హనుమకొండ, డిసెంబర్ 25 : రేవంత్‌రెడ్డీ.. భాష మార్చుకో, కేసీఆర్‌ను విమర్శించే స్థాయి నీకు లేదని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. గురువారం హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ చావు అంచుల వరకు వెళ్లి తెలంగాణను సాధించి, రాష్ర్టాన్ని పదేండ్లలో ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చారని అన్నారు. తెలంగాణకు ద్రోహం చేసే వ్యక్తులతో చేతులు కలిపిన వ్యక్తి రేవంత్ రెడ్డని విమర్శించారు. కేసీఆర్ స్వయప్రకాశమైన నాయకుడు అయితే రేవంత్‌రెడ్డి పరాన్నజీవి (పారసైట్) అన్నారు. తెల్లారి లేస్తే కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తామనే మీ అజెండా ద్వేషమే తప్ప అభివృద్ధి కాదని మరోసారి రుజువైందన్నారు.
కేసీఆర్ లేకపోతే తెలంగాణ వచ్చేదా.. నీవు సీఎం అయ్యే వాడివా అని ప్రశ్నించారు. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం కేసీఆర్‌ను రానివ్వనంటున్న రేవంత్ రెడ్డి ముందుగా మీరు రాజకీయాల్లో, అధికారంలో ఉండేది ఈ మూడేళ్లే అన్న సత్యాన్ని గుర్తుంచుకోవాలన్నారు. రేవంత్‌రెడ్డి భాషతో ప్రజలు ఇప్పటికే అసహ్యించుకుంటు న్నారని పేర్కొన్నారు. గతంలో కూడా కాళేశ్వరం రిపోర్టుపై చర్చకు అసెంబ్లీకి రండని సవాలు చేసి, స్పెషల్ ఫ్లైట్ వేసుకుని కేరళకు పరారైన చరిత్ర మీదన్నారు. ఒట్లు వేసి ఓట్లు వేయించుకోవడం తర్వాత పలాయనం చిత్తగించడం..ఇదే మీకు తెలిసిన రాజకీయ విద్య అన్నారు. ఫార్ములా-ఈ రేస్‌ను కేటీఆర్ రాష్ట్రానికి తీసుకొస్తే దుబారా అంటారు.
పుట్‌బాల్ ఆటగాడు మెస్సీతో ఈవెంట్ పెట్టి సింగరేణి నిధులు ఖర్చు చేస్తే దుబారా కాదా? ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను ప్రశ్నిస్తున్న హరీశ్‌రావు, కేటీఆర్‌లపై కూడా బజారు భాష వినియోగించడం రేవంత్‌రెడ్డి దిగజారుడుకు నిదర్శనమన్నారు. రెండేళ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక ప్రధాన అభివృద్ధి పని చేపట్టలేదని ఆరోపించారు. ఆరు గ్యారెంటీలు, జాబ్ క్యాలెండర్, మహిళలకు రూ. 2500, బీసీలకు 42% రిజర్వేషన్ వంటి హామీలు అమలు కాలేదని పేరొన్నారు. రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని, గురుకులాల్లో ఘటనలు పెరిగాయని అన్నారు. కేసీఆర్ అమలు చేసిన అనేక పథకాలను అమలు చేయడం లేదని అన్నారు. ఈ రెండేళ్లలో ప్రజలకు ఏం చేశారని రేవంత్‌రెడ్డిని మళ్లీ ప్రజలు గెలిపిస్తారని ఆయన ప్రశ్నించారు.
ప్రశ్నిస్తే కేసులు, దిగజారుడు మాటలే కాంగ్రెస్ పాలనా శైలని ఆరోపించారు. ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా వ్యవహరించి హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగతమైన విమర్శలు చేయకుండా నాయకులు ఉన్నతంగా వ్యవహరించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, ఎనుమాముల మారెట్ కమిటీ మాజీ చైర్మన్ చింతల సదానందం, కార్పొరేటర్ చెన్నం మధు, మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, నాయకులు పులి రజినీకాంత్, శోభన్, నయీముద్దీన్, రామ్మూర్తి, బుద్దె వెంకన్న, వినీల్ రావు, మూటిక రాజు యాదవ్, గండ్ర కోట రాకేశ్‌యాదవ్, చాగంటి రమేశ్, సంపతి రఘు, దేవమ్మ, జేకే, మునుకుంట్ల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.