హనుమకొండ, జూలై 31(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరికి టెన్షన్ మరింత పెరుగుతున్నది. అధికారిక ప్రయోజనాలు నెరవేర్చుకోవడంతోపాటు పదవికి ఎలాంటి ఇబ్బంది ఉండదని భావించిన ఆయనకు తీవ్రమైన ప్రతికూల పరిస్థితి ఏర్పడుతున్నది. బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా గుర్తించాలనే పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాలతో తన పదవి ఉంటదా? ఊడుతదా? అనే గుబులు పట్టుకున్నది. పార్టీ మారిన ఎమ్మెల్యేలను అనర్హులుగా తేల్చే విషయమై మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు గురువారం అసెంబ్లీ స్పీకర్‌ను ఆదేశించింది.
ఒక పార్టీ తరపున గెలిచి మరో పార్టీలో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను ఏండ్ల తరబడి పెండింగ్‌లో పెట్టడం సరికాదన్నది. ఇలాంటి అంశాల్లో విచారణ ప్రక్రియను పొడిగిస్తూ పోతే స్పీకర్ అనర్హతపై నిర్ణయం తీసుకోవచ్చని సూచించింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో కడియంకు ఈ విషయంలో ఇప్పటికే ఉన్న పరేషాన్ మరింత పెరుగుతున్నది. బీఆర్ఎస్ పిటిషన్‌తో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకు గురవుతారని, ఆ స్థానాల్లో ఉపఎన్నికలు వస్తాయనే చర్చ మొదలైంది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై త్వరలోనే నిర్ణయం వస్తుందని, స్టేషన్‌ఘన్‌పూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో ఉప ఎన్నికలు ఖాయమనే అభిప్రాయం నెలకొన్నది.
కేసీఆర్ అందలం ఎక్కించినా..
టీడీపీలో రాజకీయ జీవితం మొదలు పెట్టిన కడియం శ్రీహరికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీనియర్ నేతగా గుర్తింపు ఉన్నది. 1994, 1999 సాధారణ ఎన్నికల్లో, 2008 ఉప ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 1994లో సహాయ మంత్రిగా, 1995 నుంచి 2004 వరకు క్యాబినెట్ మంత్రిగా ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలలో పని చేశారు. బీఆర్ఎస్ ఆవిర్భావం అనంతరం నెలకొన్న రాజకీయ పరిస్థితులతో కడియం శ్రీహరి ఇదే సెగ్మెంట్లో 2004, 2009 సాధారణ ఎన్నికలు, 2012 ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు.
ఉద్యమ తీవ్రత, బీఆర్ఎస్ అనుకూల పరిస్థితుల కారణంగా 2013లో ఆ పార్టీలో చేరారు. అధినేత కేసీఆర్ ఇచ్చిన అవకాశంతో 2014లో బీఆర్ఎస్ నుంచి వరంగల్ ఎం పీగా గెలిచారు. అప్పటి సీఎం కేసీఆర్ 2015లో కడియం శ్రీహరిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకొని ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. 2015, 2021లో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. 2023లో బీఆర్ఎస్ నుంచి స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా శ్రీహరి గెలిచారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన కూతురు కా వ్యకు వరంగల్ ఎంపీగా బీఆర్ఎస్ టికెట్ ఖరారు చేయగా, దీన్ని అవకాశంగా మార్చుకున్న కడి యం అధికార కాంగ్రెస్‌లో చేరారు. ఈ నేపథ్యం లో బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు గురువారం కీలక ఆదేశాలిచ్చింది.