పన్నెండేళ్లకోసారి వచ్చే పుష్కరాలప్పుడు నదీస్నానమాచరిస్తే కోటి జన్మల పుణ్యఫలం వస్తుందంటారు. సర్వపాపాలు తొలగి ముక్తి లభిస్తుందని చెబుతారు. అందులోనూ ఇటీవల జరిగిన కాశీలోని ప్రయాగరాజ్ కన్నా త్రివేణి సంగమ స్థానంలో స్నానం చేస్తే చాలా గొప్పదంటారు. అయితే నేటి నుంచి ప్రారంభమయ్యే సరస్వతి నది(అంతర్వాహిని) పుష్కరాలకు రోజుకు లక్షకు పైగా భక్తజనం వచ్చే అవకాశం ఉంది.
కానీ కాళేశ్వరంలో సరిపడా నీళ్లు లేక ఎక్కువ మంది పుణ్యస్నానమాచరించే పరిస్థితి కనిపించడం లేదు. మేడిగడ్డ బరాజ్ నుంచి నీటిని బయటికి పంపడంతో ఈ సమస్య తలెత్తగా, ఓ వైపు పుష్కర శోభ మొదలైనా ఏర్పాట్లు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాగా గురువారం ఉదయం మంత్రి శ్రీధర్‌బాబు పుష్కరాలను ప్రారంభించగా సాయంత్రం 5గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరై పుష్కరఘాట్ వద్ద సరస్వతీమాత విగ్రహాన్ని ఆవిష్కరించి నదీస్నానం తర్వాత గోదావరి హారతి పూజల్లో పాల్గొననున్నారు.
– జయశంకర్ భూపాలపల్లి. మే 14(నమస్తే తెలంగాణ)
కాళేశ్వరంలో నేటి నుంచి జరిగే సరస్వతీ(అంతర్వాహిని) పుష్కరాలకు నీటి సమస్య తలెత్తుతుంది. రోజుకు లక్ష మంది త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తారని అధికారులు అంచనా వేస్తున్నప్పటికీ ఒకేసారి లక్ష మంది త్రివేణి సంగమంలో స్నానమాచరించే పరిస్థితి మాత్రం కనబడడం లేదు. అందుకు తగినట్లు ఏర్పాట్లు సైతం జరుగడం లేదు. మేడిగడ్డ బరాజ్ నుంచి నీటిని బయటికి పంపడంతో కాళేశ్వరంలో నీటి సమస్య ఏర్పడింది. మేడిగడ్డ, అన్నారం బరాజ్‌లలో నీరు నిల్వ చేసినన్ని రోజులు కాళేశ్వరం నిండుకుండలా కనిపించేది. నేటి నుంచి పుష్కరాలు ప్రారంభం కానుండగా ఇంతవరకు పనులు పూర్తి కాలేదు. పలు పనులు అర్ధంతరంగానే ఉన్నాయి. ఒకవైపు పుష్కరాలు జరుగుతుండగానే మరోవైపు పనులు కొనసాగించే పరిస్థితి కనిపిస్తుంది.
ప్రభుత్వం రూ.25 కోట్లతో పనులు కొనసాగించగా సింగరేణి కాలరీస్ కంపెనీ రూ.78 లక్షలు కేటాయించింది. ఇదిలా ఉండగా ఎక్కువ శాతం పనులు బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయి. బుధవారం రాత్రి 10:35 గంటలకు బృహాస్పతి మిథున రాశిలోకి ప్రవేశించే సమయంలో పుష్కర కాలం ప్రారంభం కానున్నది. గురువారం ఉదయం సూర్యోదయం నుంచి భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. నేడు (గురువారం) ఉదయం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సరస్వతీ పుష్కరాలను ప్రారంభిస్తారు. అలాగే సాయంత్రం 5గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి సరస్వతీమాత విగ్రహావిష్కరణ చేసి సరస్వతీ నదిలో పుణ్యస్నానం ఆచరించి గోదావరి హారతి తదితర పూజల్లో పాల్గొంటారు.
అలాగే రాష్ట్ర మంత్రులు, అధికారులు రానున్నారు. తెలంగాణ సహా మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, వివిధ రాష్ర్టాల నుంచి రోజుకు లక్ష మంది భక్తులు పుష్కరాలకు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. కాళేశ్వరం పరిసరాల్లో 14 పార్కింగ్ స్థలాలను, 200 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి 3,450మంది పోలీసులను బందోబస్తు కోసం నియమించారు. గోదావరిలో 40 కాటేజీలతో టెంట్‌సిటీని ఏర్పాటు చేశారు. వీటి ఒక్కో ధర సుమారు రూ.3వేలుగా నిర్ణయించారు. పుష్కరాల శోభను హెలిక్యాప్టర్‌లో వీక్షించేందుకు తొలిసారిగా భక్తుల కోసం ప్రత్యేక జాయ్ రైడ్లను సైతం ఏర్పాటు చేశారు.
పుష్కరాల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపనున్నది. హైదరాబాద్, హనుమకొండ, భూపాలపల్లి, నర్సంపేట, జనగామ, తొర్రూరు, పరకాల, మహబుబాబాద్ డిపోల నుంచి ప్రయాణికుల రద్దీకనుగుణంగా బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు వరంగల్ ఆర్ఎం విజయభాను తెలిపారు. సాధారణ టికెట్ ధరకంటే 1.5 రేట్లు చార్జి పెంచినట్లు ఆయన తెలిపారు. సరస్వతి(వీఐపీ ) ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన 10 అడుగుల సరస్వతి అమ్మవారి విగ్రహం చుట్టూ బాహుబలి సెట్టింగ్ వేశారు. విగ్రహం ఎదుట రెండు వైపులా ఙ్ఞాన దీపాలు ఏర్పాటు చేశారు. 12రోజులు కాశీ పండితులతో నవ హారతులు, పూజలు నిర్వహించనున్నారు. రోజుకో పీఠాధిపతి పుష్కరాల్లో పాల్గొంటారు.
సింగరేణి సంస్థ సరస్వతీ పుష్కరాలకు రూ.78 లక్షలు కేటాయించింది. రూ.58 లక్షలు జిల్లా కలెక్టర్‌కు, రూ.20 లక్షలు పోలీసులకు అందజేసింది. వీటితో పాటు రూ.1.25 లక్షలతో 20 టెంట్ సిటీలను ఏర్పాటు చేశారు. అలాగే సింగరేణివ్యాప్తంగా ఉన్న సింగరేణి పాఠశాలల నుంచి 19 స్కూల్ బస్‌లను తీసుకొచ్చారు. ఇవి బస్టాండ్ నుంచి పుష్కరఘాట్ వరకు భక్తులను ఉచితంగా చేరవేస్తాయి. 30మంది సెక్యూరిటీ సిబ్బంది, వైద్య సిబ్బంది, ఆంబులెన్స్, 15మంది స్కౌట్ సిబ్బంది, 15మంది గజ ఈతగాళ్లను, 10మంది వంట మనుషులను సంస్థ సమకూర్చింది. భూపాలపల్లి ఏరియా సింగరేణి జీఎం రాజేశ్వర్‌రెడ్డి కాళేశ్వరంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
మహదేవపూర్(కాళేశ్వరం)మే 14: సరస్వతి పుషరాలకు విసృ్తత ఏర్పాట్లు చేసినట్లు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఆమె కాళేశ్వరంలో పర్యటించి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. 15 నుంచి 26 వరకు జరిగే సరస్వతి పుషరాలకు వచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని ఆమె తెలిపారు.
గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొని సరస్వతి మాతా విగ్రహం, ఘాట్ ప్రారంభోత్సవం చేస్తారని, పుషర స్నానమాచరించి స్వామి వారిని దర్శించుకుంటారని, అనంతరం త్రివేణి సంగమంలో మొట్టమొదటి సారిగా కాశీ పండితులు నిర్వహించనున్న నదీ హారతిలో పాల్గొంటారని తెలిపారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఎస్పీ కిరణ్ ఖరే, ముఖ్యమంత్రి భద్రతా అధికారి వాసుదేవరెడ్డి కలిసి ఈఓ కార్యాలయంలో అధికారులతో భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. సాయంత్రం 5గంటలకు హెలికాప్టర్ ద్వారా సీఎం కాళేశ్వరం చేరుకుంటారని తెలిపారు.
– దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి శైలజా రామయ్యర్