కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారి చేతి చమురును కొంతమంది రెవెన్యూ అధికారులు వదిలిస్తున్నారు. విచారణ పేరిట డబ్బులు అడుగుతున్నారు. లేదంటే కార్డు ఇవ్వమంటూ దబాయిస్తున్నారు. దీంతో చాలా కాలంగా ఎదురుచూస్తున్న వారు చేసేదేమీ లేక అడిగినంతా ఇచ్చుకుంటున్నారు. ఒకవేళ ఇవ్వకుంటే విచారణాధికారులు పెట్టే కొర్రీలకు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తుందని జంకుతున్నారు. ఈ తతంగం మహబూబాబాద్ జిల్లాలో జోరుగా సాగుతున్నది. ఇక పాత కార్డులో కొత్తగా పేరు చేర్చుకోవాలనుకునే వారినీ అధికారులు వదలడం లేదు. ఎలాంటి విచారణ అవసరం లేకుండానే పేరు నమోదు చేయాల్సిన అధికారులు డబ్బుల కోసం వేధిస్తున్నారు. ఇవ్వని వారి పేర్లను రిజెక్ట్ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
– మహబూబాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ)
కొత్తవారిని చేర్చేందుకూ డబ్బులే..
రేషన్ కార్డు ఉండి అందులో పిల్లలు, ఇంకెవరివైనా పేర్లు చేర్పించాలన్నా లంచం అడుగుతున్నారని పలువురు రేషన్ కార్డుదారులు వాపోతున్నారు. జిల్లా వ్యాప్తంగా 10వేల మంది కార్డుదారులు దరఖాస్తు చేసుకున్నారు. ఇప్పటికే ఉన్న కార్డులో ఒకరిని చేర్చాలంటే ఎలాంటి విచారణ అవసరం లేదు. అయితే ఇదే అదనుగా రెవెన్యూ అధికారులు కొత్త వారిని చేర్చేందుకు కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. మహబూబాబాద్ పట్టణం స్నేహనగర్కు చెందిన కస్తూరి సురేశ్ తన పేరును రేషన్‌కార్డులో చేర్చేందుకు 2023 అక్టోబర్‌లో మీ సేవలో దరఖాస్తు చేసుకున్నాడు. విచారణ చేయకుండానే ఇతడి పేరును కార్డులో చేర్చాల్సిన రెవెన్యూ అధికారులు రిజెక్ట్ చేశారు. ఒకసారి రిజెక్ట్ చేస్తే మళ్లీ పౌరసరఫరాల శాఖ లాగిన్‌లో పూర్తిగా తొలగించిన తర్వాతనే తిరిగి దరఖాస్తు చేసుకోవాలి. తన పేరును ఎందుకు రిజెక్ట్ చేశారని బాధితుడు అడిగితే అధికారులు సమాధానం చెప్పకుండా తప్పించుకుంటున్నారు.
‘హలో నేను రేషన్‌కార్డు విచారణ అధికారిని మాట్లాడుతున్నా.. మీరు ఎక్కడున్నారు? మీ ఆధార్ కార్డు, మీ కరెంట్ బిల్లు, మీ సేవలో దరఖాస్తు చేసిన రసీదు పట్టుకొని నా వద్దకు రా’ అని కార్డుదారుడికి కొత్త నంబర్ నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. కార్డుదారుడు ఫోన్ ఎత్తి ‘సార్ నేను ఇంట్లోనే ఉన్నాను.. మీరు ఎక్కడున్నారు’ అని అనగానే.. ‘నేను ఇకడే సూల్ కాడ.. ఇందిరాగాంధీ బొమ్మ కాడ ఉన్న’ అంటూ రకరకాల గుర్తులు చెప్పి రమ్మంటాడు. కార్డుదారుడు అధికారి చెప్పినవన్నీ పట్టుకొని వెళ్లగానే పిచ్చిపిచ్చి ప్రశ్నలు వేసి విసిగిస్తాడు. అంతా అయిపోయాక.. మరి ఏమీ లేదా? కార్డు ఊరికనే వస్తుందా? అంటూ దబాయిస్తాడు.
ఏం కావాలి సార్.. అని అనేగానే రూ.3వేలు ఇవ్వు.. నీకు కార్డు తప్పకుండా వస్తుందంటాడు. అబ్బో సార్.. నా దగ్గర అంత లేవు అనగానే.. అలా అయితే కార్డు ఎలా వస్తుందయ్యా.. ఒకసారి డబ్బులిస్తే నీకు జీవితాంతం కార్డు ఉంటుంది’ అని చెప్పడంతో కార్డుదారులు చేసేదేమీలేక అడిగినంత ఇచ్చుకుంటున్నారు. ఇదీ ని త్యం జిల్లాలో జరుగుతున్న కొందరు లంచావతారుల దందా. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వీరు ఆడిందే ఆట.. పాడిందే పాట అన్న చందంగా సాగుతున్నది. ప్రజలు కొత్తకార్డుల కోసం దరఖాస్తు చేసుకోగా వాటిని గ్రామాల వారీగా విచారణ చేస్తున్నారు.
ఇక డి వరకు బాగానే ఉన్నా విచారణ పేరిట పేదల నుంచి కొందరు విచారణ అధికారులు ము కుపిండి మరీ డబ్బులు గుంజుతున్నారు. మ హబూబాబాద్ పట్టణంలో పాత బజారులో నివాసముంటున్న రమేశ్ 4 నెలల క్రితం రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నాడు. విచారణ పేరిట రమేశ్‌ను నానా తిప్పలు పెట్టడంతో అర్హత ఉన్నా ఎంతో కొంత ముట్టజెప్పి వెళ్లిపోయాడు. మరిపెడ పట్టణానికి చెందిన శారద రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా అకడి అధికారి ఆమెకు ఫోన్ చేసి డబ్బులు అడిగారు. నెల్లికుదురు మండల కేంద్రంలో రాజు అనే వ్యక్తి నుంచి సైతం డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలున్నాయి.
గూడూరు మండల కేంద్రానికి చెందిన రాజునాయక్ వద్ద తహసీల్దార్ కార్యాలయం వారు డబ్బులు వసూలు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు.. ప్రతి దరఖాస్తుదారుడి నుంచి విచారణ పేరిట డబ్బులు దండుకుంటున్నారు. లబ్ధిదారుడికి కొత్తగా రేషన్ కార్డు కావాలంటే రెవెన్యూ ఇన్స్పెక్టర్, అనంతరం తహసీల్దార్ ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. వీరిద్దరూ అప్రూవల్ చేసిన తర్వాత పౌరసరఫరాల సంస్థ వారి లాగిన్‌లో అప్రూవల్ చేయాలి. ఈ మూడు చోట్ల అప్రూవల్ అయిన తర్వాతనే లబ్ధిదారుడికి కార్డు వస్తుంది. అప్పుడు లబ్ధిదారుడు మీసేవకు వెళ్లి కార్డును ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది.