ఉమ్మడి జిల్లాలోని 18 వ్యవసాయ మార్కెట్ కమిటీ(ఏఎంసీలు)లను సిబ్బంది కొరత వేధిస్తున్నది. 234 మంది ఉద్యోగులకు 77 మందే ఉండగా, వారిపై అదనపు పనిభారం పడుతున్నది. అసియాలోనే అతి పెద్దదైన వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సంవత్సర ఆదాయం రూ. 66 కోట్ల టార్గెట్ కాగా, కావాల్సినంత మంది సిబ్బంది లేకపోవడంతో మెరుగైన సేవలు అందించలేకపోతున్నది. ఔట్సోర్సింగ్, దినసరి వేతనం పై సుమారు 400 మంది విధులు నిర్వర్తిస్తుండగా, మార్కెట్లలో పెరుగుతున్న రైతుల సేవలకనుగుణంగా ఉద్యోగులు లేకపోవడం సమస్యలా మారింది. ఖాళీగా ఉన్న పోస్టులను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని ఉద్యోగులతో పాటు రైతాంగం కోరుతున్నది.
– కాశీబుగ్గ, మార్చి 23
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో 70 శాతానికి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఉద్యోగులు అధిక పనిభారంతో ఒత్తిడికి గురవుతూ రైతులకు మెరుగైన సేవలు అందించలేకపోతున్నారు. ఈ సంవత్సరం 18 మార్కెట్ల నుంచి వ్యవసాయ ఉత్పత్తులపై ఒక శాతం పన్నుతో ప్రభుత్వం రూ. 121 కోట్ల టార్గెట్ విధించింది. ఇప్పటి వరకు రూ. 75 కోట్ల వరకు చేరుకోగా సీసీఐ, సివిల్ సప్లయ్, ఐకేపీ నుంచి పెద్ద మొత్తంలో మార్కెట్ సెస్ వస్తున్నది. అందులో ఒక్క ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ నుంచే ఏడాదికి రూ.66 కోట్ల టార్గెట్ విధించగా రూ. 38 కోట్లకు చేరుకున్నది. అలాగే కాటన్‌పై సీసీఐ, సివిల్ సైప్లెపై సెస్ వస్తున్నది.
కాగా జిల్లాలోని 18 వ్యవసాయ మార్కెట్లలో మార్కెటింగ్ శాఖ అంచనా ప్రకారం 234 మంది సిబ్బంది అవసరం ఉండగా ప్రస్తుతం 77 మంది ఉద్యోగులు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. అందులో 157 పోస్టులు ఖాళీగా ఉండగా ఐదుగురు ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఔట్ సోర్సింగ్, దినసరిగా సుమారు 400 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. అందులో ఉన్నత శ్రేణి కార్యదర్శి డిప్యుటేషన్‌పై ఉన్నారు. అలాగే స్పెషల్ గ్రేడ్ కార్యదర్శి మూడు పోస్టులకు ఒకటి, గ్రేడ్-3 కార్యదర్శి ఆరు పోస్టులకు ఒక పోస్టు ఖాళీగా ఉంది. అసిస్టెంట్ కార్యదర్శి ఎనిమిది పోస్టుల్లో నాలుగు ఖాళీగా ఉన్నాయి. సూపర్వైజర్ 33 పోస్టుల్లో ఆరు పోస్టులు, పది ఎల్డీసీ పోస్టులకు ఒకరే విధులు నిర్వర్తిస్తున్నారు.
గ్రేడర్లు ఎనిమిదికి ఏడు, అసిస్టెంట్ మార్కెట్ సూపర్వైజర్లు 27 పోస్టులకు 24, టైపిస్టు పోస్టులు ఐదుకు ఐదు, జూనియర్ మార్కెట్ సూపర్వైజర్ 16 పోస్టులకు తొమ్మిది, బిల్క్లర్క్ ఒకపోస్టు, డ్రైవర్ పోస్టులు నాలుగుకు నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే 18 అటెండర్ పోస్టులకు 12, వాచ్మెన్ 84 పోస్టులకు74 ఖాళీగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 30 మంది ఔట్ సోర్సింగ్‌పై డాటా ఎంట్రీ ఆపరేటర్లు, సెక్యూరిటీ గార్డ్స్ 160, అటెండర్లు 50, వాచ్మెన్లు 70, దినసరి 11 మంది పని చేస్తున్నారు. ఇప్పటికైనా రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని వెంటనే మార్కెట్ కమిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని పలువురు కోరుతున్నారు.
మార్కెట్ కమిటీల్లో ప్రస్తుతం 77 మంది సిబ్బంది విధులు నిర్వర్తిస్తుండగా, అందులో సగానికి పైగా కారుణ్య నియామకంపై ఉద్యోగం చేస్తున్న వారే ఉన్నారు. మిగతా వారు ఉద్యోగ విరమణకు దగ్గరగా ఉన్నారు. మార్కెట్ కమిటీ కార్యాలయాల్లో పూర్తిస్థాయి విధులు నిర్వర్తించే సిబ్బంది తక్కువగా ఉన్నారు. ఇందులో కొందరు మాత్రమే అన్ని సెక్షన్లలో పనిచేస్తారు. సక్రమంగా పనిచేసే వాళ్లని వేళ్ల మీద లెక్కించవచ్చు. మిగతా సిబ్బందికి పూర్తిస్థాయిలో పని రాదు. వారు నేర్చుకునేందుకు శ్రద్ధ చూపడం లేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. దీంతో పనిచేసే వారిపైనే అధిక భారం పడుతున్నదని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.