Tekmal | టేక్మాల్: కల్యాణ లక్ష్మి (Kalyanalakshmi), షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని, వాటిని కొనసాగించాలని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు భక్తుల వీరప్ప డిమాండ్ చేశారు. పథకాల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం టేక్మాల్‌లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. టేక్మాల్‌లోని జయశంకర్ సార్ చౌరస్తా వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా టేక్మాల్ తహసీల్దార్ కార్యాలయం వరకు వెళ్లారు. తహసీల్దార్ తులసీరాంకు వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా వీరప్ప మాట్లాడుతూ.. పేదింట్లో పెళ్లి (Marriage) భారం తగ్గించేందుకు కేసీఆర్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి పథకాన్ని ప్రారంభించిందని గుర్తు చేశారు. అధికారంలోకి వస్తే రూ.1,00,116తో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ ఇప్పుడు తులం బంగారం ఇవ్వకుండా మోసం చేసింది అని మండిపడ్డారు. కల్యాణ లక్ష్మిపై హైకోర్టులో వేసిన కేసు విషయంలో ప్రభుత్వం కనీసం కౌంటర్ కూడా దాఖలు చేయలేదని, పథకాన్ని ఎత్తివేయడానికే ఈ జాప్యం అని ఆయన అన్నారు.
రైతు కుటుంబాలకు అండగా ఉండేందుకు కేసీఆర్ రైతు బీమా (Rytubima) పథకాన్ని తీసుకొచ్చారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం ప్రీమియం చెల్లించకపోవడంతో ఆ పథకం నిలిచిపోయిందని విమర్శించారు. అదేవిధంగా రైతులకు సరిపడా యూరియా అందించలేక, యాప్ పేరుతో కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. పేదల సంక్షేమ పథకాలను కొనసాగించాలని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో పీఏసీఎస్ ఛైర్మన్ యశ్వంత్ రెడ్డి, మాజీ ఎంపీపీ చింత స్వప్న, మాజీ సర్పంచులు భక్తుల వరలక్ష్మి, నాయికోటి సుప్రజ, శ్రీనివాస్, సంగయ్య, నాయకులు సలీం, సిద్దయ్య, భాస్కర్, రమేశ్ నాయక్, రవి, మోహన్, గోవిందచారి, కిషన్, సలావొద్దీన్, డా.సాయి, మల్లేశం, రాజు, లింగం, జయవర్ధన్ పాల్గొన్నారు.