హనుమకొండ, జూలై 12 : ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ గడువులోగా పూర్తవుతుందా? అనే సందేహా లు వ్యక్తమవుతున్నాయి. గత నెల 25న ప్రారంభించిన ఈ ప్రక్రియకు 12 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉండగా, ఇప్పటి వరకు ఎన్యుమరేషన్ ఫామ్ (ఈఎఫ్)ల డిజిటలైజేషన్ కేవలం 43.31 శాతం పూర్తి కావడం ఆందోళన కలిగిస్తున్నది. వంద శాతం ఓటర్లకు ఈఎఫ్‌లు పంపిణీ చేసినప్పటికీ డిజిటలైజేషన్ లక్ష్యాన్ని చేరుకోవడం సవాలుగా మారిందని అధికారులంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని అధికార యంత్రాంగం డిజిటలైజేషన్‌ను వేగవంతం చేసేందుకు అదనపు సిబ్బందిని నియమించినప్పటికీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతుండగా ఓటర్లు ఆందోళన చెందుతున్నారు.
సర్ ప్రారంభమై దాదాపు 19 రోజులు పూర్తయినప్పటికీ ఈఎఫ్‌లు నింపడంలో ఓటర్లకు అవస్థలు తప్ప డం లేదు. పలు సందేహాలు, అనుమానాలతో ఓటర్లు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. క్షేత్ర స్థాయిలో అనుమానాలను నివృత్తి చేసే అధికారులు అందుబాటు లో ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్‌ను క్షేత్రస్థాయిలో వేగవంతం చేయాలని బీఎల్వోలను అధికారులు ఆదేశిస్తున్నప్పటికీ ఆశించిన మేర ముందుకు సాగడం లేదనే విమర్శలున్నాయి. ముఖ్యంగా కొన్ని చోట్ల ఓటర్ల సందేహాలను తీర్చలేక బీఎల్వోలు ఇబ్బందులు పడుతున్నారు.
ఈఎఫ్లో 2002 ఓటరు జాబితా వివరాలను పొందుపర్చాలని ఉంది. వాస్తవానికి శిక్షణ పొందిన బీఎల్వోలు ఇంటింటికీ తిరిగి ఫారాలు నింపే విధానాన్ని తెలపాల్సి అలా జరగడం లేదంటున్నారు. ఫామ్‌లు ఇచ్చి వాటిని నింపి ఇవ్వాలని వెళ్లిపోతున్నారే తప్ప అవగాహన కల్పించడం లేదని ఓటర్లు వాపోతున్నారు. అలాగే, కొందరు బీఎల్వోలకు యాప్ నిర్వహణ కూడా భారంగా మారింది. డాటా ఎంట్రీ ఎలా చేయాలో తెలియక తర్జన భర్జన పడుతున్నారు.
అత్తగారింటికి వచ్చిన కొత్త కోడళ్లకు తిప్పలు తప్ప డంలేదు. ఇతర జిల్లాలు, నియోజకవర్గాలు, మండలా ల నుంచి పెండ్లి చేసుకొని వచ్చిన మహిళలకు సర్ కొత్త పంచాయితీ తెచ్చిపెడుతున్నది. వీరి 2002 ఓటరు జాబితా దొరకకపోవడం, తాత, నాన మ్మ, అమ్మమ్మ, వారసుల వివరాలు లభించక ఇబ్బంది పడుతున్నామని బీఎల్వోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సర్ ప్రక్రియ ఈ నెల 24న ముగియనుండగా.. కేవలం 12 రోజులే మిగిలి ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 నియోజకవర్గాల పరిధిలోని ఓటర్లందరికీ ఈఎఫ్‌లు అందజేశారు. అయితే 17 రోజులు దాటినప్పటికీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల వరకు కేవలం 43 శాతమే డిజిటలైజేషన్ కావడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గడువు సమీపిస్తున్న నేపథ్యంలో మిగిలిన 57 శాతం ప్రక్రియను పూర్తి చేయాలంటే క్షేత్రస్థాయిలో ప్రత్యేక చర్యలు అవసరమని ప్రజలంటున్నారు. అదనపు సిబ్బందిని నియమించడం, ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేయడం, గ్రామాలు, కాలనీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మాత్రమే ప్రక్రియ వేగవంతమవుతుందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
