హనుమకొండ చౌరస్తా : విద్యార్థులలో సృజనాత్మక శక్తిని పెంపొందించడానికి సైన్స్ఫేయిర్లు ( Science Fairs ) దోహదపడతాయని ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి ( Prakash Reddy) , కేఆర్ నాగరాజు ( Nagaraju ) అన్నారు. హనుమకొండ పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించిన జిల్లాస్థాయి విద్యా, వైజ్ఞానిక ప్రదర్శన శనివారం వైభవంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ సైన్స్ద్వారా రుగ్మతలను, మూఢనమ్మకాలను పారద్రోలాలని కోరారు.
సాంకేతిక పరికరాలు అనేకం అందుబాటులోకి రావడంతో విద్యార్థుల్లో ఆలోచనశక్తి తగ్గి వాటి మీదనే ఆధారపడటం ఎక్కువైందన్నారు. ప్రకృతిని నాశనం చేస్తుండటం వల్ల అనేక రకాల అనర్ధాలు వస్తున్నాయన్నారు. ఇటీవల హనుమకొండ నగరానికి అకస్మాత్తుగా వచ్చిన వరదలే ఉదాహరణగా చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులను అభినందించారు.
జిల్లా విద్యాశాఖ అధికారి లింగాల వెంకటగిరిరాజ్ గౌడ్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతిభావంతమైన విద్యార్థులు అధిక సంఖ్యలో ఉన్నారన్నారు. చివరగా రాష్ట్రస్థాయికి ఎంపికైన ఇన్స్పైర్, జిల్లా సైన్స్ ఫెయిర్ విజేతలకు ఎమ్మెల్యేలు బహుమతి ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి శ్రీనివాసస్వామి, సీఎంవో బద్దం సుదర్శన్ రెడ్డి, డీసీఈబీ కార్యదర్శి రామ్ధన్, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ అనగోని సదానందంగౌడ్ , సెయింట్ పీటర్స్ విద్యాసంస్థల అధినేత నారాయణరెడ్డి, సెయింట్ పీటర్స్ ఎడ్యూ స్కూల్ ప్రిన్సిపల్ హరిత, ట్రస్మా అధినేత సతీష్, ఎంఈవోలు పాల్గొన్నారు.