డబ్బులేమైనా చెట్లకు కాస్తాయా..! అంటే అవుననే అంటున్నారు శ్రీగంధం సాగుచేసే రైతులు. ఒక్కసారి శ్రీగంధం మొక్కలు పెట్టి చూస్తే వాటి ఫలితాలే చెబుతాయని నిరూపిస్తున్నారు నల్లబెల్లి మండల రైతులు. ప్రపంచంలో కేవలం ఎనిమిది దేశాల్లోని భూములే శ్రీగంధం సాగుకు అనువైనవి. అందులోనూ మన దేశంలో, ముఖ్యంగా తెలంగాణలో సాగయ్యే శ్రీగంధానికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. సువాసనతో కూడినందున ప్రపంచదేశాల్లో మంచి గిరాకీ ఉంది. ఎక్కువగా పల్లెల్లో భూములు ఉండి పట్టణాల్లో సెటిల్ అయిన రైతులు మాత్రమే తెలంగాణలో శ్రీగంధం సాగు చేస్తున్నారు.
– నల్లబెల్లి, ఏప్రిల్ 28
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని నారక్కపేట గ్రామానికి చెందిన గటికె శ్రీనివాస్ అనే రైతు రెండెకరాల భూమిలో శ్రీగంధం సాగు చేశాడు. అలాగే గుండ్లపహాడ్ గ్రామానికి చెందిన నాగిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి తనకున్న భూమిలో 20 గుంటల్లో ఎర్రచందనం సాగు చేయగా ప్రస్తుతం కోత దశకు చేరుకుంది. శ్రీగంధం అయినా ఎర్రచందనం అయినా ఈ మొక్క శాస్త్రీయ నామం శాంటాలమ్ ఆల్బమ్. ఇది శాంటాలేసి కుటుంబానికి చెందినదిగా పిలుస్తారు. శ్రీగంధం మొక్క పూర్తిగా పరాన్నజీవి. ఇతర మొక్కల వలే ఈ మొక్క సొంతంగా ఆహారం తయారుచేసుకోలేదు. ఆహారం కోసం ఇతర మొక్కలపై ఆధారపడుతుంది. శ్రీగంధం మొక్క సొంతంగా భూమిలో నుంచి 40శాతం ఆహారాన్ని, మిగితా 60శాతం ఆహారాన్ని ఇతర మొక్కల నుంచి తీసుకుంటుంది.
ఎర్రచందనం లేక శ్రీగంధం సాగు చేసిన రైతులు ఈ మొక్కల పక్కన మలబార్ వేప, దానిమ్మ, నిమ్మ, సర్వీ, ఉసిరి, చింత, నారింజ, కానుగ, నల్లతుమ్మ, రోజ్‌వుడ్ లాంటి మొక్కలను నాటాల్సి ఉంటుంది. శ్రీగంధంలో అపార ఔషధ గుణాలు ఉన్నందున తెలుగు ప్రజల సంసృతిలో భాగం శ్రీగంధం అంటారు. ఇతర దేశాల్లో ఎర్రచందనం, శ్రీగంధం అంతరించి పోతున్నందున ఈ సాగుకు ఎలాంటి అనుమతులు లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణలో సాగును ప్రోత్సహిస్తున్నాయి. మొక్క క్రాపు దశకు వచ్చాక అటవీ అధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. శ్రీగంధం సాగు చేశాక మొక్కకు మొక్కకు మధ్య దూరం చాలా ఉన్నందున రైతులు అంతర పంటలు సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చని హార్టికల్చర్ అధికారులు చెబుతున్నారు. ప్రకృతి వైపరీత్యాలకు గురై నేడు రైతులు పంటలు నష్టపోయి అప్పులపాలవుతున్నందున ప్రత్యామ్నాయ పంటలతో లాభాలు పొందవచ్చు.
శ్రీగంధం సాగుతో మంచి లాభాలు..
శ్రీగంధం, ఎర్రచందనం సాగు రైతులకు భవి ష్య నిధి అని చెప్పవచ్చు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే కలప జాతి మొక్క శ్రీగంధం. మొక్క నాటిన 15 నుంచి 20 ఏళ్ల లోపు ఊహించని ఫలితం వస్తుంది. ఔషధాల తయారీలో ఈ మొక్క ఉపయోగం కీలకమైనందున అంతర్జాతీయ మార్కెట్లో తెలంగాణలో పండించే శ్రీగంధానికి మంచి ప్రాముఖ్యత ఉంది. శ్రీగంధం, ఎర్రచందనం సాగు చేసేందుకు ముందుకొచ్చే వారిని ఉద్యాన శాఖ ప్రోత్సహిస్తున్నది.
– శ్రీనివాస్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి, వరంగల్