డోర్నకల్, అక్టోబర్ 12 : మోసాల పార్టీ కాంగ్రెస్ అని, ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీలకే గతిలేదు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లపై పెద్ద డ్రామాలాడుతున్నదని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ఆదివారం డోర్నకల్‌లో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అవగాహన లేని పాలన చేస్తుందన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అన్ని కులాలు, వర్గాలను మోసం చేసిందన్నారు. అన్ని పార్టీల అంగీకారంతోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు పాస్ చేస్తామని చెప్పి ఏకపక్షంగా ఢిల్లీకి వెళ్లిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే ఆయుధం బీసీ ప్రజల చేతుల్లో ఉందన్నారు. కేసీఆర్ అన్ని కులాలు, వర్గాలను గొప్పగా అదరించారని అన్నారు.
తెలంగాణ మొదటి ప్రభుత్వంలో బీసీ బిడ్డలైన మధుసూదనాచారి స్పీకర్‌గా, మండలి చైర్మన్‌గా స్వామి గౌడ్లకు పదవులు ఇచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఏ ఒక్క కులం, వర్గం సంతోషంగా లేదన్నారు. దేశంలో ఎక్కువ సార్లు కాంగ్రెస్ అధికారంలో ఉన్నదని, బీసీ రిజర్వేషన్‌పై రాహుల్‌గాంధీ ఏమి చెప్పారో తెలియదా? అని ప్రశ్నించారు. ఆ పార్టీ లంబాడీ, ఆదివాసీ బిడ్డల మధ్య చిచ్చు పెట్టిందని అన్నారు. సర్కారు ప్రకటించిన రిజర్వేషన్లలో బీసీలు లేని ఊళ్లలో వారికి రిజర్వేషన్ కల్పించినట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని అన్నారు.
గిరిజన తండాలు, గూడేలను గ్రామపంచాయతీలు చేసిన ఘనత కేసీఆర్‌దే అని అన్నారు. ఆయన అందరికీ సమన్యాయం చేశారన్నారు. రాష్ర్టాన్ని కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు దోచుకుంటున్నట్లు ఆరోపించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కమీషన్ల కోసం పనిచేస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి లెక్క త్వరలోనే తేలుతుందన్నారు. సమావేశంలో పీఏసీఎస్ చైర్మన్ చేరెడ్డి భిక్షంరెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు కళ్లెపు సతీశ్ కుమార్‌గౌడ్, మాజీ సర్పంచ్‌లు బోయినపల్లి వెంకన్న, బదావత్ బాలాజీ, నాయకులు మాన్యు ప్యాట్నీ, కందుల మధు తదితరులు పాల్గొన్నారు.