జనగామ, డిసెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : పొద్దున్నే ఇంటింటికీ టీ, టిఫిన్.. మ ధ్యాహ్నం అరకిలో చికెన్.. పోటాపోటీ నెలకొన్న గ్రామాల్లో పొట్టేలు మాంసం.. రాత్రికి క్వార్టర్ బాటిల్.. ఇదీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలి విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో నెలకొన్న పరిస్థితి. పంచాయతీ ఎన్నికల మొదటి, రెండు విడతలకు సంబంధించి ఉపసంహరణ పూర్తయి గుర్తులు కేటాయించడంతో ఆయా గ్రామాల్లో ప్రచారం జోరందుకున్నది. అభ్యర్థులు ఇంటింటి ప్రచారం చేస్తూ మద్దతు కూడగడుతున్నారు. ఈ నెల 11న గురువారం జనగామ, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, భూపాలపల్లి, ములుగు జిల్లాలో మొదటి విడత ఎన్నికలు జరిగే గ్రామాల్లో పోటీ చేస్తున్న సర్పంచ్, వార్డు అభ్యుర్థులకు ఆదివారం ఖర్చు తడిసి మోపెడైంది.
ఇప్పటి వరకు పప్పన్నంతో నెట్టుకొచ్చిన అభ్యర్థులపై సండే ఎఫెక్ట్‌తో అదనపు భారం పడింది. పోటాపోటీ నెలకొన్న కొన్ని మేజర్ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన రాజకీయ పార్టీల మద్దతుదారులైన అభ్యర్థులు ఆదివారం పొట్టేళ్లు కోసి మరీ ఇంటింటికి మాంసం పంపిణీ చేశారు. ఇంకొన్ని గ్రామాల్లో మధ్యాహ్నం చికెన్ రైస్, చికెన్ బిర్యానీ, రాత్రికి మందు దావత్‌లు ఇచ్చారు. ఆదివారం రోజంతా దావత్ల జోష్‌తో పల్లెల్లో ఎక్కడ చూసినా ఓట్ల పండుగ నెలకొన్నది. యువతకు కాటన్ల కొద్దీ బీర్లు, వృద్ధులు, పెద్ద మనుషులకు మండువాల్లో కల్లు పంపిణీ చేశారు. రోజూ చీప్ లిక్కర్ తాగేవాళ్లు కూడా పంచాయతీ ఎన్నికల సందర్భంగా బ్రాండ్ మారు స్తున్నారు.
ఉదయం 6 గంటల నుంచే అభ్యర్థుల ఇంటింటి ప్రచారం మొదలవుతున్నది. టీ తాగి ప్రచారానికి వెళ్తున్నారు. 9 గంటల వరకు తిరిగిన తర్వాత బయటి నుంచి తెప్పించిన టిఫిన్ లేదంటే పోటీ చేసే అభ్యర్థుల ఇళ్ల వద్ద ఉప్మా, పూరి, చపాతీ వంటి టిఫిన్లు వెంట తిరిగిన వారికి పెడుతున్నారు. తర్వాత ప్రచారం చేసి మళ్లీ మధ్యాహ్నం భోజనం చేయిస్తున్నారు. 3 గంటలకు ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోతున్నారు. సాయంత్రం 6 గంటలకు మళ్లీ ప్రచారం ప్రారంభించి రాత్రి 9 గంటల వరకు పూర్తిచేసి ఇంటికి వెళ్లేవారికి ఒక క్వార్టర్ సీసా ఇచ్చి పంపుతున్నారు. ఉదయం, మధ్యాహ్నం కన్నా సాయంత్రం ప్రచారానికి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వెంట తిరిగే మహిళకు రోజూ రూ.300 నుంచి రూ.400 చొప్పున కూలీ మాట్లాడుకుంటున్నారు.
పంచాయ తీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీచేసే అభ్యర్థు లు నానా తంటాలు పడుతున్నారు. ఒకరిని చూసి మరొకరు ఓటర్లను ఆకర్శించేందుకు పోటీలు పడి తాయిలాలు ప్రకటిస్తున్నారు. కొందరు సర్పంచ్ అభ్యర్ధులు తమ ను గెలిపిస్తే గ్రామంలో వినాయక, దుర్గామాత విగ్రహాలను సొంత ఖర్చుతో ఇప్పిస్తామని, ప్రతి మండపానికి ఖర్చులకు రూ. 10 వేల చొప్పున ఐదేళ్లు అందిస్తామని హామీలు గుప్పిస్తున్నారు.
స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాల సందర్భంగా నిర్వహించే ఆటల పోటీలకు ఐదేళ్ల పాటు బహుమతులు ఇస్తామంటూ అభ్యర్థులు తమ సొంత మ్యానిఫెస్టోను ప్రకటిస్తున్నారు. ఓ సర్పంచ్ అభ్యర్థి కేబుల్ టీవీ నిర్వాహకుడు కావడంతో తనను గెలిపిస్తే వచ్చే ఐదేళ్లు ఉచితంగా కనెక్షన్ ఇస్తానంటూ ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. మరికొందరు ఏకంగా బాండ్ పేపర్లు రాసిస్తున్నారు. వీటిని ఆయా గ్రామాల సోషల్ మీడియా గ్రూపుల్లో వైరల్ చేస్తున్నారు. పట్టణాల్లో ఉంటున్న పల్లె ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రానుపోను రవాణా ఖర్చుతోపాటు ఓటుకు ఇంత అని నగదు ఆశ చూపి గ్రామానికి రప్పించేందుకు ఇన్చార్జిలకు బాధ్యతలు అప్పగిస్తున్నారు.
జనగామ జిల్లా లింగాలఘనపురం మండలంలో వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్న ఓ అభ్యర్థి ఆదివారం తన పరిధిలోని ఓటర్లకు ఇంటికి అరకిలో చికెన్‌ను పంపిణీ చేశాడు. ఇక్కడ ఇద్దరు అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొనడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆదివారం ఓటర్లకు చికెన్ పంపిణీతో మచ్చిక చేసుకునే ప్రయత్నం చేశారు. 220 మంది ఓటర్లున్న వార్డులో 150 ఇళ్లకు ఇంటికి అరకిలో చొప్పున గ్రామంలోని రెండు చికెన్ సెంటర్లకు టోకెన్లు ఇచ్చి మరీ సరఫరా చేశాడు. దీంతో మిగిలిన వార్డుల్లో ఓటర్లు కూడా మాకు చికెన్ కావాలంటూ పేచీ పెట్టడం విశేషం.