కాంగ్రెస్ ప్రభుత్వం అట్టహాసంగా ప్రారంభించిన పథకాలు అభాసుపాలవుతున్నాయి. గ్రామసభల్లో అర్హులైన లబ్ధిదారులు ప్రొసీడింగ్స్ పంపిణీలో మిస్సయ్యారు. వారి స్థానంలో కొత్తవారు దర్శనమిచ్చారు. దీంతో పైలట్ గ్రామాల పరిధిలోని జాబితాలో పేరొచ్చిన వారికి పథకాలు అందలేదు. సోమవారం టకీ టకీమని రైతు భరోసా డబ్బులు పడతాయన్న సీఎం రేవంత్‌రెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేల మాటలు నీటిమూటలయ్యాయి. పంటలు సాగు చేస్తున్న చాలా మంది రైతుల ఖాతాల్లో పైసలు జమకాలేదు. దీంతో అన్నదాతలు వ్యవసాయ శాఖాధికారుల వద్దకు పరుగులు తీస్తున్నారు.
అయితే తమకు ఎవరికి పడ్డాయో, ఎవరికి పడలేదో తెలియదని, జాబితా తమ వద్ద లేదని వారు సమాధానమిస్తున్నారు. అలాగే ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులకు సంబంధించి ఇదే పరిస్థితి నెలకొంది. ఇందిరమ్మ ఇండ్లు వచ్చిన వారు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే తీసుకున్నట్లు యాప్‌లో చూపిస్తుండడంతో అవాక్కవుతున్నారు. ఉపాధి హామీ పనులకు వెళ్లిన వారిని సైతం ఆత్మీయ భరోసాకు ఎంపిక చేయలేదని ఆరోపిస్తున్నారు. అన్ని అర్హతలున్నా, అనేకసార్లు దరఖాస్తు చేసుకున్నా రేషన్‌కార్డులు ఇవ్వడం లేదంటున్నారు. పంచాయతీ కార్యదర్శిని అడిగితే రెండో విడతల వస్తుందని నిర్లక్ష్యపు సమాధానం చెప్తున్నారని మండిపడుతున్నారు. అర్హులను పక్కన పెట్టి, కాంగ్రెస్ లీడర్లతో పైరవీలు చేయించుకున్న అన్నీ ఉన్నోళ్లకే పథకాలు ఇస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
– నమస్తే నెట్వర్క్, జనవరి 28
ఉన్నోళ్లకే భరోసా, ఇండ్లు ఇస్తాండ్లు
హసన్‌పర్తి : భూమి ఉన్నోళ్లకే ఇందిర మ్మ ఆత్మీయ భరోసా, ఇండ్లు ఇస్తాండ్లు. మాకు గుంట భూమి కూడా లేదు. నా భర్త చనిపోయిండు. నేను కూ లీ పనులు చేసుకుంటూ బతుకుతున్న. ఇల్లు లేక నా కూతు రు, కొడుకుతో కలిసి కిరాయికి ఉంటున్న. కాంగ్రెస్ సర్కారు వస్తే ఇల్లు వస్తదనుకున్న. లీడర్ల చుట్టూ తిరిగెటోళ్లకే ఇండ్లు, భరోసా ఇస్తున్నరు. నాకు ఇల్లు రాలేదని అధికారులను అడిగితే వచ్చే విడతలో వస్తదంటాండ్రు. నాకున్న కొంత స్థలంలో కొన్నేండ్ల కిందట బేస్మెంట్ వరకు కట్టి డబ్బులు లేక ఆపిన. ఇందిరమ్మ ఇల్లు వస్తే ఆ డబ్బులతో చిన్న ఇల్లు కట్టుకొని బతుకుదాం అనుకున్నా. ఉపాధి పనికి కూడా పోయిన. నాతోటి పని చేసెటోళ్లకు ఇల్లు, భరోసా ఇచ్చిండ్లు. నాకు ఇయ్యలేదు.
– పంజాల భాగ్యలక్ష్మి, పెంబర్తి, హసన్‌పర్తి మండలం
నాకు రైతు భరోసా పడలే..
కమలాపూర్ : నాది దేశరాజ్‌పల్లి గ్రామం. మా ఊరును పైలట్ ప్రాజెక్టు కింద తీసుకున్నరు. అందరికీ రైతు భరోసా పడుతయన్నరు కానీ, నాకు ఒక్క రూపాయి పడలే. నాకు దేశరాజ్‌పల్లి శివారులో రెండెకరాలు, కానిపర్తి శివారులో ఐదు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. నా భార్య రమ పేరు మీద 1.20 ఎకరాలుంది. నాకు రైతు భరోసా పడిందేమోనని కమలాపూర్‌లోని యూనియన్ బ్యాంకు, కేడీసీసీ బ్యాంకుకి వెళ్లి చూసుకున్న. నాకు, నా భార్యకు పైసలు పడలే. అందరికి వస్తయని సార్లు చెప్పిండ్రు కాని డబ్బులు ఖాతాలో పడకపోవడంతో నిరాశగా ఇంటికొచ్చిన.
– మరుపల్లి రమేశ్, రైతు, దేశరాజ్‌పల్లి, కమలాపూర్ మండలం
ఒక్క రూపాయి రాలే..
హసన్‌పర్తి : గతంలో కేసీఆర్ సారు రైతులకు ముందే పెట్టుబడికి డబ్బులిచ్చెటోడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకు రూ.15వేలు ఇస్తనని చెప్పి ఏడాది గడిచినా ఒక్క రూపాయి ఇయ్యలేదు. కాం గ్రెసోళ్లు ఊర్ల మీటింగ్ పెట్టి హడావిడిగా కొంత మందికి ఎకరాకు రూ. 6వేలు ఏసిండ్లు. నాకు నా లుగెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఒక్క రూపాయి కూడా ఖాతాల పడలేదు. అప్పులు తెచ్చి వ్యవసాయం చేస్తున్న. ఊర్ల అధికారులు హడావిడి చే స్తాండ్లు తప్ప ఏమీలేదు. గిట్లయితే రైతులు అప్పుల పాలైతరు. రైతులకు మేలు చేసే ప్రభుత్వం కావాలి కాని ముంచేటిది వద్దు.
-ఉట్కూరి సారయ్య, పెంబర్తి, హసన్‌పర్తి మండలం
రేషన్ కార్డు ఇయ్యలే..
కొడకండ్ల : నేను రెండేళ్ల కిందట పెళ్లి చేసుకున్న. నాకు భార్య, బాబు ఉన్నరని కొత్త రేషన్ కార్డు కోసం ప్రజా పాలనలో ధరఖాస్తు చేసిన. రెండోసారి అడిగినప్పుడు ఇచ్చిన. జనవరి 26న మళ్లా దరఖాస్తు పెట్టుకున్న. మా గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు కింద తీసుకున్నరని, కచ్చితంగా వస్తదని అన్నరు. ఈ రోజు వరకు ఎవరిని అడిగినా సమాధానం చెప్తలేరు. మంగళవారం గ్రామ కార్యదర్శి ఫోన్ చేసి రేషన్ కార్డు వచ్చిందన్నడు. కానీ జాబితాలో పేరు లేదు. నేను ఉపాధి హామీ పనులకు 100 రోజులు వెళ్లినప్పటికీ ఆత్మీయ భరోసా రాలేదు. మా నాన్నకు ఇదే తండాలో 15 గుంటల వ్యవసాయ భూమి ఉంది. ఆయనకు రైతు భరోసా రాలేదు. మా అమ్మ పేరు మీద ఇందిరమ్మ ఇల్లు మాత్రం వచ్చింది.
– గుగులోత్ సోమన్న, రైతు, నీలిబండ తండా, కొడకండ్ల మండలం
కేసీఆర్ ఉంటే మూడుసార్లు పడేటియి..
ఐనవోలు : కేసీఆర్ పదేండ్లలో పెంచుకుం టూ పోయిన దాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఒక్క ఏడాదిలో మొత్తం కిందపడేసిండు. కేసీఆర్‌ను ముసలోల్లం అందరం దేవుడని మొ క్కుతున్నం. కేసీఆర్ పెంచిన పింఛన్ ఇప్పటి దాకా తీసుకుంటున్నం. ఈయన వచ్చినంక రూ. 4 వేలు చేస్తా అన్నడు. కానీ ఇప్పటి వరకు రాలేదు. మధ్యలో ఒక నెల ఇంకా కొర్రీ పెట్టిండు. కేసీఆర్ పుణ్యమా అని గిట్లున్నం. మళ్లీ కేసీఆర్ వస్తనే తెలంగాణ మంచిగైతది. మా ఊర్లో మీటింగ్ పెట్టి రైతులకు పంట పెట్టుబడి డబ్బులు పడతయని ఏదో కాయితాలు ఇచ్చుకుంటూ ఫొటోలు దిగిండ్లు. రెండు రోజులైనా ఖాతాలో డబ్బులు జమకాలే. కేసీఆర్ సల్లగుండ.. ఆయన ప్రభుత్వమే ఉంటే రైతుబంధు పైసలు ఇప్పటికే మూడుసార్లు పడేటియి.
– రంగు ఎల్లయ్య, రైతు, రాంనగర్, ఐనవోలు మండలం