– తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంటయ్య
రాజాపేట, ఆగస్టు 18 : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం మౌనం వీడి, పెండింగ్లో ఉన్న ఆరు డీఏలను వెంటనే చెల్లించాలని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెల్కలపల్లి పెంటయ్య డిమాండ్ చేశారు. మంగళవారం రాజాపేట మండలంలోని వివిధ పాఠశాలల్లో తపస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగుల జీతాల నుంచి 1.5 శాతం ఈహెచ్సీటీ కోతకు ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుందని, కానీ ఉద్యోగులకు రావాల్సిన ఆరు డీఏలు పెండింగ్లో ఉంచడం సరికాదన్నారు. పీఆర్సీపై స్పష్టమైన ప్రకటన చేయాలని, ఆరోగ్య కార్డుల సమస్యను పరిష్కరించాలని కోరారు. ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు రేపాక ఉమా, మండల అధ్యక్షుడు దుడుకు జానయ్య, ప్రధాన కార్యదర్శి పున్న సత్యానంద్, జిల్లా నాయకులు పలుగుల రాజు, శ్రీహరి, నాందేవ్ పాల్గొన్నారు.