కాశీబుగ్గ, మే 14: వరంగల్ లోక్‌సభ పోలింగ్‌కు సంబంధించి పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్, వరంగల్‌తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, భూపాలపల్లి అసెంబ్లీ సెగ్మెంట్ల ఈవీఎంలను ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని స్ట్రాంగ్ రూంల్లో భద్రపర్చినట్లు ఎన్నికల అధికారి, వరంగల్ కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. మంగళవారం స్ట్రాంగ్‌రూంల వద్ద జనరల్ అబ్జర్వర్ బండారు స్వాగత్ రణ్వీర్ చంద్ ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఏఆర్వోలతో కలిసి స్ట్రాంగ్ రూంలకు సీల్ వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ స్ట్రాంగ్ రూముల్లో ఎన్నికల సామగ్రిని భద్రపర్చినట్లు తెలిపారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలో అతి ఎక్కువ, అతి తక్కువ పోలింగ్ జరిగిన కేంద్రాలు, ఈవీఎంలు, రిప్లేస్మెంట్ జరిగిన బూత్‌లను స్క్రూటినీ చేశామన్నారు. వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో 68.86 శాతం పోలింగ్ నమోదైందన్నారు. పోలింగ్ కేంద్రాల వారీగా నమోదైన శాతం కూడా వెల్లడిస్తామన్నారు. ప్రతి స్ట్రాంగ్ రూంకు ఒక గార్డ్ ఉంటారని, వారితో లాగ్‌బుక్ నిర్వహిస్తామని, స్ట్రాంగ్‌రూం ఆవరణలోకి ఎవరినీ అనుమతించబోమన్నారు. అభ్యర్థులు వారి తరఫున వచ్చే ఏజెంట్లకు ప్రత్యేక రూం ఏర్పాటు చేసి, స్ట్రాంగ్‌రూంల సీసీ ఫుటేజీలను బిగ్ స్క్రీన్లపై ఏర్పాటు చేసి ప్రదర్శిస్తామన్నారు. అభ్యర్థులు వారి ఏజెంట్లు 24 గంటలు ఆ ఫుటేజీలను చూడొచ్చన్నారు. పోలీసుల సమక్షంలో ఇన్నర్ పెరిమీటర్ వరకు వారి పోలీస్ ఎస్కార్ట్‌తో పరిశీలించొచ్చన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాధికాగుప్తా, ఏఆర్వోలు అశ్విని తానాజీ వాకడే, డీఎస్ వెంకన్న, రోహిత్‌సింగ్, నారాయణ, వెంకటయ్య, మంగీలాల్, సీదం దత్తు, తహసీల్దార్లు, డీటీలు పాల్గొన్నారు.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ పరిధిలోని గోదాముల్లో ఎన్నికల సామగ్రిని భద్రపరిచేందుకు స్ట్రాంగ్ రూంలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. ఆయన స్ట్రాంగ్ రూంలను పరిశీలించారు. అనంతరం మరింత భద్రత కోసం తీసుకోవాల్సిన చర్యలపై సీపీ అధికారులతో సమీక్షించారు. మూడంచెల భద్రతతోపాటు ఇప్పటికే 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. 24 గంటలూ సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఆయన వెంట వెస్ట్‌జోన్ డీసీపీ సీతారాం, అదనపు డీసీపీలు సురేశ్‌కుమార్, సంజీవ్, ఏసీపీలు దేవేందర్, అనంతయ్య, సీఐ పులి రమేశ్‌గౌడ్, సతీశ్, ఆర్ఐ స్వర్జన్రాజ్లు ఉన్నారు.
ఖిలావరంగల్ : వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో అందరి సహకారంతోనే పోలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు ఆర్వో ప్రావీణ్య తెలిపారు. ఎన్నికలు సజావుగా జరిగేందుకు సహకరించిన జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆమె ఈ సందర్భంగా అభినందించారు. అలాగే, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రచార మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరవేసిన మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.