వాజేడు, జనవరి3: పల్లెల్లో ఇసుక క్వారీ సొసై టీ చిచ్చుపెట్టింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని చెరుకురు గ్రామపంచాయతీ పరిధిలో చెరుకురు, బయ్యారం, రేగులపాడు, మోతుకుల గూ డెం గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల పరిధిలో ఇటీవల ఇసుక క్వారీ మంజూరు కావడంతో అధికారులు డిసెంబర్ 18న చెరుకురు రైతు వేదిక వద్ద ఇసుక క్వారీ అనుమతి కోసం పీసా గ్రా మసభ నిర్వహించగా మెజార్టీ సభ్యులు మాజరుకాకపోవడంతో మరుసటి రోజుకు వాయిదా వేశారు. క్వారీ నిర్వహించబోయే బినామీ రేజింగ్ కాంట్రాక్టర్‌తో పాటు కొందరు స్థానిక నాయకు లు చక్రం తిప్పి గ్రామస్తులను ప్రసన్నం చేసుకొని గ్రామసభ ఆమోదం కోసం మెజార్టీ ఓటర్లను తరలించే ఏర్పాట్లు చేసుకున్నారు.
దీంతో డిసెంబర్ 19 తేదీన నిర్వహించిన పీసా గ్రామసభకు 501 మంది గిరిజన ప్రజలకు 210 మంది హాజరై ఇసుక క్వారీ నిర్వహణకు అంగీకారం తెలిపినట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో పోశమ్మ ఆదివాసీ మహిళా ఇసుక సొసైటీ క్వారీలో తమను సభ్యులుగా చేర్చుకుంటామని చెప్పి ఇప్పుడు మాట తప్పుతున్నందున దాన్ని రద్దు చేయాలని డిసెంబర్ 30 తేదీన బయ్యారం, రేగులపాడు, మోతుకులగూడెం గ్రామాల గిరిజనులు, జనవరి 2వ తేదీన చెరుకురు గ్రామానికి చెందిన ఇసుక సొసైటీ సభ్యులు, గ్రామస్తులు క్వారీ కొనసాగించాలని ఎంపీడీవో విజయకు వినతిపత్రాలు అందించారు. ఒకే గ్రామపంచాయతీలో ఇన్నాళ్లు కలిసి మెలిసి ఉన్న నాలుగు గ్రామాల ప్రజల మధ్య ఇసుక క్వారీ చిచ్చుపెట్టినట్లయ్యింది.
ఇసుక క్వారీ గ్రామ సభ ఆమోదం కోసం చక్రం తిప్పి గ్రామస్తులను ప్రసన్నం చేసుకున్న రేజింగ్ కాంట్రాక్టర్ ఒప్పందం ప్రకారం వారికి సహకరించకుండా ఒక వర్గం వారితోనే సఖ్యతతో ఉండడమే విభేదాలకు కారణమై ఉంటుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇతనితో పాటు కొందరు నేతల వ్యవహార శైలితోనే విబేధాలు మొదలై విడిపోయి ఇసుక క్వారీ రద్దు చేయాలని కోరే వరకు వెళ్లినట్లు తెలుస్తున్నది. అయితే మూడు గ్రామాల ప్రజలు ఇసుక క్వారీ రద్దు కోసం ఉన్నతాధికారులను త్వరలో కలువనున్నట్లు తెలిసింది. ఈవిషయంపై వాజేడు ఎంపీవో శ్రీకాంత్నాయుడును వివరణ కోరగా ఇసుక క్వారీ సొసైటీలపై అధికారం భద్రాచలం ఐటీడీఏ పీవోకు మాత్రమే ఉంటుందన్నారు. వారిని కలిసి వినతిపత్రం ఇస్తే ప్రయోజనం ఉంటుందన్నారు.