బచ్చన్నపేట ఆగస్టు 10 : గత 15 రోజుల నుంచి మోటర్లు నడవకున్నా పట్టించుకునే వారే లేరని
బచ్చన్నపేట మండల సర్పంచుల ఫోరం మండల మాజీ అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి అన్నారు. బొమ్మకూర్ రిజర్వాయర్ గోదారినీళ్లతో నిండుకుండలా మారినా తపాస్పల్లికి నీళ్లను తరలించే విద్యుత్ మోటర్లు పూర్తిస్థాయిలో పంపింగ్ చేయడంలో ఇరిగేషన్ అధికారులు, ప్రభుత్వం వైఫల్యం చెందిందని ఆరోపించారు.ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు బొమ్మకూర్ రిజర్వాయర్ ను సందర్శించారు.
థర్డ్ ఫేజ్లో రెండు మోటర్లు ఉంటే ఒక మోటర్ మాత్రమే నడుస్తుందని, రెండవ పేజ్లో రెండు మోటర్లు ఉన్నా ఆన్ చేయడం లేదన్నారు. అన్ని మోటర్లు ఆన్ చేస్తేనే తపాస్పల్లికి పంపింగ్ ఎక్కువగా నడిచి నీళ్లు కాలువల ద్వారా పలు గ్రామాలలో చెరువులు, కుంటలు నింపే అవకాశం ఉన్నా నిర్లక్ష్యం వహిస్తున్నారని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నీళ్లను అదేవిధంగా చర్యలు తీసుకున్నారని, నేడు అధికారులు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. నారు పోసి నాట్లు వేసి నీళ్లు లేక పొలాలు ఎండుతున్నాయని రైతుల కోసం ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, ఇప్పటికైనా పూర్తిస్థాయిలో మోటర్లు ఆన్ చేసి నీళ్లు పంపింగ్ చెయ్యాలని డిమాండ్ చేశారు. అయన వెంట మండల బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.