మంగపేట, ఆగస్టు 12 : భార్యను కాపురానికి పంపడం లేదని అత్త మామలపై అల్లుడు కర్రతో దాడి చేయడంతో మామ మృతి చెందగా, అత్తకు గాయాలయ్యాయి. ఈ ఘటన ములుగు జిల్లా మంగపేట మండలం బాలన్నగూడెం పరిధి నీలాద్రిపేటలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై టీవీఆర్ సూరి కథనం మేరకు.. గ్రామానికి చెందిన గొర్రె నర్సయ్య- నర్సక దంపతులకు ముగ్గురు కుమార్తెలు కాగా రెండో కూతురు స్వప్నను 17 ఏళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన గాంధర్ల రామకృష్ణకు ఇచ్చి పెళ్లి చేశారు.
అయితే రామకృష్ణ నాలుగేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన మరో మహిళను వివాహం చేసుకోగా, స్వప్న అతడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అప్పటి నుంచి స్వ ప్న తల్లిదండ్రుల వద్దే ఉంటున్నది. ఈ క్రమంలో రామకృష్ణ ఆదివారం రాత్రి నర్సయ్య, నర్సకలపై కర్రతో దాడి చేయగా ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారిని ములుగు జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొం దుతూ నర్సయ్య(56) మృ తి చెందాడు.
నర్సక్కను మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించి చికిత్స అనంతరం గ్రామానికి తీసుకొచ్చారు. కాగా, ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ సోమవారం సాయంత్రం నీలాద్రిపేటకు చేరుకొని ఘటనా స్థలిని సందర్శించి దాడి జరిగిన విధానాన్ని నర్సక్కను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట సీఐ శ్రీనివాస్, ఎస్సై టీవీఆర్ సూరి ఉన్నారు. మృతుడి చిన్న కూతురు సౌజన్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.