ములుగు, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ) : మండలం కావాలనే మల్లంపల్లి గ్రామ ప్రజల కల నెరవేరింది. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న వేళ ములుగు మం డలంలోని మల్లంపల్లి గ్రామాన్ని ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ ఫైనల్ గెజిట్ నోటిఫికేషన్ను గురువారం విడుదల చేశారు. మల్లంపల్లిని మండలం చేసేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడిన సంవత్సర కాలం తర్వాత మల్లంపల్లిని మండలంగా ఏర్పాటు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
మల్లంపల్లి, రామచంద్రాపురం రెవెన్యూ గ్రామాల్లోని 10 గ్రామాలను కలుపుకొని మండలం ఏర్పాటు చేశారు. కొత్తగా ఏర్పాటయ్యే మల్లంపల్లి మండలంలో మహ్మద్గౌస్పల్లి, దేవనగర్, శ్రీనగర్, భూపాల్నగర్, శివతండా, మల్లంపల్లి గ్రామాలతో పాటు రామచంద్రాపురం, ముద్దునూరుతండా, గుర్తూరుతండా, కొడిశలకుంట గ్రామాలు విలీనం కానున్నాయి. ప్రస్తుతానికి మల్లంపల్లి మండల పరిధిలో మల్లంపల్లి-1, మల్లంపల్లి-2, భూపాల్నగర్, రామచంద్రాపురం, కొడిశలకుంట పరిధిలోని 5 ఎంపీటీసీలు, 10 సర్పంచ్లతో కొనసాగనున్నది.