అగ్గితో బుగ్గి! పంట వ్యర్థాలకు నిప్పంటిస్తున్న రైతులు
వానకాలం సమీపిస్తుండడంతో రైతులు తమ భూముల్లోని పంట వ్యర్థాలకు నిప్పు పెడుతున్నారు. దీంతో మంటలు వేగంగా సమీప పొలాల్లోకి వ్యాపించి వ్యవసాయ సామగ్రి, పంటలు నష్టపోతున్నారు. మంటలు, పొగతో చోటుచేసుకుంటున్న ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించకపోవడంతోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
- సూక్ష్మజీవులు నశించి దెబ్బతింటున్న భూసారం
- వ్యవసాయ సామగ్రి, పంటలకు తీవ్ర నష్టం
- పర్యావరణ సమతుల్యానికి వాటిల్లుతున్న ముప్పు
- ప్రమాదాలు సంభవించి పోతున్న ప్రాణాలు
- ఉమ్మడి జిల్లాలో తరచూ చోటుచేసుకుంటున్న ఘటనలు
- అన్నదాతలు అవగాహన పెంచుకోవాలంటున్న అధికారులు
మహబూబాబాద్ (నమస్తే తెలంగాణ) మే 28 : వానకాలం సమీపిస్తుండడంతో రైతులు తమ భూముల్లోని పంట వ్యర్థాలకు నిప్పు పెడుతున్నారు. దీంతో మంటలు వేగంగా సమీప పొలాల్లోకి వ్యాపించి వ్యవసాయ సామగ్రి, పంటలు నష్టపోతున్నారు. మంటలు, పొగతో చోటుచేసుకుంటున్న ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించకపోవడంతోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో యాసంగిలో రైతులు వరి, మక్కజొన్నను అత్యధికంగా సాగుచేశారు. పండించిన పంటను విక్రయించిన రైతులు మళ్లీ వానకాలం పంట వేసేందుకు సిద్ధమవుతున్నారు.
అందులో భాగంగా పొలాల్లో ఉన్న వరి కొయ్యలు, మక్కజొన్న చొప్ప వంటి వ్యర్ధాలకు నిప్పంటిస్తున్నారు. గత రెండు నెలల వ్యవధిలో ఇలా నిప్పు పెట్టడం వల్ల ఉమ్మడి జిల్లాలోని పలు చోట్ల ప్రమాదాలు చోటు చేసుకొన్నాయి. సమీప పొలాల్లో ఉన్న వరి, మక్కజొన్నతో పాటు జామాయిల్, పామాయిల్, మామిడి తదితర పంటలు వందల ఎకరాల్లో దగ్ధమయ్యాయి. విద్యుత్ మోటర్లు, స్టార్టర్లు, పైపులు, ట్రాన్స్ఫార్మర్లు వంటివి కాలి బూడిదై తీవ్ర నష్టం వాటిల్లింది. ఇటీవల జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో మంటల్లో చిక్కుకొని ఓ రైతు మృతి చెందగా, పొగతో ఊపిరాడక అతడి భార్య సైతం మరణించింది. అలాగే ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో పొగ కారణంగా చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో తల్లీ కూతుర్లు మృతిచెందగా, మరొకరు గాయాలతో చికిత్స పొందుతున్నాడు.
అయితే యంత్రాలతో వరిని మధ్య వరకే కోస్తుండడంతో మిగిలిన కొయ్యలకు రైతులు నిప్పంటిస్తున్నారు. ప్రమాదాలు జరిగిన వెంటనే అక్కడే ఉన్న రైతులకు తోడు విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లి మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. అయినప్పటికీ ఎండ తీవ్రత అధికంగా ఉండడం, బలమైన గాలులు వీస్తుండడంతో మంటలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఫైరింజన్ అక్కడకు వచ్చే లోగానే భారీ స్థాయిలో నష్టం జరుగుతున్నది.
భూసారానికి ముప్పు..
కొంతమంది రైతులు అవగాహన లేక వ్యర్థాలకు నిప్పు పెడుతున్నారని, ఈ పొరపాటు వల్ల మట్టిలోని తేమ మొత్తం ఆవిరవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. భూమికి అవసరమైన సేంద్రియ కర్బనము, నత్రజని, భాస్వరం, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు మంటల్లో కాలిపోతాయని, మంటల వేడికి పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు, వానపాములు మరణిస్తాయని అంటున్నారు. పర్యావరణానికి మేలు చేసే పాములు, ముంగిసలు, ఉడుములు వంటి జీవరాశులు సైతం కాలి బూడిదవుతాయని, దీంతో నేల గట్టిపడి తదుపరి పంట వేయడానికి భూమిని దున్నడం కష్టమవుతుందని చెబుతున్నారు. పొగ, బూడిదతో వాయు కాలుష్యం పెరుగుతుందని, చిన్న పిల్లలు, వృద్ధులకు ఊపిరితిత్తులు, అస్తమా వంటి అనారోగ్య సమస్యలు సంభవిస్తాయంటున్నారు.
అందువల్ల రైతులు వరి, మక కొయ్యలను కాల్చకుండా యంత్రాలతో చిన్నచిన్న ముకలుగా చేసి, నీరు పెట్టి ట్రాక్టర్ రోటవేటర్ లేదా కేజీవీల్స్తో కలియదున్నాలని సూచిస్తున్నారు. దీనికి ఎకరాకు 50 కేజీల సింగిల్ సూపర్ ఫాస్పేట్ లేదా వేస్ట్ డీకంపోజర్ను వాడితే రెండు, మూడు వారాల్లో కొయ్యలు కుళ్లిపోయి ఎకరానికి దాదాపు టన్ను వరకు అత్యంత విలువైన సేంద్రియ ఎరువు తయారవుతుందని, దీనివల్ల తదుపరి పంట దిగుబడి 5 నుంచి 10 శాతం వరకు పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
జామాయిల్ తోట కాలిపోయింది..
సమీప పొలంలోని రైతు మకజొన్న వ్యర్థాలకు నిప్పంటించడంతో నాకున్న జామాయిల్ తోటకు మంటలు వ్యాపించి రూ. 3 లక్షల నష్టం వాటిల్లింది. రెండున్నరేండ్లుగా ఐదెకరాల్లో జామాయిల్ తోటను సాగు చేస్తున్నా. పంట చేతికొచ్చే సమయంలో కాలిపోవడం బాధగా ఉంది. ఇలా పంటలు, వ్యవసాయ సామగ్రి కాలిపోయి చాలా మంది రైతులు నష్టపోయారు. అవగాహన లోపంతోనే కొందరు రైతులు వ్యర్థాలకు నిప్పు పెడుతున్నారు.
– చల్లగుండ్ల వెంటనారాయణ, రైతు, బయ్యారం
వ్యర్ధాలను కాల్చితే అనర్ధమే …
పంట వ్యర్ధాలను కాల్చడం వల్ల భూసారం దెబ్బతిని చౌడు భూములుగా మారతాయి. పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు నశించి దిగుబడి క్రమంగా తగ్గి పోతుంది. వరి, మక్కజొన్న సాగు అనతరం మిగిలిన వ్యర్ధాలను కలియదున్ని సేంద్రియ ఎరువును తయారు చేసుకోవాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ్యర్ధాలను కాల్చితే రూ. 5 నుంచి రూ. 25 వేల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. కాల్చడం వలల జరిగే అనర్థాలపై రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
– సరిత, వ్యవసాయ శాఖ అధికారి, మహబుబాబాద్ జిల్లా
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

