కొడకండ్ల, నవంబర్ 14 : ‘రైతుబంధు బంద్ అయింది.. రుణమాఫీ ఎగ్గొట్టిన్రు.. బోనస్ ఎప్పుడిస్తరో తెల్వదు. అసలు వడ్లే సక్కగ కొంటలేరు.. సర్కారే కొనకుంటే ఇగ మేం ఏం జేయాలె.. దిక్కులేక ప్రైవేట్ల అమ్ముకున్నం. కాంగ్రెసోళ్ల మాయమాటలకు ఆశపడ్డం. నమ్మి మోసపోయినం.. ఇప్పుడు గోసపడుతున్నం’ అంటూ పలువురు రైతులు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుతో తమ గోడు వెల్లబోసుకున్నారు. గురువారం బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి వెళ్తున్న ఎర్రబెల్లిని మార్గమధ్యలో కలిసి వారు మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తాము పండించిన పంటకు బోనస్ ఇవ్వకపోగా, కనీసం మద్దతు ధర కూడా ఇవ్వడం ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి నెల రోజులైనా ధాన్యం కొంటలేరని, బోనస్ కోసం చూస్తే ఉన్న వడ్లు పోయేలా ఉందని చెప్పుకొన్నారు. ఈ సర్కారు బోనస్ ఇస్తదన్న నమ్మకం లేదని, అందుకే ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకుంటున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో తడిసిన గింజలను కూడా కొనుగోలు చేసి టైముకు డబ్బులు ఇచ్చేదని, మొదట్లనే రైతుబంధు వేస్తే మా జేబులల్ల పైసలు ఉండేవని, కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్మితే పది రోజుల్లో డబ్బులు పడేటియని గుర్తుచేశారు.
అప్పటి రోజులే మంచిగుండేదని, తాము ఇంకా ఏదో ఆశకు పోయి ఇప్పుడు గోస పడుతున్నామని బాధపడ్డారు. గతంలో ఈ సమయానికి మండలంలోని ప్రతి కొనుగోలు కేంద్రం నుంచి 50 లారీలకు పైగా వడ్లు మిల్లులకు పోయేవని, ఇప్పుడు ప్రైవేట్‌కు పోతున్నాయని అనుముల అంజయ్య, పెరుమాండ్ల పరశురాములు, నలమాస మల్లయ్యలు తదితర రైతులు ఎర్రబెల్లికి తెలిపారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోమని, ప్రతి గింజా కొనేవరకు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తామని, వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. మద్దతు ధరతో పాటు, బోనస్ ఇవ్వాలని, పూర్తిగా రుణమాఫీ చేయాలని, ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుని నష్టపోయిన రైతులకు కూడా బోనస్ చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నాకున్న సొంత పొలంతో మరికొంత కౌలుకు తీసుకుని మొత్తం 8 ఎకరాల్లో వరి పండించిన. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేస్తదనుకున్నం కానీ, కొనకపాయే. వడ్లు ఆరబోసి ఇరవై రోజులైనా మాయిశ్చర్ వస్తలేదు, సరిగా ఎండలేదు అని చెప్తే 100 బస్తాలకు పైగా ప్రైవేట్ల అమ్ముకొచ్చినం. ఇంకా 150 బస్తాలకు పైగా ఇయ్యాల ప్రైవేట్‌కు పోతున్నం. బోనస్ వస్తది అంటే సన్న వడ్లు కూడా ఏసినం. అవికూడా ఇప్పుడు ప్రైవేట్‌కు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. మద్దతు ధర దక్కక, బోనస్ లేక ఇబ్బంది పడుతున్నం. రైతుబంధు లేదు.. ఏం లేదు.. అంతా ఉట్టిదే.
– అనుముల అంజయ్య, రైతు, మొండ్రాయి