హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 27: వారంతా 25 సంవత్సరాల తర్వాత ఒకచోట కలుసుకున్నారు. ఆనాటి మధురజ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఉద్యోగరీత్యా విదేశాల్లో ఉన్నా సిల్వర్‌జూబ్లీ వేడుకల్లో పాల్గొని ఆనందంగా గడిపారు. హనుమకొండ సెయింట్ జోసెఫ్ బాలికల ఉన్నత పాఠశాల(తోటబడి)లో 1998-99వ సంవత్సరంలో పదో తరగతి పూర్తిచేసిన పూర్వవిద్యార్థినులు 25 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా అపూర్వ కలయిక ఆదివారం కనులవిందుగా సాగింది. బాల్యస్నేహితులను చూసి పూర్వవిద్యార్థులు పరవశించిపోయారు. చిన్ననాటి నుంచి 10వ తరగతి వరకు కలిసి చదువుకున్న స్నేహితులు సుదీర్ఘవిరామం తర్వాత ఒకే చోట చేరి, ఒకరి యోగక్షేమాలు మరొకరు తెలుసుకుంటూ ముచ్చటించుకున్నారు.
తమ చిన్ననాటి మధురమైన జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. అప్పటి తమ పాఠశాల, ఉపాధ్యాయులు నేర్పిన క్రమశిక్షణ, విద్యావిధానం తమను జీవితంలో ఉన్నతస్థానాలకు చేర్చాయని వారు సంతోషంగా గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా పూర్వవిద్యార్థులు తమ గురువుల గొప్పతనాన్ని కొనియాడుతూ వారిని ఘనంగా సత్కరించుకున్నారు. టి.శ్వేత, ఎం.సుజాత, ఏ.శ్రీరజ, డాక్టర్ కె.సంధ్య, జి.స్రవంతి, బి.హైమావతి, ఎడ్ల స్వప్న, అనూష, డి.స్వప్న, బాంధవి, పాల్గొన్నారు.