హనుమకొండ చౌరస్తా, మార్చి 31: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల జోలికొస్తే ఊరుకునేది లేదని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద శ్రీకాంత్ హెచ్చరించారు. కాకతీయ యూనివర్సిటీలో సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మొదటి గేటు ఎదుట ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనానికి యత్నించగా కేయూ పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎస్ఎఫ్ఐ నాయకులకు, పోలీసుల వాగ్వాదంతో కేయూలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.
అనంతరం సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంద శ్రీకాంత్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను 400 ఎకరాలను వేలం వేసి ఇతర ప్రైవేట్ కార్పొరేటు కంపెనీలకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారని, విద్యార్థులు మా భూములు మాకు కావాలనీ శాంతియుతంగా ధర్నాలు చేస్తుంటే రేవంత్‌రెడ్డి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపైన అక్రమంగా లాఠీచార్జి చేపిస్తూ వారిని అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో నడిచేది ప్రజాపాలన లేక ప్రైవేట్ కార్పొరేట్ పాలన అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ర్టంలో ఇబ్బందులు పడుతున్న ప్రజల రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన మానుకొని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు క్షమాపణలు చెప్పి ఆ భూముల జోలికి వెళ్లకుండా ఉండాలన్నారు. లేదంటే రాష్ర్టవ్యాప్తంగా ఉన్న అన్ని యూనివర్సిటీల్లో జిల్లా కేంద్రాలలో పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు కన్నారావు, రాహుల్, అఖిల్, శీను, రాజ్‌కుమార్, కళ్యాణ్‌రామ్ పాల్గొన్నారు.