తొర్రూరు, డిసెంబర్ 16: గ్రామీణ క్రీడలను రాష్ట్ర సర్కారు ప్రోత్సహిస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మంచిర్యాలలో జరిగే రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో పాల్గొనే మహబూబాబాద్ జట్టు క్రీడాకారులకు హనుమకొండలోని తన నివాసంలో మంత్రి టీషర్ట్లు, షూలు అందజేశారు. కబడ్డీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు గుంటుక కుమారస్వామి అభ్యర్థనకు స్పందించిన మంత్రి క్రీడా దుస్తులను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ క్రీడలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. కబడ్డీ వంటి గ్రామీణ క్రీడలకు ఆదరణ పెరిగిందని, ఈ క్రీడలో రాణిస్తే విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ లభిస్తుందన్నారు. తాను స్వయంగా క్రీడాకారుడినేనని, విద్యార్థిగా ఉన్న సమయంలో కబడ్డీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించానన్నారు. క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి రాష్ర్టానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడాకారులు పాల్గొన్నారు.