యూరియా కొరత రైతులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. వ్యవసాయ పనులు వదిలేసి రాత్రి, పగలు అనే తేడా లేకుండా సొసైటీల ఎదుట పడిగాపులు పడుతున్నారు. ఎరువు అందక పోవడం తో కోపోద్రిక్తులైన అన్నదాతలు మహబూబాబాద్‌లో గ్రోమోర్ దుకాణంపై రాళ్లు విసిరారు. షాపు ఎదుట కట్టెలు తీసుకొచ్చి నిప్పు పెట్టారు.
నర్సింహులపేటలో వ్యవసాయాధికారిని నిలదీయగా, బయ్యారంలో పురుగుల మందు డబ్బాతో ప్రధాన రహదారిపై నిరసన తెలిపారు. గూడూరులో గోదాము నుంచి ఎరు వును తీసుకెళ్లేందుకు మహిళలు యత్నించగా, పీఏసీఎస్ సిబ్బంది వారిని బయటకు లాగి తాళాలు వేశారు. నర్సంపేట మండలం ధర్మారావుపేటలో క్యూలో మహిళా రైతు సొమ్మసిల్లి పడిపోయారు.
– నమస్తే తెలంగాణ నెట్వర్క్, సెప్టెంబర్ 4
మహబూబాబాద్ గ్రోమోర్ ఎరువుల దుకాణం ముందు పొద్దున్నుంచి లైన్లో నిలబడి ఓపిక నశించిన రైతులు ఆగ్రహంతోగ్రోమోర్ ఎరువుల దుకాణంపైకి రాళ్లు విసిరేశారు. కొంత మంది కట్టెలు తీసుకొచ్చి మంట పెట్టారు. ఇల్లందు బైపాస్ రోడ్‌లోని గోడౌన్ లోపలకు దూసుకెళ్లారు. పోలీసులు రైతులతో మాట్లాడి సర్ది చెప్పారు. బయ్యారంలో యూరియా లేదని చెప్పడంతో ఆగ్రహించిన అన్నదాతలు ఇల్లందు-మహబూబాబాద్ జాతీయ రహదారిపై నాలుగు గంటలు ధర్నా చేశారు.
పురుగుల మందు డబ్బాతో రోడ్డుపై పడుకొని నిరసన వ్యక్తం చేశారు. ఆదివారం యూరియా ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని ఎస్సై తిరుపతి రైతులకు తెలపడంతో ఆందోళన విరమించారు. గూడూరులో ఓపిక నశించిన మహిళా చీపురుకట్ట, కర్రలు పట్టుకొని యూరి యా ఇవ్వకపోతే ఇంటికి వెళ్లేదేలేదని హెచ్చరించారు. పీఏసీఎస్ గోదాంలోకి చొచ్చుకెళ్లి బస్తాలను బయటికి లాగారు. అప్రమత్తమైన పోలీసులు, పీఏసీఎస్ సిబ్బంది గోదాంకు తాళాలు వేసుకున్నారు.
క్యూలో నిల్చున్న గోవిందాపురం గ్రామానికి చెందిన ధరంసోత్ కాంతికి తోపులాటలో చేతికి గాయమైంది. గతంలో టోకెన్లు తీసుకున్న వారికి యూరి యా బస్తాలు అందించగా, టోకెన్లు లేని రైతులు ఇంటికి వెళ్లిపోయారు. నర్సింహులపేట పీఏసీఎస్ పరిధిలో అందరికి యూరియా బస్తాలు అందక పోవడంతో ఏవో వినయ్‌కుమార్‌ను నిలదీశారు. కురవి లో వందలాది మంది తరలివచ్చి తెల్లవారుజా ము నుంచే క్యూలో నిల్చున్నారు.
డోర్నకల్ మండలం గొల్లచర్ల సొసైటీ వద్ద యూరియా బస్తాలు అయిపోవడంతో కొందరు నిరాశగా వెళ్లిపోయారు. చిన్నగూడూరులో యూరియా కోసం పోటెత్తారు. రేగొండలోని భూ పాలపల్లి-పరకాల జాతీయ ప్రధాన రహదారిపై సీపీఎం ఆధ్వర్యంలో యూరియా కొరతపై ధర్నా చేశారు. గణపురం సొసైటీలో రైతు ఒక్కో బస్తా ఇవ్వడంతో ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. నర్సంపేట, ఖానాపురం మండలం బుధరావుపేట పీఏసీఎస్ ఎదుట రైతులు బారులు తీరారు.
ధర్మారావుపేట సొసైటీ గోదాం వద్ద లైన్లో ఉన్న ఓమహిళా రైతు సొమ్మసిల్లి పడిపోయింది. నల్లబెల్లి మండలంలోని శనిగరం శివారులో గల ఆగ్రోస్ సెంటర్లో ఒక్కో రైతుకు ఒక్కోబస్తా యూరియా అందించారు. ఏటూరునాగారం మండలం చిన్నబోయినపల్లిలో కొద్దిసేపటికే యూరియా అయిపోవడంతో కొందరు రైతులు వెనుదిరిగారు. వాజేడు పీఏసీఎస్‌కు వేలాది మంది తరలివచ్చి బారులు తీరారు. పాలకుర్తిలోని ఎఫ్ఎస్సీఎస్ కేంద్రంలో యూరియా లేకపోవడంతో వ్యవసాయం ఎట్లా చేసేదంటూ అన్నదాతలు ప్రభుత్వంపై మండిపడ్డారు. పరకాల, శాయంపేటలో యూరియా బస్తాల కోసం రైతులు పడరాని పాట్లు పడ్డారు.
రెండు రోజులుగా ఒక్క బస్తా దొరకలే..
ఈ చిత్రంలో ఉన్న దివ్యాంగ రైతు పేరు జనగాం శ్రీనివాస్. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం వెంకటేశ్వర్లపల్లికి చెందిన ఆయనకు రెండెకరాల పొలం ఉంది. దీనికి తోడు మరో మూడు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేస్తున్నాడు. యూరియా కోసం రెండు రోజులుగా మండల కేంద్రంలోని పీఏసీఎస్ చుట్టూ తిరుగుతున్నాడు. ఒక్క బస్తా కూడా దొరకక నిరాశతో ఇంటికి వెళ్తున్నాడు.
వేసిన పంట చేతికందకుండా పోతుందేమోనని, తన కష్టమంతా వృథా అవుతుందేమోనని భయపడుతున్నట్లు కన్నీళ్లతో తన గోడును ‘నమస్తే తెలంగాణ’కు వెళ్లబోసుకున్నాడు. పంటను కాపాడుకునేందుకు యూరియా అవసరమని, ప్రభుత్వం సరిపడా అందించాలని వేడుకున్నాడు. యూరియా కొరత ఎంత తీవ్రంగా ఉందని, రైతులు ఎలా ఇబ్బందులు పడుతున్నారనే దానికి శ్రీనివాస్ ఉదంతం అద్దం పడుతున్నది.
– గణపురం, సెప్టెంబర్ 4