ఖిలా వరంగల్, అక్టోబర్ 16 : సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యంగా జిల్లా కలెక్టరేట్ ప్రాంగణాలు పార్కులను తలపించేలా సుందరంగా, పరిశుభ్రంగా ఉండడం ఆనవాయితీ. కానీ వరంగల్ కలెక్టరేట్ మాత్రం అందకు భిన్నంగా అస్తవ్యస్తంగా పారిశుధ్య(Sanitation) సమస్యతో అల్లాడుతోంది. పచ్చదనం, పరిశుభ్రతపై ఉన్నత స్థాయి ఉపన్యాసాలు దంచికొట్టే అధికారులు..తమ కార్యాలయాన్ని శుభ్రంగా ఉంచాలనే కనీస ఆలోచన చేకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
దుర్గంధం వెదజల్లుతున్న చెత్త కుప్పలు
వరంగల్ కలెక్టరేట్ పాంగణంలో ఎక్కడ చూసినా చెత్తా చెదారమే కనిపిస్తోంది. చెత్త కుప్పల నుంచి దుర్గంధం వెదజల్లుతూ ఉద్యోగులకు, పనుల నిమిత్తం వచ్చే సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తోంది. అపరిశుభ్రత వాతావరణం కారాణంగా కలెక్టరేట్ మొత్తం రోగాల నిలయంగా మారుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. వర్షం వచ్చినప్పుడు నీళ్లు నిలిచి దోమలు వృద్ధి చెందుతున్నాయి. అలాగే పారిశుధ్య సమస్యతోపాటు ప్రాంగణం మొత్తం వయ్యారి భామ (పార్థేనియం) మొక్కలు విస్తృతంగా పెరిగిపోయి అధ్వాన్నంగా మారింది. ఈ మొక్కల నుంచి వెలువడే వాసన, అలర్జీ, ఆస్తమావంటి తీవ్రమై అనారోగ్యాలకు దారిస్తోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. విషయం తెలిసినప్పటికీ వాటిని తొలగించడంతో అధికారులు ఘోరంగా నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
బహిరంగ మూత్ర విసర్జన
కలెక్టరేట్లో ఒక వైపు మరమ్మతులకు గురైన శిథిలమైన వాహనాలతొ డంపింగ్ యార్డుగా మారింది. మరోవైపు చెత్తకుప్పలు, బహిరంగ మూత్ర విసర్జనకారణంగా ప్రాంగణం మొత్తం దుర్గంధం వెదజల్లుతోంది. స్వచ్ఛ భారత్ నినాదాలు కేవలం ఉపన్యాసాలకే పరిమితమా, కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచాలనే బాధ్యతను అధికారులు ఎందకు విస్మరిస్తున్నారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కలెక్టరేట్ ప్రాంగణం ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి, పారిశుధ్య నిర్వహణ లోపానికి అద్దం పడుతోంది. ఇప్పటికైన అధికారులు స్పందించి వయ్యారి భామ మొక్కలను తొలగించి పారిశుధ్య పనులను మెరుగుపరచాలని ప్రజలు, సందర్శకులు కోరుతున్నారు.
Wgl1