న్యూశాయంపేట, ఆగస్టు 26 : ఎంచుకున్న మార్గం మంచిదైతే విజయం తథ్యమని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. హంటర్‌రోడ్డులోని డీ కన్వెన్షన్ హాల్లో యాదవ వెల్ఫేర్ ట్రస్టు చైర్మన్ సుందర్రాజ్ యాదవ్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శ్రీకృష్ణుడు బోధించిన భగవద్గీత మానవాళికి అనుసరణీయమన్నారు. కష్టాలను ఎలా ఎదురోవాలో, ద్వేషం ఎలా తగ్గించుకోవాలో గీత చదివితే అవగతమవుతుందని వివరించారు.
వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో గొల్లకురుమలు కలిసికట్టుగా పాల్గొనడం హర్షణీయమన్నారు. సుందర్రాజ్ యాదవ్ మాట్లాడుతూ.. శ్రీకృష్ణ పరమాత్ముడి జీవితం అందరికీ ఆదర్శమన్నారు. కార్యక్రమంలో కాసం వెంకటేశ్వర్లు, కన్నెబోయిన రాజయ్య యాదవ్, కార్పొరేటర్ జకుల రవీందర్ యాదవ్, ఎల్లావుల లలితాయాదవ్, సాంబయ్యయాదవ్ పాల్గొన్నారు. కాగా, ఓరుగల్లు శ్రీనివాసయాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కోలాట నృత్యాలు, ఉట్టి కొట్టే కార్యక్రమాలు ఆహుతులను ఆకట్టుకున్నాయి.