విరిగిన బెంచీలు, నాచుపట్టిన గోడలు, కంపుకొడుతున్న బాత్రూంలు, ప్రమాదకరంగా ఉన్న పంపుహౌస్‌లు, వంట గదులు, విద్యుత్ బల్బులు, స్విచ్ బోర్డులు, కరెంట్ లేక చీకటి గదులు, గేటు లేని కాంపౌండ్ గోడలు, పిచ్చిమొక్కలు మొలిచిన ఆటస్థలాలు, కొన్నిచోట్ల నిర్మాణం పూర్తయినా పెయింట్ వేయని, ఫ్లోరింగ్ చేయని పాఠశాలలు.. ఇలా మరెన్నో సమస్యల నడుమ నేడు సర్కారు బడులు తెరుచుకోనున్నాయి. మొన్నటిదాకా వేసవి సెలవుల్లో సరదాగా గడిపి గురువారం ఉత్సాహంతో పాఠశాలల్లో అడుగుపెట్టే విద్యార్థులకు ఒక్కో చోట ఒక రకమైన సమస్యలు స్వాగతం పలుకనున్నాయి.
గత బీఆర్ఎస్ ‘మన ఊరు-మన బడి’ ద్వారా ఎన్నో పాఠశాలల రూపురేఖలు మార్చేయగా కాంగ్రెస్ ప్రభుత్వం దానిని ‘అమ్మ ఆదర్శ పాఠశాల’ను తీసుకొచ్చి ఎంపిక చేసిన చాలా పాఠశాలల్లో ఇప్పటివరకు పనులు పూర్తిచేయలేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చాలాచోట్ల ఇదే పరిస్థితి ఉండగా.. కొన్నిచోట్ల విద్యార్థులు లేరనే సాకుతో గతేడాది వందలాది పాఠశాలలను మూసేసిన రేవంత్ సర్కారు వాటిని తెరిపించే ప్రయత్నం చేయకపోవడంతో మారుమూల ప్రాంత విద్యార్థులు చదువుకు దూరం కావాల్సి వస్తోంది. అంతేగాక ఏజెన్సీ ఏరియాలో ఏజెన్సీలకు ప్రభుత్వ బిల్లులు చెల్లించకపోవడంతో ‘సీఎం బ్రేక్ ఫాస్ట్’ నిలిచిపోయి పిల్లలు అల్పాహారానికి నోచుకోవడం లేదు.
– నమస్తే నెట్వర్క్, జూన్ 11
ఏడాదిన్నర గడిచినా అక్కడే పనులు..!
హనుమకొండ చౌరస్తా, జూన్ 11 : హనుమకొండ జిల్లాలోని పలు ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధికి నోచుకోక అస్తవ్యస్తంగా మారాయి. జిల్లా విద్యాశాఖాధికారి స్పందించకపోవడంతో కొన్ని పాఠశాలల్లో అసౌకర్యాలు తిష్ట వేశాయి. నడికూడ మండలం రామక్రిష్ణాపురం, హసన్‌పర్తి మండలం మల్లారెడ్డిపల్లి, అర్వపల్లిలోని జడ్పీ ఉన్నత, ప్రాథమిక పాఠశాల్లో సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మన ఊరు-మన బడి’ స్థానంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అమ్మ ఆదర్శ పాఠశాలల కింద 416 పాఠశాలలను ఎంపిక చేసింది.
అయితే ఏడాదిన్నర గడిచినా ఇప్పటివరకు పాఠశాలల్లో పనులు ప్రారంభించ లేదు. ఇంకా పాఠశాల్లో ఎక్కడి పనులు అక్కడే అన్నట్లుగా ఉంది. ఎంపికైన పాఠశాలల్లో ఇంకా పెయింటింగ్, విద్యుత్ నీటి సరఫరా, మౌలిక సదుపాయాల పనులు చేపడుతున్నారు. డ్యుయల్ డెస్కులు, గ్రీన్ బోర్డులు సరఫరా చేయనున్నారు. జిల్లాలో ప్రాథమిక 304, ప్రాథమికోన్నత 60, ఉన్నత పాఠశాలలు 128 కలిపి మొత్తం 492 ప్రభుత్వం పాఠశాలలు ఉండగా వీటిలో 29,050 మంది విద్యార్థులు చదువుతున్నారు.
అందులో బాలురు 14642, బాలికలు 14408 మంది ఉన్నారు. ఉపాధ్యాయ పోస్టుల ఖాళీగా ఉండడంతో విద్యాప్రమాణాలు పడిపోతున్నాయి. సరిపడా పారిశుధ్య కార్మికులు లేక అస్తవ్యస్తంగా మారింది. స్కావెంజర్లను తొలగించడంతో మరుగుదొడ్లు, మూత్రశాలలు శుభ్రం చేసేవారు లేక కంపుకొడున్నాయి. అధికారులు పట్టణాల్లో పురపాలిక కార్మికులు, గ్రామాల్లో పంచాయతీ కార్మికులకు పారిశుధ్య చర్యలు మాత్రం కనిపించడం లేదు. తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, వాటికి నీటి వసతి, ప్రహరీ వంటి కనీస సౌకర్యాలు కూడా లేవు.
మౌలిక సదుపాయాలు కల్పిస్తాం : డీఈవో వాసంతి
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. పాఠశాలల ప్రారంభం రోజునే పాఠ్యపుస్తకాలు, నోటు బుక్కులు, ఏకరూప దుస్తులు అం దించేందుకు ఏర్పాట్లు చేశాం. ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నా, గతేడాది సర్దుబాటు చేశాం. అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నాం.
మూతబడినా పట్టించుకోరు?
మహబూబాబాద్ రూరల్, జూన్ 11 : ప్రభుత్వ బడుల్లో సరైన సౌకర్యాలు లేక విద్యార్థులను చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకు రావడం లేదు. దీనిని సాకుగా చెబుతూ ప్రభుత్వం మహబూబాబాద్ జిల్లాలో 2024-25 విద్యాసంవత్సరంలో 167 బడులను మూసివేసింది. అందులో తరగతి గదులు, పరిశుభ్రత, నీటి సౌకర్యం, టాయ్‌లెట్స్ లేవనే అనేక కారణాలతో వాటిని మూసివేశారు. ఎక్కువ శాతం తండాలు, కోయ గూడేల్లోని బడులే మూతపడ్డాయి.
ఫలితంగా గిరిజన ఆవాస ప్రాంతాలు ఎక్కువగా ఉండే మానుకోట జిల్లాలో విద్యార్థుల చదువుకు దూరం కావాల్సి వస్తోంది. ప్రభుత్వం పట్టించుకోకపోవడం, స్థానిక ప్రజాప్రతినిధుల పర్యవేక్షణ లేక, సౌకర్యాలు కల్పించకపోవడం వల్లే బడులు ఎక్కువ సంఖ్యలో మూతపడుతున్నాయని తండావాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులో ఆదివాసీ ప్రాంతాల్లో 140, గిరిజన తండాల్లోనే ఎక్కువ ఉన్నాయి. మహబూబాబాద్ మండలంలో 119 పాఠశాలకు గాను 19 మూతపడ్డాయి.
కేసముద్రంలో 65కి గాను 8, గూడూరులో 93కి 11, ఇనుగుర్తిలో 28కి 8, నెల్లికుదురులో 55కి గాను 4, డోర్నకల్‌లో 50కి గాను 12 పాఠశాలలు, కురవిలో 57కి గాను 6, మరిపెడలో 100కు 36, సీరోలులో 27కు 3, నర్సింహులపేటలో 46కి 6, దంతాలపల్లిలో 29కి 6, చిన్నగూడూరులో 20కి 9, తొర్రూరులో 54కి 8, పెద్దవంగరలో 32కి 4, గార్లలో 59కి 9, బయ్యారంలో 77కి 3, కొత్తగూడలో 62కి 8, గంగారంలో 36కి 7 పాఠశాలలు మూతపడ్డాయి.
ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాలి
ఒకసారి మూతపడిన బడి తెరుచుకోవాలంటే ఎన్నో ఇబ్బందులుంటాయి. తండాలో ఉన్న పేరేంట్, టీచర్లు ప్రభుత్వ పాఠశాలలకు రక్షణ కవచంలా ఉండాలి. అధికారులు కేవలం పిల్లలు లేరని సాకుతో టీచర్లను మరో చోటుకు డిప్యూటేషన్ వేస్తున్నరు. ప్రధానంగా కోయగూడేలు, ఆదివాసీ ప్రాంతాల్లో పాఠశాల చుట్టూ ఫెన్సింగ్, తాగునీటి సౌకర్యం కల్పించాలి. పాఠశాల్లో వసతులపై ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకోవాలి.
– బలాష్టి రమేశ్, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
బిల్లులియ్యక నిలిచిన ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్’
ఏటూరునాగారం, జూన్ 11 : సర్కారు బడుల్లో ఎన్రోల్మెంట్ పెంచడంతో పాటు విద్యార్థులకు ఉదయం పౌష్టికాహారం అందించేందుకు గత బీఆర్ఎస్ ప్రభు త్వం ప్రారంభించిన ‘సీఎం బ్రేక్‌ఫాస్ట్’ పథకం మధ్యలోనే ఆగిపోయింది. దీంతో విద్యార్థులు నిరాశకు గురయ్యారు. ఏటూరునాగారం మండలంలో 36 వరకు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నా యి. వీటిల్లో బాలురు 1212 మంది, బాలికలు 1099 మంది సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం కింద అల్పాహారం పొం దుతున్నారు.
విద్యార్థులకు అల్పాహారం అందించిన ఏజెన్సీలకు రావాల్సిన బకాయిలను గతేడాది నవంబర్ నుంచి ప్రభుత్వం నిలిపివేశారు. గత మార్చి నుంచి అక్టోబర్ వరకు ఏజెన్సీలకు మండలంలో సుమారు రూ. 31.13 లక్షల వరకు బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. బిల్లుల జాప్యం జరగడంతో ఏజెన్సీలు లబోదిబో మంటున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ పథకాన్ని ప్రారంభించి విద్యార్థులకు అల్పాహారం అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
నాడు కళకళ.. నేడు వెలవెల
భూపాలపల్లి రూరల్, జూన్ 11 : బీఆర్ఎస్ హయాంలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని 149 ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులు చేపట్టడంతో బడులన్నీ అన్ని రకాల వసతులతో కళకళలాడాయి. జిల్లాలోని 12 మండలాల్లో మొత్తం 430 పాఠశాలలు ఉండగా అందులో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు చదువుకుంటున్న 51 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, 10 ప్రాథమికోన్నత పాఠశాలలు, 88 ప్రాథమిక పాఠశాలలను మన ఊరు- మన బడి ద్వారా గుర్తించి అదనపు తరగతి గదుల నిర్మాణం, తాగునీరు, కరెంట్ సౌకర్యం, డైనింగ్ హాల్, మరుగుదొడ్ల నిర్మాణం, వంటగది, డిజిటల్ క్లాస్ రూంలు, చిన్న, పెద్ద మరమ్మతులు, ప్రహరీ గోడ, ఫర్నిచర్, పాఠశాలలకు రంగులు వంటి 12 రకాల పనుల కోసం గత కేసీఆర్ సర్కారు మొత్తం రూ.34,18,53,578 లను కేటాయించింది.
అయితే అప్పుడు మంజూరు చేసిన నిధులతో చేట్టిన పనులతో జిల్లాలో 149 పాఠశాలలో అన్ని రకాల వసతులు కల్పించడమే గాక విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం అల్పహారం అందించి పేద విద్యార్థులకు ఆకలిని తీర్చి ఆదుకున్నది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని 265 పాఠశాలలను గుర్తించింది. కానీ ఆ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు విడుదల చేయడంలో నిర్లక్ష్యం చేయడంతో పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా దర్శనమిస్తున్నాయి. గురువారం నుంచి పాఠశాలలు ప్రారంభం కానుండగా చాలా పాఠశాలల్లోని మరుగుదొడ్లు కంపుకొడుతున్నాయి. తాగునీటి నల్లాల పైపులు దెబ్బతిని పనిచేయకుండా ఉన్నాయి. పాఠశాలల్లో గడి ్డమొలిచి ఏపుగా పెరిగి ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి జిల్లాలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రజలు, విద్యార్థులు కోరుతున్నారు.