ఆసియాలోనే రెండో పెద్ద వ్యవసాయ మార్కెట్ అయిన ఎనుమాముల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. మార్కెట్‌కు వచ్చే రైతులకు మరిన్ని వసతులు కల్పించాలని నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.23కోట్లు కేటాయించింది. మిర్చి యార్డులో రూ.4.44 కోట్లతో ప్లాట్‌ఫారాలు, అన్ని యార్డుల్లో రూఫింగ్, షాపులు, ఆఫీసు భవనాల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది. ప్రధాన ద్వారం వద్ద రూ.29 లక్షలతో భారీ ఆర్చ్ నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందించింది. పాలనాపరమైన, సాంకేతిక అనుమతులు రావడంతో పనులు చేపట్టేందుకు మార్కెటింగ్ శాఖ ఇంజినీరింగ్ విభాగం అధికారులు ఇటీవల టెండర్ల ప్రక్రియ నిర్వహించారు. ఇప్పటికే కొన్ని పనులు కూడా ప్రారంభమైనట్లు తెలిపారు.
– వరంగల్, సెప్టెంబర్ 7 (నమస్తేతెలంగాణ)
వరంగల్, సెప్టెంబర్ 7(నమస్తేతెలంగాణ) : ఆసియా లో అతి పెద్ద మార్కెట్లలో రెండోదైన వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మార్కెట్ పరిధిలోని యార్డుల్లో ప్లాట్ ఫారాలు, రూఫింగ్, షాపులు, ఆఫీసు భవనాల ని ర్మాణానికి నిధులు కేటాయిస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే సుమారు రూ.23 కోట్లు మంజూరు చేసింది. పాలనాపరమైన, సాంకేతిక అనుమతులు రావడంతో పనులు చేపట్టేందుకు మార్కెటింగ్ శాఖ ఇంజినీరింగ్ విభాగం అధికారులు ఇటీవల టెండర్ల ప్రక్రియ ని ర్వహించారు. ఇందులో కొన్ని పనులు మొదలైనట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్లలో ఎనుమాముల మార్కెట్ పెద్దది. కొన్ని మార్కెట్లలో పత్తి, మక్కలు, మరికొన్ని మార్కెట్లలో పసుపు, అపరా లు, ఇంకొన్ని మార్కెట్లలో మిర్చి, వేరుశనగ కొనుగోళ్లు మాత్రమే జరుగుతాయి. ఎనుమాముల మార్కెట్లో మాత్రం రైతులు పండించే అన్ని రకాల పంట ఉత్పత్తుల కొనుగోళ్లు జరుగుతుండడం విశేషం. ఇక మిర్చి కొనుగోళ్లలో ఈ మార్కెట్‌ది నంబర్‌వన్ స్థానం.
మార్కెట్ ఫీజు రూపంలో దీనికి ప్రతి సంవత్సరం రూ.30 కోట్లకుపైగా ఆదాయం సమకూరుతున్నది. ఈ నేపథ్యంలో రైతు పక్షపాతిగా పనిచేస్తున్న ప్రభుత్వం ఎనుమాముల మార్కెట్‌ను మరింత అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్న ది. ఈ క్రమంలో రైతులు, వ్యాపారుల కోసం పంట ఉ త్పత్తుల కొనుగోళ్లు జరిగే యార్డుల్లో ప్లాట్ ఫారాలు, రూ ఫింగ్, షాపులు, మార్కెటింగ్ శాఖ అధికారుల పర్యవేక్ష ణ కోసం ఆఫీసు భవనాల నిర్మాణానికి ప్రణాళికలు రూ పొందించింది. ముఖ్యంగా ఎనుమాముల మార్కెట్ మెయిన్ గేటు వద్ద భారీ ఆర్చ్ నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
మంజూరైన పనులు..
ఎనుమాముల మార్కెట్లో పత్తి యార్డు వద్ద రూ.1.15 కోట్లతో వేలం ప్లాట్ ఫారాలు, రూ.20.50 లక్షలతో బ్యాంకు భవనం, రూ.30 లక్షలతో టాయిలె ట్స్, మెయిన్ బిల్డింగ్ వద్ద రూ.20.50 లక్షలతో వాటర్ ప్రూఫింగ్, రూ.6.50 లక్షలతో వేరుశనగ, పసుపు యా ర్డు వద్ద గుమస్తాల అసోసియేషన్ భవనం, రూ.22.50 లక్షలతో వెటర్నరీ ప్రైమరీ హెల్త్ సెంటర్, రూ.60 లక్షలతో మార్కెట్ యార్డుకు ప్రహరీ నిర్మాణం, రూ.9.20 లక్షలతో ఎండ్ల బండ్ల గేటు, రూ.10 లక్షలతో రైతు రెస్ట్ హౌస్, హాలు, టాయిలెట్స్ పునర్నిర్మాణం, రూ.47 లక్షలతో ధాన్యం, పప్పు దినుసుల యార్డు వద్ద సబ్ ఆఫీసు భవనం నిర్మాణం కోసం ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఈ మార్కెట్లో మిర్చి యార్డు వద్ద వేలం ప్లాట్‌ఫారాల నిర్మాణానికి రూ.4.44 కోట్లు, పసుపు, వేరుశనగ యార్డుల వద్ద వేలం ప్లాంటు ఫారాలపై రూఫింగ్ కోసం రూ.2.93 కోట్లు మంజూరు చేసింది. ఎనుమాముల మార్కెట్ మెయిన్ గేటు వద్ద ఆర్చ్ నిర్మాణానికి రూ.29 లక్షలు, ఈ మార్కెట్లోని మిర్చి యార్డు వద్ద ఆర్వో ప్లాంటుతో కూడిన ఓహెచ్ఎస్ఆర్ నిర్మాణం కోసం రూ.43 లక్షలు కేటాయిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది.
ఈ మార్కెట్లోని ధాన్యం, పప్పు దినుసుల యార్డు వద్ద 24 షాపుల నిర్మాణానికి రూ.2.55 కోట్లు, ఇక్కడ మరో 16 షాపుల నిర్మాణం కోసం రూ.1.65 కోట్లు, పీహెచ్సీ సెంటర్ ముందు టిన్ షెడ్ నిర్మాణానికి రూ.22 లక్షలు మంజూరు చేసింది. వీటితో పాటు వరంగల్ లక్ష్మీపురంలోని కూరగాయలు, పండ్ల మార్కెట్ వద్ద మార్కెటింగ్ శాఖ ప్రాంతీయ, జిల్లా అధికారుల కాంప్లెక్స్ నిర్మాణం కోసం రూ.4.18 కోట్లు కేటాయించింది. ఇదే లక్ష్మీపురంలోని మోడల్ మార్కెట్లో అదనంగా 11 షాపుల నిర్మాణానికి రూ.74.50 లక్షలు మంజూరు చేసింది.
సోడషపల్లి యార్డుకు రూ.1.98 కోట్లు..
ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని సోడషపల్లి సబ్ మార్కెట్ యార్డుకు వివిధ అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.1.98 కోట్లు ఇచ్చింది. మార్కెట్ యార్డు లెవలింగ్‌కు రూ.20లక్షలు, బోర్వెల్కు రూ.3 లక్షలు, ఆఫీసు భవన నిర్మాణానికి రూ.25 లక్షలు, సబ్ మార్కెట్ యార్డు చుట్టూ ప్రహరీ నిర్మాణానికి రూ.76లక్షలు, రెండు షెడ్ల నిర్మాణం కోసం రూ.66లక్షలు, విద్యుత్ సరఫరా కోసం రూ.5 లక్షలు, టాయిలెట్ బ్లాక్ నిర్మాణానికి రూ.3 లక్షలు మంజూరైనట్లు మార్కెటింగ్ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ నిధులతో పనులు చేపట్టేందుకు ఇంజినీరింగ్ విభాగం అధికారులు టెండర్ల ప్రక్రియ జరిపారు.
పురోగతిలో అభివృద్ధి పనులు..
– ప్రసాదరావు, మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారి, వరంగల్
ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలో రూ.23 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టేందుకు టెండర్ల ప్రక్రియ నిర్వహించాం. చాలా పనులు పురోగతిలో ఉన్నాయి. ప్రహరీ పునర్నిర్మాణం పూర్తయింది. గుమస్తాల అసోసియేషన్ భవనం, వెటర్నరీ ప్రైమరీ హెల్త్ సెంటర్, బ్యాంకు బిల్డింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. ఆర్చ్, ఓహెచ్ఎస్ఆర్ నిర్మాణ పనులు మొదలు కావాల్సి ఉంది. షాపుల నిర్మాణం అగ్రిమెంట్ దశలో ఉంది. లక్ష్మీపురం మోడల్ మార్కెట్లో పదకొండు అదనపు షాపుల నిర్మాణం పూర్తయింది. సోడషపల్లి సబ్ మార్కెట్ యార్డు పనులు చురుగ్గా సాగుతున్నాయి.