రోజురోజుకు విద్యుత్ అవసరాలు, ఖర్చులు పెరుగుతున్నాయి. ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ ఉపకరణాల అధిక వినియోగంతో బిల్లులు తడిసి మోపెడవుతున్నాయి. పేదలకు కరంటు బిల్లుల భారం తప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సోలార్ విద్యుత్‌పై దృష్టి సారించింది. స్వయం సహాయక సంఘాల సభ్యులకు సోలార్ యూనిట్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. డాబా ఇళ్లపై టూ లేదా త్రీ కేడబ్ల్యూ కెపాసిటీతో ప్యానెళ్లను ఏర్పాటు చేయనున్నది. వీటి కొనుగోలుకు రుణాలతో పాటు సబ్సిడీ అందజేయనుంది. 2 కిలోవాట్‌కు రూ.39,200, 3 కిలోవాట్‌కు రూ.57,360 ఆర్థిక సాయం సమకూర్చనుంది. యూనిట్ ఏర్పాటు తర్వాత గృహావసరాలకు పోను మిగులు విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేయనున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 350 మందికి యూనిట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్త్రీ నిధి రీజినల్ మేనేజర్ సైదిరెడ్డి వెల్లడించారు.
వరంగల్, ఫిబ్రవరి 20(నమస్తేతెలంగాణ) : సొంతంగా సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేసుకుని కరంటు బిల్లులను తగ్గించుకోవడానికి స్వయం సహాయక సంఘా(ఎస్‌హెచ్‌జీ)ల సభ్యులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు స్త్రీనిధి నుంచి ఎస్‌హెచ్‌జీ సభ్యులకు రుణం, సబ్సిడీ ఇచ్చేందుకు ప్రణాళిక రూపొందించింది. మార్గదర్శకాలు కూడా విడుదల కావడంతో కొద్ది రోజుల నుంచి అధికారులు సోలార్ యూనిట్ల ఏర్పాటుపై గ్రామాల వారీగా ఎస్‌హెచ్‌జీలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
టూ లేదా త్రీ కిలోవాట్స్(కేడబ్ల్యూ) కెపాసిటీ సోలార్ యూనిట్ల ప్రాజెక్టు విలువ, రుణ వసతి, సబ్సిడీతో పాటు వీటి ఏర్పాటు వల్ల ప్రయోజనాలను వివరిస్తున్నారు. విద్యుత్ అవసరాలు, ఖర్చుల భారం పెరిగిపోతున్న తరుణంలో ప్రభుత్వం సౌర విద్యుత్ ఉత్పత్తిపై దృష్టి సారించింది. తమ గృహ అవసరాల కోసం నెలకు 200 నుంచి 300 యూనిట్ల విద్యుత్ వినియోగించుకునే ఎస్‌హెచ్‌జీల్లోని సభ్యులు టూ లేదా త్రీ కేడబ్ల్యూ కెపాసిటీ యూనిట్లను ఏర్పాటు చేసుకోవచ్చని ప్రకటించింది. సోలార్ ప్యానెల్ బిగించేందుకు ఆర్సీసీ ఇల్లుకు సుమారు 160 నుంచి 200 చదరపు అడుగుల డాబా ఉండాలి.
తమ నెలవారీ గృహ అవసరాలకు వినియోగించే విద్యుత్ యూనిట్ల ఆధారంగా టూ లేదా త్రీ కేడబ్ల్యూ కెపాసిటీ యూనిట్‌పై ఎస్‌హెచ్‌జీల్లోని సభ్యులు నిర్ణయం తీసుకుని ఎన్పీడీసీఎల్ అనుమతితో టీఎస్రెడ్కో ద్వారా ఏర్పాటు చేసుకోవచ్చు. ఆయా సభ్యురాలు తమకు నచ్చిన మోడల్, కంపెనీ, వెండర్‌ను ఎంపిక చేసుకునే అవకాశాన్ని కల్పించింది. రోజుకు టూ కేడబ్ల్యూ 8, త్రీ కేడబ్ల్యూ 12 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయనుంది. సౌర విద్యుత్ ఉత్పత్తి పర్యావరణ పరిరక్షణకూ తోడ్పడనుందని ప్రభుత్వం భావిస్తుంది. యూనిట్ల ఏర్పాటుకు సబ్సిడీని మినహాయించి స్త్రీనిధి నుంచి రుణాలు మంజూరు చేస్తుంది.
జిల్లాలో 13,327 ఎస్‌హెచ్‌జీలు ఉన్నాయి. వీటిలో 1,43,235 మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 350 మందికి యూనిట్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్త్రీనిధి రీజినల్ మేనేజర్ బీ సైదిరెడ్డి వెల్లడించారు. ఈ నేపథ్యంలో గీసుగొండ, దుగ్గొండి మండలాల్లోని వివిధ గ్రామాల్లో ఎస్‌హెచ్‌జీ సభ్యులకు ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు ఆయన చెప్పారు. ఈ కార్యక్రమాలకు హాజరైన ఎస్‌హెచ్‌జీ సభ్యుల్లో పలువురు సోలార్ యూనిట్ల ఏర్పాటుకు ఆసక్తి కనబరిచినట్లు తెలిపారు.
విలువ ఎంతంటే..
ఈ కార్యక్రమాన్ని స్త్రీ నిధి, టీఎస్రెడ్కో సంయుక్తంగా అమలు చేసే పనిలో తలమునకలయ్యాయి. టూ కేడబ్ల్యూ కెపాసిటీ యూనిట్ ప్రాజెక్టు విలువ రూ.1,42,200. ఇందులో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ రూ.39,200. దరఖాస్తు రుసుం రూ.2,360. నెట్‌మీటర్ చార్జీలు రూ.2,950. నికరంగా ఎస్‌హెచ్‌జీ సభ్యురాలు చెల్లించాల్సింది రూ.1.03 లక్షలు. స్త్రీనిధి రుణం రూ.లక్ష. సభ్యురాలి వాటా రూ.3 వేలు. యూనిట్ పొందాక లబ్ధిదారు నెలవారీగా చెల్లించాల్సిన వాయిదా రూ.2,243. త్రీ కెపాసిటీ ప్రాజెక్టు విలువ రూ.1,92,360. సబ్సిడీ రూ.57,360. దరఖాస్తు రుసుం రూ.3,450. నెట్‌మీటర్ చార్జీలు రూ.2,950. నికరంగా సభ్యురాలు చెల్లించాల్సింది రూ.1.35 లక్షలు. స్త్రీనిధి రుణం రూ.1.25 లక్షలు.
సభ్యురాలి వాటా రూ.10 వేలు. సదరు లబ్ధిదారు యూనిట్ పొందాక చెల్లించాల్సిన నెలవారీ వాయిదా రూ.2,803. సౌర విద్యుత్ యూనిట్ పూర్తి స్థాయిలో అమర్చిన తర్వాత టీఎస్రెడ్కో అధికారులు, స్త్రీనిధి సిబ్బంది తనిఖీ చేసి లబ్ధిదారు సంతృప్తి మేరకు ఇన్స్టాలేషన్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఆ తర్వాత రుణ మొత్తాన్ని స్త్రీనిధి సభ్యురాలి సేవింగ్స్ ఖాతాలో జమ చేస్తారు. సబ్సిడీ మొత్తాన్ని టీఎస్రెడ్కో వెండర్‌కు రిలీజ్ చేస్తుంది. స్త్రీనిధి రుణాన్ని లబ్ధిదారులు 60 నెలల్లో తిరిగి చెల్లించాలి.
ప్రయోజనాలు ఇవే..
సోలార్ యూనిట్ ద్వారా ఉత్పత్తి జరిగే సౌర విద్యుత్‌లో లబ్ధిదారులు నెట్ మీటరింగ్‌తో గృహ అవసరాలకు వినియోగించగా మిగిలే కరంటును గ్రిడ్‌కు ఇస్తే అవసరమైనప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేయనుంది. గ్రిడ్‌కు సరఫరా చేసిన మిగులు విద్యుత్‌ను లబ్ధిదారులు తమకు అవసరమైనప్పుడు వినియోగించుకొనే అవకాశం కూడా ఉంది. ఈ యూనిట్లతో కరంటు బిల్లుల్లో తగ్గుదలతో పాటు నిర్వహణ ఖర్చులు ఉండవు. పెట్టుబడి వ్యయం ఐదేళ్లలో తీరిపోతుంది. సోలార్ ప్యానల్ వారెంటీ పాతికేళ్లు. సోలార్ యూనిట్ వారెంటీ ఐదేళ్లు ఉంటుంది.