సొంత జాగ ఉండి, ఇల్లు లేని అర్హులైన వారికి ఇల్లు మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టగా మంగళవారం ప్రజల నుంచి దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఈ పథకం కింద రాష్ట్ర సర్కార్ మూడు విడుతల్లో కలిపి రూ.3లక్షల ఆర్థికసాయం అందించాలని నిర్ణయించి మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈమేరకు హనుమకొండ, వరంగల్ జిల్లాల పరిధిలోని తహసీల్దార్/మండల పరిషత్, నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపల్, వరంగల్ కాశీబుగ్గలోని జీడబ్ల్యూఎంసీ సర్కిల్, పరకాల, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్యాలయాల్లో, హనుమకొండ కలెక్టరేట్, కాజీపేట సర్కిల్, గ్రేటర్ ప్రధాన కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయగా తొలిరోజు కిటకిటలాడాయి. కాశీబుగ్గ సర్కిల్ ఆఫీస్‌లో 1907 దరఖాస్తులు రాగా, వీటిలో వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందినవి 519, వర్ధన్నపేట నియోజకవర్గానివి 74, పరకాల నియోజకవర్గానికి 69, హనుమకొండ జిల్లాలో మొత్తం 2,716 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. జీవో 59 ద్వారా లబ్ధిపొందని వారు అర్హులని పేర్కొని, ఈనెల 30వ తేదీ దరఖాస్తులకు గడువు విధించింది.
వరంగల్, ఆగస్టు 8(నమస్తేతెలంగాణ): గృహలక్ష్మి పథకానికి దరఖాస్తులు వెల్లవలా వస్తున్నాయి. సొంత జాగ ఉండి, ఇల్లు లేని వారు దరఖాస్తులు అందజేస్తున్నారు. దీంతో తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాలు దరఖాస్తుదారులతో సందడిగా మారుతున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం.. ఆధార్, ఆహార భద్రత కార్డు ఉన్న వారు, ఆర్సీసీ స్లాబ్ ఇల్లు లేని వారు, జీవో నంబర్ 59 ద్వారా లబ్ధిపొందని వారు గృహలక్ష్మి పథకంలో ఇంటిని నిర్మించుకునేందుకు అర్హులని తెలిపింది. ఈ నెల 10వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పేర్కొంది.
ఆయా మండలకేంద్రంలోని తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాల్లో దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసింది. వరంగల్ జిల్లాలో తాసిల్దార్ కార్యాలయాలతోపాటు నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీ కార్యాలయాలు, గ్రేటర్ వరంగల్‌లో కాశీబుగ్గలోని జీడబ్ల్యూఎంసీ సర్కిల్ కార్యాలయంలో ఈ ప్రత్యేక కౌంటర్లు పని చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కాశీబుగ్గ సర్కిల్ కార్యాలయంలో వరంగల్‌తూర్పు నియోజకవర్గంలోని అర్హులతోపాటు జిల్లాలోని వర్ధన్నపేట నియోజకవర్గం పరిధిలోకి వచ్చే అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు.
ఈ దరఖాస్తుల స్వీకరణకు ప్రత్యేక కౌంటర్లు ఈ నెల 10వ తేదీ వరకు పనిచేస్తాయని వెల్లడించారు. దీంతో మంగళవారం దరఖాస్తుదారులతో ప్రత్యేక కౌంటర్లన్నీ కోలాహలంగా మారాయి. జిల్లాకు 9,750 గృహలక్ష్మి పథకంలో ఇండ్లు మంజూరయ్యాయి. అందులో నర్సంపేట నియోజకవర్గానికి 3 వేలు, వరంగల్తూర్పుకు 3 వేలు, పాలకుర్తి నియోజకవర్గానికి 450, పరకాల నియోజకవర్గానికి 1,800, వర్ధన్నపేట నియోజకవర్గంలో 1,500 ఇండ్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
దరఖాస్తుల స్వీకరణకు గడువు గురువారం ముగియనుండడంతో అర్హులు దరఖాస్తులు అందించేందుకు ప్రత్యేక కౌంటర్ల వద్ద పోటీపడుతున్నారు. కాశీబుగ్గ సర్కిల్ కార్యాలయంలో మొదటి రోజు 662 దరఖాస్తులను స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో వరంగల్‌తూర్పు నియోజకవర్గానికి చెందినవి 519, వర్ధన్నపేట నియోజకవర్గానికి చెందినవి 74, పరకాల నియోజకవర్గానికి సంబంధించినవి 69 ఉన్నట్లు ప్రకటించారు. మొత్తంగా మొదటి రోజు నర్సంపేట నియోజకవర్గం కలుపుకొని జిల్లావ్యాప్తంగా 1907 పైచిలుకు దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
హనుమకొండలో మొదటి రోజు 2716..
హనుమకొండ/వరంగల్: హనుమకొండ జిల్లాలో గృహలక్ష్మి పథకానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ మంగళవారం ప్రారంభించినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు. ఈ నెల 10 చివరి గడువు కావడంతో మండల, మండల పరిషత్, పరకాల, గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ, కలెక్టరేట్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. హనుమకొండ జిల్లాకు మొత్తం 8400 ఇండ్లు మంజూరైనట్లు తెలిపారు. కాగా, మొదటిరోజు శాయంపేట మండలంలో 320, ధర్మసాగర్ మండలంలో 122, వేలేరు మండలంలో 62, పరకాల మండలంలో 56, దామెర మండలంలో 56, ఆత్మకూర్ మండలంలో 48, నడికూడ మండలంలో 41, పరకాల మున్సిపాలిటీ పరిధిలో 165 మంది దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు.
అలాగే, హనుమకొండ మండలంలో 158, కాజీపేట మండలంలో 24, హసన్‌పర్తి మండలంలో 103, ఐనవోలు మండలంలో 443, కమలాపుర్ మండలంలో 829, ఎల్కతుర్తిలో 102, భీమదేవరపల్లి మండలంలో 187 మంది చొప్పున మొత్తం జిల్లా పరిధిలో 2,716 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ వివరించారు. అలాగే, తొలి రోజు గ్రేటర్ వరంగల్ పరిధిలో 852 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కాశీబుగ్గ, కాజీపేట సర్కిల్ కార్యాలయాలతో పాటు బల్దియా ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి గృహలక్ష్మి దరఖాస్తులను స్వీకరించారు.
కాజీపేట సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్లో పశ్చిమ, పరకాల నియోజకవర్గాలకు చెందిన వారి దరఖాస్తులు స్వీకరించారు. కాశీబుగ్గ సర్కిల్, ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజవర్గాల దరఖాస్తులను స్వీకరించారు. ఈ నెల 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని అధికారులు తెలిపారు. కాగా, కాశీబుగ్గ సర్కిల్ కౌంటర్లో 662, ప్రధాన కార్యాలయం కౌంటర్లో 106, కాజీపేట సర్కిల్ కౌంటర్లో 84 దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు.
గృహలక్ష్మికి దరఖాస్తు చేసుకోవాలి
కమలాపూర్/ఎల్కతుర్తి/ధర్మసాగర్: గృహలక్ష్మి పథకం కోసం దరఖాస్తులు అందజేయడానికి మండల పరిషత్ కార్యాలయంలో దరఖాస్తుదారులు క్యూకట్టారు. పెద్ద ఎత్తున ప్రజలు వస్తుండడంతో ఎంపీడీవో పల్లవి ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేసి, దరఖాస్తులను స్వీకరించారు. మరో రెండు రోజులు గడువు ఉండడంతో భారీగా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని ఎంపీడీవో తెలిపారు. అంతేకాకుండా గృహలక్ష్మి పథకానికి సంబంధించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఎల్కతుర్తి, ధర్మసాగర్ ఎంపీడీవోలు వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. అర్హులైన వారు ఆధార్, ఒటర్ ఐడీ కార్డు, భూమి రిజిష్ర్టేషన్ పత్రాలు లేదా పట్టాదారు పాస్ పుస్తకం, రేషన్ కార్డు జిరాక్స్ పత్రాలతో మండల పరిషత్ కార్యాలయాల్లో ఈ నెల 10లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు ఫారాలు మీసేవ కేంద్రాల్లో అందుబాటులో ఉంటాయని వారు పేర్కొన్నారు.