భీమదేవరపల్లి, జూన్ 24: సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టాలని ముల్కనూర్ ఎస్ఐ నండ్రు సాయిబాబు పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల వ్యతిరేక వారోత్సవాలను పురస్కరించుకొని మంగళ వారం హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని గట్ల నర్సింగాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డ్రగ్స్‌కు వ్యతిరేకంగా రూపొందించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దని సూచించారు.
గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల బారిన పడటం వల్ల యువత తమ ఉజ్వల భవిష్యత్తును నాశనం చచేసుకుంటుందని ఆవేదన చెందారు. ఒకప్పుడు ముఖ్య పట్టణాల్లో మాత్రమే ఈ సంస్కృతి ఉండేదని నేడు పల్లెల్లోకి గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలు విస్తరించడం దురదృష్టకరమన్నారు. యువతను కాపాడుకోవాలంటే తల్లిదండ్రులు సైతం వారిపై నిఘా పెట్టడం అవసరమని భావించారు. గంజాయి, డ్రగ్స్ రహిత మండలంగా భీమదేవరపల్లి ని తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం భాగ్యలక్ష్మి, ఉపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, విద్యార్థులు పాల్గొన్నారు.