‘మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నది. రూ. కోట్లు వెచ్చింది స్త్రీలు అన్ని రంగాల్లో రాణించేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలి.’ అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బుధవారం రాయపర్తిలోని పీఏసీఎస్ గోడౌన్లో స్వర్ణభారతి మండల సమాఖ్య, సెర్ప్, స్త్రీ నిధి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళల ఉచిత కుట్టు శిక్షణా కేంద్రాన్ని కలెక్టర్ బీ గోపితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు రూ. 7వేల విలువైన కుట్టు మిషన్లను కానుకగా అందజేస్తామని చెప్పారు.
రాయపర్తి, జనవరి 25: తెలంగాణలో మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం కోట్లాది రూపాయలతో పటిష్ట చర్యలు చేపట్టిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. మండలకేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం గోడౌన్లో స్వర్ణభారతి మండల సమాఖ్య, సెర్ప్, స్త్రీనిధి సంయుక్తంగా ఏర్పాటు చేసిన కుట్టు మిషన్ శిక్షణా కేంద్రాన్ని కలెక్టర్ బీ గోపి, అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడేతో కలిసి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మండల సమాఖ్య, రాణి రుద్రమదేవి జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు నాగపురి అమరావతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. 45 రోజులపాటు మండలకేంద్రంతోపాటు మరో మూడు గ్రామాల్లో కుట్టు శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేసి మహిళలకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు, రూ. 7 వేల విలువైన కుట్టు మిషన్లను అందజేస్తారన్నారు.
మండలంలోని ప్రజలు సోలార్ విద్యుత్ వినియోగానికి శ్రీకారం చుట్టాలని మంత్రి ఎర్రబెల్లి కోరారు. ఇండ్లలో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన మిషనరీ, రుణాలను స్త్రీనిధి అందజేస్తుందని, ప్రజలు సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ముందుకొస్తే ఒక్కో ప్లాంట్ ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం రూ. 40 వేల వరకు రాయితీ ఇస్తుందని వివరించారు. సోలార్ మిగులు విద్యుత్‌ను ప్రజలు ప్రభుత్వానికి విక్రయించొచ్చని మంత్రి ఎర్రబెల్లి ప్రజలకు సూచించారు.
కలెక్టర్, జిల్లా అదనపు, డీఆర్డీవో మిట్టపల్లి సంపత్‌రావు మహిళలకు సూచనలు చేశారు. అనంతరం సోలార్ విద్యుత్ ఉత్పత్తి, స్త్రీనిధి రుణాలకు సంబంధించిన కరపత్రాలను మంత్రి ఆవిష్కరించారు. కార్యక్రమాలలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి, జడ్పీటీసీ రంగు కుమార్, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ ఆకుల సురేందర్‌రావు, రాయపర్తి సర్పంచ్ గారె నర్సయ్య, ఎంపీటీసీ అయిత రాంచందర్, పీఏసీఎస్ చైర్మన్ కుందూరు రాంచంద్రారెడ్డి, ఏపీడీ గొట్టె శ్రీనివాస్, తహసీల్దార్ కుసుమ సత్యనారాయణ, ఎంపీడీవో గుగులోత్ కిషన్‌నాయక్, ఎంపీవో తుల రామ్మోహన్, ఏవో గుమ్మడి వీరభద్రం, ఏపీవో దొణికెల కుమార్‌గౌడ్, డీపీఎంలు అనిత, సరిత, భవానీ, సైదిరెడ్డి, ఏపీఎం పులుసు అశోక్‌కుమార్, సీసీలు చీపురు దేవేంద్ర, చెవ్వ యాదగిరి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మునావత్ నర్సింహానాయక్, మండల నాయకులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి మైలారంలోని శ్రీషిరిడీ సాయిబాబాను దర్శించుకున్నారు.