హనుమకొండ చౌరస్తా, జూన్ 14 : బడిగంట మోగనున్నది. నేటి నుంచి స్కూళ్లు పునఃప్రారంభంకానున్నాయి. కాగా, సరిగ్గా అమావాస్య రోజే బడులు ప్రారంభించడంపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు వేసవి సెలవుల అనంతరం ఈ నెల 15 నుంచి అధికారికంగా ప్రారంభించేందుకు విద్యాశాఖాధికారులు చర్యలు చేపట్టారు. సాధారణంగా షెడ్యూల్ ప్రకారం జూన్ 12 వరకే వేసవి సెలవులుండగా రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా 14 వరకు పొడిగించింది.
అయితే, ఈ పునఃప్రారంభ తేదీ అమావాస్య రోజు రావడంతో కొందరు అశుభంగా భావిస్తున్నారు. ఈ రోజున కొత్త పనులు, చదువులు ప్రారంభించడం మంచిది కాదని తల్లిదండ్రులు భావిస్తున్నారు. తెల్లవారి పంపుదామంటే మంగళవారం అవుతుండడంతో ఈ రెండు రోజులు పిల్లలను ఇంటి వద్దే ఉంచాలని వారు ఆలోచిస్తున్నారు. దీంతో ఈ రోజుల్లో విద్యార్థుల హాజరు తగ్గే అవకాశం ఉంది. కొన్ని ప్రైవేట్ స్కూళ్లు ముందుగానే అమావాస్యను ఆలోచించి ఈ నెల 17న (బుధవారం), 19న (శుక్రవారం) ప్రారంభించేందుకు నిర్ణయించాయి.
ఉమ్మడి జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలు సమస్యలతో స్వాగతం పలకనున్నాయి. ఇన్ని రోజులు నిర్మానుష్యంగా మారిన పాఠశాలలు సోమవారం నుంచి కళకళలాడనున్నాయి. కానీ, చాలా పాఠశాలలు అస్తవ్యస్తంగా ఉన్నాయి. శిథిలావస్థకు చేరిన భవనాలు, పెచ్చులూడి ఎప్పుడు మీద పడతాయో తెలియని తరగతి గదులు, విరిగిన బెంచీలు, మురికిపట్టిన గోడలు, కంపుగొడుతున్న బాత్రూంలు, కరెంట్ లేక చీకటి గదులు, గేటులేని కాంపౌండ్ గోడలు, పిచ్చిమొక్కలు, మొలిచిన ఆటస్థలాలు, నిర్మాణం పూర్తయి పెయింట్ వేయని, ఫ్లోరింగ్ చేయని తరగతి గదులు వంటి సమస్యలు స్వాగతం పలకనున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ‘మన ఊరు-మనబడి’ కార్యక్రమాన్ని పక్కనపెట్టి అమ్మ ఆదర్శ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది.
దీనికి ఎంపికైన చాలా పాఠశాలల్లో ఇంతవరకు పనులు పూర్తి కాలేదు. కొన్ని స్కూళ్లలోని చిన్న సమస్యలను గ్రామస్తులు, పూర్వవిద్యార్థుల సహకారంతో హెడ్మాస్టర్లు, టీచర్లు పరిష్కరించుకుంటున్నారు. పండుగ వాతావరణంలో పాఠశాలలను ప్రారంభించాలని విద్యాశాఖాధికారులు ఆదేశాలు జారీ చేయడంతో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు బిజీగా ఉన్నారు. పాఠశాలలకు పుస్తకాలు చేరగా, విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ఏకరూప దుస్తులు అందించేందుకు క్లాత్ కరువైంది. ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుధ్య కార్మికులు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాగునీరు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, వాటికి నీటి వసతి, ప్రహరీ వంటి కనీస సౌకర్యాలు కూడా లేవు.
గత ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యార్థులకు అల్పాహార పథకాన్ని అక్టోబర్ 2023లో ప్రారంభించారు. ప్రభు త్వ, స్థానిక సంస్థల పాఠశాలల విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడం, వారిలో అభ్యసనను మెరుగుపర్చ డం లక్ష్యంగా ఈ పథకాన్ని రూపొందించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్‌ను నిలిపివేసింది. మళ్లీ రెండున్నరేళ్ల తర్వాత పాఠశాలల పునఃప్రారంభాన్ని పురసరించుకొని అమావాస్య రోజున విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వ ఆదేశాలతో విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఉమ్మడి జిల్లాలో మొదటి విడత ఎంపిక చేసిన కొన్ని పాఠశాలల్లో అల్పాహారంతో పాటు పాలు, వారంలో మూడు రోజులు రాగిజావ అందించనున్నారు.