లింగాలఘనపురం, మే 28 : ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం తన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు రైతాంగంపై మరో కుట్రకు తెరతీసింది. వడ్ల కొనుగోళ్లలో రైతుల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సాగు తగ్గించేందుకు యత్నిస్తున్నది. అసలు విద్యుత్ సరఫరా లేకుంటే రైతులు ఎలా సాగుచేస్తారనే కోణంలో విషపు బాణాలను సంధించింది. ఇప్పటి వరకు ప్రతి రోజూ రాత్రి 11.20 గంటల నుంచి మరునాడు సాయంత్రం 5.45 గంటల వరకు వ్యవసాయానికి త్రీఫేస్ విద్యుత్ సరఫరా అయ్యేది.
రైతులంతా రోహిణి కార్తె వచ్చిందంటే పండుగ చేసుకుంటారు. తొలకరి జల్లులతో వర్షాధార పంటలు వేస్తూ ఇటు వరి పొలాలను చదును చేస్తుంటారు. ఈ క్రమంలో రైతులు రాత్రంతా తమ మళ్లను బోరుబావి నీళ్లతో నింపుతారు. తెల్లారి ఆ నారుమళ్లలో నాగళ్లకు పనులు చెబుతారు. దీనినే కాంగ్రెస్ ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంది. అసలు రాత్రి వేళ సాగునీటికి విద్యుత్‌ను అందించకుంటే సరిపోతుందని తలచింది. రైతులంతా నేడు ఎక్కువగా ధాన్యం కొనుగోళ్ల వద్దే పడిగాపులు పడుతుండడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మే 2వ తేదీ నుంచి రాత్రి వేళ సరఫరా అయ్యే త్రీఫేస్ విద్యుత్‌ను అంచెల వారీగా క్రమంగా తగ్గిస్తూ వచ్చింది. ఈ విషయం జనగామ జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రైతులు ఎక్కువగా వ్యవసాయ బావుల దగ్గరికి వెళ్లకుండా ధాన్యం కొనుగోళ్లపై దృష్టి సారించడంతో ప్రభుత్వం ప్రథమ పాచిక పారినట్లయింది. దీంతో మరో అడుగు ముందుకు వేసి ఈ నెల 15 నుంచి రాత్రివేళ త్రీఫేస్ విద్యుత్‌కు మంగళం పాడింది. ఉదయం 6.20 నుంచి సాయంత్రం 5.45 గంటల వరకు మాత్రమే ప్రతి రోజూ త్రీఫేస్ విద్యుత్‌ను సరఫరా చేయాలని గుట్టు చప్పుడుగాకుండా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వివరాలు తెలియని కొందరు రైతులు రాత్రి వేళ వ్యవసాయ బావులదగ్గరికి వెళ్లినా త్రీఫేస్ విద్యుత్ లేకపోవడంతో వెనుతిరిగి వస్తున్నారు.
గత నెల నుంచే రాత్రిపూట త్రీఫేస్ కరెంటు ఉంటలేదు.. వరికి తడులు ఆరటం.. కోతలు అవడం.. వడ్లు పట్టే పనిలో రైతులుండగా కరెంటు అవసరం అంతగా లేకుండే. రాత్రిపూట మళ్లు నింపుకొని తెల్లారి నుంచి పొలాలను దున్నుతాం. ఈ ఎండలకు పొద్దటి పూట ఎప్పడికప్పుడు నీళ్లు ఆరి పోతాయి. మడి తడిచేదెప్పుడు? దున్నేదెప్పుడు? ప్రభుత్వ కుట్రను వ్యతిరేకిస్తాం. కరెంట్ కోతలు ఎత్తేసే దాకా పోరాడుతాం.
-ఏదునూరి వీరన్న, రైతు, లింగాలఘనపురం
రాత్రిపూట మడులు మంచిగ నీళ్లతో నిండితేనే నేల తడుస్తుంది. పొద్దాక అయితే.. ఈ ఎండలకు ఒక్క మడీ సక్కగ నిండదు. నేల తడువదు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పిచ్చి పనులు చేస్తున్నది. రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదు. ఇప్పటికే వడ్ల కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. మరోవైపు కరెంట్ కోతలు పెడుతున్నది. కోతలు ఎత్తేయకుంటే పోరాటం తప్పదు.
-గండి యాదగిరి, రైతు, వడిచర్ల