హనుమకొండ చౌరస్తా, జూన్ 15 : వేసవి సెలవుల అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సోమవారం పాఠశాలలు పునఃప్రారంభం కాగా.. పాత సమస్యలే విద్యార్థులకు స్వాగతం పలికాయి. అమావాస్య కావడంతో తొలిరోజు తల్లిదండ్రులు తమ పిల్లలను బడికి పంపకపోవడంతో హాజరు శాతం తగ్గింది. అయితే పండుగ వాతావరణంలో పాఠశాలలు ప్రారంభించాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలతో ఉదయం నుంచే విద్యార్థులు, టీచర్లు మామిడి తోరణాలు కట్టేందుకు చెమటోడ్చారు. స్కూళ్లను శుభ్రం చేస్తూ, చెత్తాచెదారాన్ని తొలిగించారు.
కొన్ని పాఠశాలల్లో విద్యార్థులకు స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ, తరగతి గదులు పూర్తిస్థాయిలో నిండలేదు. ‘మన ఊరు-మన బడి’ కింద ఎంపికైన పాఠశాలలు మినహా మిగిలిన బడుల్లో అమ్మ ఆదర్శ పాఠశాలల పథకం కింద అభివృద్ధి పనులను చేపట్టారు. బిల్లులురాని కారణంతో కొన్ని పాఠశాలల్లో పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. అలాగే పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ అక్కడక్కడా కాంట్రాక్టర్లు పాఠశాలలకు తాళం వేశారు. పలు ప్రభుత్వ ఉన్నత పాఠశాల్లో మరుగుదొడ్లు, మూత్రశాలలు నిర్వహణ సరిగా లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పలేదు. పలు చోట్ల బాత్రూంలకు పైకప్పు, డోర్లు లేవు.

మొదటిరోజు ఉపాధ్యాయుల సంఖ్య ఎక్కువగా ఉండగా, విద్యార్థులు తక్కవ సంఖ్యలో హాజరయ్యారు. హనుమకొండ లష్కర్‌బజార్ ప్రభుత్వ బాలికల ప్రైమరీ స్కూల్లో నలుగురు విద్యార్థులకు ఐదుగురు టీచర్లు దర్శనమిచ్చారు. చాలా పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ కొత్తగా చేరిన విద్యార్థుల సంఖ్య శూన్యంగా ఉంది. కొన్ని పాఠశాలల్లో జీరో అటెండెన్స్ నమోదైంది.
ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థుల సంఖ్య ఏటా తగ్గుతూ వస్తున్నది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాలని అధికారులు కుస్తీలు పడుతున్నా ఫలితం ఉండడం లేదు. ప్రభుత్వ స్కూళ్లపై తల్లిదండ్రులు నమ్మకం కోల్పోవడంతో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. హనుమకొండ జిల్లాలో 20 లోపు విద్యార్థులున్న పాఠశాలలు 200కు పైగా ఉన్నాయి. సోమవారం హాజరైన విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు అందించగా, ఇప్పటి వరకు పాఠశాలలకు క్లాత్ రాకపోవడంతో యూనిఫామ్స్ పంపిణీ చేయలేదు.
కొన్ని స్కూళ్లలో పాత యూనిఫామ్స్, కలర్ డ్రెస్‌లోనే విద్యార్థులు దర్శనమిచ్చారు. కాగా, విద్యార్థులకు బోధించేందుకు సరిపడా ఉపాధ్యాయులు కరువయ్యారు. హనుమకొండ జిల్లాలోని 492 పాఠశాలల్లో 32,890 మంది విద్యార్థులున్నారు. జిల్లావ్యాప్తంగా 2,708 ఉపాధ్యాయ పోస్టులు మంజూరు కాగా 2,438 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంకా 270 మంది ఉపాధ్యాయుల కొరత ఉంది. అయితే తరగతికి ఒకరుండాలనే డిమాండ్‌ను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు.