అన్ని వర్గాలకు సంక్షేమ పాలన అందిస్తున్న బీఆర్ఎస్కే ప్రజల మద్దతు ఉన్నదని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. సోమవారం ఎమ్మెల్యే అరూరి రమేశ్, డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్‌రావుతో కలిసి మంత్రి వర్ధన్నపేట పట్టణంలో రూ.104 కోట్లతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవంతో పాటు శంకుస్థాపనలు చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీ, దళిత బంధు నిరంతర ప్రక్రియ అని, అధికారదాహంతో అమలుకు సాధ్యం కాని హామీలు గుప్పిస్తున్న కాంగ్రెస్‌ను నమ్మి ప్రజలు గోసపడొద్దని కోరారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో విపక్షాల్లో ప్రకంపనలు సృష్టించడం ఖాయమని చెప్పారు. ఎమ్మెల్యే అరూరి రమేశ్ మాట్లాడుతూ.. రూ.239.81 కోట్లతో వర్ధన్నపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని, ప్రజల సంక్షేమం కోసం పని చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలన్నారు.
– వర్ధన్నపేట, అక్టోబర్ 9
వర్ధన్నపేట, అక్టోబర్ 9 : నిరంతరం ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న బీఆర్ఎస్ పార్టీకే ప్రజల మద్దతు ఉంటుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వర్ధన్నపేట పట్టణంలో సోమవారం ఎమ్మెల్యే అరూరి రమేశ్ ఆధ్వర్యంలో రూ.104 కోట్లకు సంబంధించిన అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపనలు జరిగాయి. పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో ఏర్పాటు చేసిన నూతన అంబేద్కర్ విగ్రహం, కూడలి ప్రారంభోత్సవాలకు మంత్రి దయాకర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. అనంతరం పట్టణంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు అమలుకు సాధ్యం కాని హామీలతో మేనిఫెస్టోను విడుదల చేసిందన్నారు. 60 ఏళ్లు అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణకు కాంగ్రెస్ చేసిందేమీ లేదన్నారు. కాంగ్రెస్ మరోసారి మోసం చేసేందుకు వస్తున్నదన్నారు. దీన్ని ప్రజలంతా గమనించాలని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. త్వరలో ప్రకటించనున్న బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రతిపక్షాలలో ప్రకంపనలు సృష్టించడం ఖాయమన్నారు. వచ్చే రోజుల్లో సంక్షేమంపై దృష్టి సారించి, పేదలకు చేయూతనిచ్చేలా బీఆర్ఎస్ పార్టీ మెనిఫెస్టో ఉంటుందన్నారు.
బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన పదేళ్లలోనే వర్ధన్నపేట ఎంతో అభివృద్ధి సాధించిందని మంత్రి దయాకర్‌రావు అన్నారు. గత ప్రభుత్వాలు సరైన నిధులు కేటాయించక పోవడంతో వర్ధన్నపేటలో అనేక సమస్యలు నెలకొన్నాయన్నారు. తాను కూడా గతంలో 15 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసినప్పటికీ కొంత మేరకు మాత్రమే అభివృద్ధి చేసినట్లు తెలిపారు. కానీ, తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో ఎమ్మెల్యేగా పోటీ చేసిన అరూరి రమేశ్ వర్ధన్నపేట ప్రజల ఆశీస్సులతో భారీ మెజార్టీతో విజయం సాధించారన్నారు. కేవలం పదేళ్లలో అరూరి రమేశ్ ఎంత అభివృద్ధి చేశాడో ప్రజలు గమనించాలని అన్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ సేవలందిస్తున్న అరూరి రమేశ్‌ను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో గ్రామ పంచాయతీగా ఉన్న వర్ధన్నపేటను మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేసుకొని, కేవలం నాలుగేళ్లలోనే రూ.239.81 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేసినట్లు బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. పట్టణంలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం తొమ్మిదేళ్లుగా నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. సాగునీటితోపాటు మిషన్ భగీరథ ద్వారా మంచి నీరు అందించినట్లు తెలిపారు. అలాగే, పట్టణంలో మెరుగైన డ్రైనేజీని నిర్మించినట్లు తెలిపారు.
దీనికి తోడు రూ.8.66 కోట్లతో రహదారిని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. అలాగే, సీహెచ్‌సీని 100 పడకల దవాఖానగా మార్చినట్లు తెలిపారు. రూ.2.75 కోట్లతో మున్సిపాలిటీ కార్యాలయ భవనం, రూ.2 కోట్లతో ఆదునిక దోభీఘాట్, రూ.2కోట్లతో వైకుంఠధామం, అన్ని కులాలకు సంబంధించి కమ్యునిటీ భవనాలను మంజూరు చేసినట్లు వివరించారు. పట్టణంలో అంతర్గత సీసీరోడ్లను పూర్తిస్థాయిలో నిర్మించినట్లు చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే రమేశ్ కోరారు. అలాగే క్యాంపు కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన బీసీ బంధు, కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు ఎమ్మెల్యే చెక్కులను అందజేశారు.
ఎన్నికల సమయంలో విపక్ష పార్టీలు గ్రామాలకు వచ్చి అర్ధంలేని ఆరోపణలు చేస్తే కార్యకర్తలు వారిని నిలదీయాలని వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పాలనలో రైతులకు సాగునీరు లేకపోవడంతో పంటలు ఎండిపోయి తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత 24 గంటల కరెంటుతో రైతులకు పుష్కలంగా సాగునీరు అందుతోందన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ లలితాయాదవ్, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, మున్సిపల్ చైర్పర్సన్ ఆంగోత్ అరుణ, వైస్ చైర్మన్ ఎలేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ స్వామిరాయుడు, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్‌ఖన్నా, కౌన్సిలర్లు, అంబేద్కర్ సంఘాల బాధ్యులు పాల్గొన్నారు.