వరంగల్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ) : సీజనల్ వ్యాధులతో ఏజెన్సీ పల్లెలు మంచం పట్టిన వేళ.. ఆ ఆరోగ్య కేంద్రానికి ఆయా భర్తే దిక్కయ్యాడు. ఉదయం 8 గంటలకే ఆస్పత్రి డోర్లు తెరిచి కాపలాగా కూర్చున్నాడు. కానీ, అందులో పనిచేసే వైద్యుడు సహా ఇతర సిబ్బంది ఎవరూ విధులకు రాకపోవడంతో చికిత్స కోసం వచ్చిన ప్రజలు చాలా సేపు నిరీక్షించి.. సూది, మందు దొరకక ఇంటిబాట పట్టారు. ఇది వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం మేడపల్లి 24 గంటల ఆస్పత్రి దుస్థితి.
సోమవారం ‘నమస్తే తెలంగాణ’ క్షేత్రస్థాయి పరిశీలనలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ) 14, అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (యూపీహెచ్సీ) ఏడు ఉన్నాయి. ఈ పీహెచ్‌సీల్లో సంగెం, రాయపర్తి, దుగ్గొండి, మేడపల్లి 24/7 పనిచేయాల్సినవి. ఏజెన్సీలో ఉండే మేడపల్లి పీహెచ్సీ పరిధిలో నల్లబెల్లి మండలంలోని మేడపల్లి, రాంపూర్, నారక్కపేట, రుద్రగూడెం సబ్ సెంటర్లున్నాయి.
కొద్దిరోజుల నుంచి వర్షాలు పడుతుండటంతో ఏజెన్సీ గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించి ప్రజలు డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా, టైఫాయిడ్, వైరల్ జ్వరం, అతిసారం తదితర వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో మేడపల్లి పీహెచ్‌సీకి బాధితులు వెళ్లగా వైద్యులు, సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో వారు ఇబ్బందులు పడ్డారు. ప్రభు త్వం మేడపల్లి ఆస్పత్రిలో ఒక మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్సు, సీనియర్ అసిస్టెంట్, ఇద్దరు ఎంపీహెచ్‌ఎస్‌లు, ఓ ఫార్మాసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్, దోబీ, ఆయా (నైట్ వాచ్మెన్)ను నియమించింది. వీరికి తోడుగా విధులు నిర్వర్తిస్తారని ఆయుష్ నుంచి మరో ముగ్గురు ఉద్యోగులను కేటాయించగా వారెవరూ విధులకు హాజరు కాలేదు.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం మేడపల్లిలో 24 గంటలు ప్రజలకు వైద్య సేవలందించాల్సి ఉంది. ఒక వైద్యుడితో పాటు ఓ నర్సింగ్ ఆఫీసర్ ఎప్పుడూ అందుబాటులో ఉండాలి. అయి తే ఈ పీహెచ్‌సీని సోమవారం ఉదయం ఇందులో పనిచేసే ఆయా (నైట్ వాచ్‌వుమెన్) తార భర్త ఈర్య 7 గంటలకు తెరిచి బయట కాపలాగా కూర్చున్నాడు. హాస్పిటల్‌కు ఆయనే పెద్ద దిక్కుగా మారారు. వైద్యుడు, సిబ్బంది మధ్యాహ్నం 12 గంట ల వరకు డ్యూటీకి హాజరు కాలేదు. ఉదయం 8 గంటల నుంచే వైద్యం కోసం వచ్చిన ప్రజలు డాక్టర్ల కోసం వేచి చూసి ఇంటికి వెళ్లిపోయారు. ‘నమస్తే తెలంగాణ’ ఫీల్డ్ విజిట్ సమాచారం తెలియగానే ఆయుష్ విభాగం నుంచి విధులు నిర్వర్తిస్తున్న ముగ్గురు ఉద్యోగుల్లో ఒకరైన ఫార్మసిస్టు ప్రవీణ్ 11 గంటలకు ఆస్పత్రికి చేరుకున్నారు. తన భార్యకు జ్వరం రావడంతో తాను ఆస్పత్రిని తెరిచినట్లు ఆయా భర్త ఈర్య చెప్పారు.
మేడపల్లి పీహెచ్సీలో వైద్యుడు, సిబ్బంది ఎవరూ సరిగా అందుబాటులో ఉండరు. ఎప్పుడో వస్తరు. మధ్యాహ్నం 12 గంటలైందంటే హాస్పిటల్లో కనపడరు. ఉన్న సమయంలో అయినా ఆస్పత్రికి వచ్చినోళ్లను పట్టించుకుంటరా అంటే అదీ లేదు. ఫోనులో మాట్లాడుతూ ఉంటరు. మేమొకటి చెపితే వాళ్లొకటి వింటరు. మా రోగం నయమయ్యేది ఇస్తరో.. మరో గోలి ఇస్తరో తెల్వదు. రెండు మూడు రోజుల నుంచి జ్వరం వస్తుందని ఇయ్యాల హాస్పిటల్‌కు వస్తే ఎవరు రాలే. చూసి చూసి వెళ్తున్న. పై వాళ్లెవరు పట్టించుకోవట్లేదు.
– కాసు బాబు, మేడపల్లి