పైగా వీధి కుక్కలు సంచరిస్తున్నట్లు బల్దియా అధికారులు చెబుతున్నారు. అయితే వీటి బెడద నివారణలో మాత్రం అధికారులు పూర్తిగా చేతులెత్తేశారు. అడపా దడపా కుక్కల పట్టే టీమ్‌లను పంపించి చేతులు దులుపుకుంటున్నారు. గత రెండు రోజుల్లో నగరంలోని రెండు ప్రాంతాల్లో చిన్నారులపై పదుల సంఖ్యలో వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ప్రజలు, చిన్నారులు గడపదాటడానికి జంకుతున్నారు. స్కూళ్లకు తల్లిదండ్రులు ఎస్కార్గా వెళ్లాల్సిన భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి.
గ్రేటర్ వరంగల్‌లో 40 వేలకు పైగా వీధి కుక్కలున్నట్లు చెబుతున్న అధికారులు వాటిని అదుపు చేయలేకపోతున్నారు. వీధి కుక్కలను పట్టి వాటికి కుటుంబ నియంత్రణ అపరేషన్లు చేసి మళ్లీ తీసుకొచ్చిన ప్రాంతంలో వదిలి వేయడం తప్ప తామేమీ చేయలేమని అంటున్నారు. అయితే కుక్కల నివారణకు బల్దియా అధికారుల వద్ద ప్రత్యేక ప్రణాళికలు లేకపోవడం గమనార్హం. కుక్కలు దాడి చేసిన ప్రాంతాలకు వాటిని పట్టే బృందాలను పంపించి చేతులు దులుపుకుంటున్నారు. ఒక్కో కుక్కను పట్టుకొని, వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి, వాటిని తిరిగి యథా ప్రాంతంలో వదిలేయడానికి బల్దియా రూ. 1350 వరకు ఇస్తున్నది. ఈ లెక్కన ఏటా రూ. కోటికి పైగా ఖర్చు చేస్తున్న బల్దియా అధికారులు వీధి కుక్కల బెడద నుంచి శాశ్వత పరిష్కారం చూపడంలో విఫలమవుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అసుపత్రుల్లో రోజు రోజుకు కుక్కకాటు కేసులు పెరుగుతున్నాయి. స్థానికంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కుక్క కాటు కేసులు వారంలో నాలుగైదు నమోదవుతున్నట్లు సమాచారం. దీంతో పా టు ఉమ్మడి జిల్లాకు పెద్దాస్పపత్రిగా ఉన్న ఎంజీఎం దవాఖానకు ప్రతిరోజు 10 నుంచి 15 కుక్క కాటు కేసులు వస్తున్నట్లు వైద్యవర్గాలు చెబుతున్నాయి. వీటితో పాటు అనేక కేసులు ప్రైవేట్ దవాఖానల్లో నూ నమోదవుతున్నా యి. ఇటీవల కాలం లో కుక్క కాటు కేసులు పెరుగుతుండడం అందోళన కలిగిస్త్తున్నది.
ఉమ్మడి జిల్లాతో పాటు వరంగల్ నగరంలో వీధి కుక్కల దాడులు రోజురోజుకు తీవ్రమవుతున్నా యి. గత నెల 14న చింతల్ ప్రాంతంలో ఒకే కుక్క నలుగురిపై దాడి చేసింది. ఐనవోలులో ఈ నెల 10న తండా కార్తీక్-ది వ్య దంపతుల మూడేళ్ల బాలుడు దేవాన్ష్ ఇంటి ఎదుట ఆడుకుంటుండగా వీధి కుక్క దాడి చేసి తీవ్రం గా గాయపరిచింది. ఆదివారం న్యూ శాయంపేట ప్రాంతంలో టైగర్స్ హిల్స్ కాలనీలో వీధి కుక్కల గుంపు కార్తీక అనే ఐదేళ్ల చిన్నారిపై ఒక్కసారిగా దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనను మరువక ముందే హనుమకొండ నయీంనగర్‌లోని లష్కర్‌సింగారం ప్రాంతంలో బాలుడిపై వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి.
తీవ్ర గాయాల పాలైన బాలుడిని తల్లిదండ్రులు అస్పత్రిలో చేర్పించారు. వారం రోజుల క్రితం కరీమాబాద్ ప్రాంతంలో భార్యకు మందులు తీసుకురావడానికి వెళ్లిన వ్యక్తిపై వీధి కుక్కల గుంపు దాడి చేయడంతో ద్విచక్ర వాహనంపై నుంచి కిందపడటంతో తలకు తీవ్ర గాయాలై అస్పత్రిలో చికిత్ప పొందుతున్నారు. నెల రోజుల క్రితం ఎస్ఆర్ఎస్ తోట ప్రాంతంలో బడికి వెళ్తున్న చిన్నారిని సైతం గాయపరిచాయి. కుక్కల వరుస దాడులతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. గడప దాటి బయటకు వెళ్లలేని, చిన్నారులు ఇంటి ముందు అడుకునే పరిస్థితులు లేవని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.