మహదేవపూర్, మే 20 : కాళేశ్వరంలో గురువారం ఉదయం 5.43 గంటలకు కంచి కామకోటి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి చేతుల మీదుగా సరస్వతీ అంత్య పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆయన సతీమణి దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ పూజా కార్యక్రమంలో పాల్గొనున్నారు. పుష్కర స్నానాలు చేసి కాళేశ్వరముక్తీశ్వరస్వామిని దర్శించుకోనున్నారు.
సాయంత్రం 4గంటలకు గవర్నర్ శివప్రతాప్శుఖ్లా పుష్కర స్నానం చేయనున్నారు. అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. గతేడాది మేలో నిర్వహించిన సరస్వతీ ఆది పుష్కరాలకు సుమారు 40 లక్షల వరకు భక్తులు తరలివచ్చారు. అంత్య పుష్కరాలకు 30 లక్షలకు పైగా భక్తులు తరలివస్తారని అధికారుల అంచనా వేస్తున్నారు. పన్నెండు రోజులు రోజుకో పీఠాధిపతి, హోమాలు, రుద్రాభిషేకం, పూర్ణాహుతి కార్యక్రమాలు చేశారు.
కాశీ పండితులచే 12 రోజుల పాటు హారతి కార్యక్రమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఈసారి త్రివేణి సంగమంలో తెప్పోత్సవం నిర్వహించడానికి ప్రత్యేకంగా కాకినాడ నుంచి హంసవాహనాన్ని తయారు చేసి తీసుకొచ్చారు. సరస్వతీ ఘాట్‌లో భక్తుల సౌకర్యార్థం టెంట్ సిటీ నిర్మాణాలు చేపట్టారు. అందులో డిలక్స్ రూ.2వేలు, ప్రిమియం రూ.4వేలు, లగ్జరీ రూ.6 వేల ధరతో రూములు అద్దెకు ఇవ్వనున్నారు. 250 ఎకరాలు, 23 లోకేషన్లలో పోలీసులు పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. వరంగల్, కరీంనగర్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల నుంచి వచ్చే వాహనాల కోసం మూడు వైపులా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్‌ను నియంత్రించడాని వన్‌వే ప్రణాళికలను రూపొందించారు.